నిజం చెప్పాలంటే… భారత జట్టును ఓడించింది మనమే… అంటే మనల్ని మనమే ఓడించుకున్నాం… రుచించకపోవచ్చు ఈ కోణం… కానీ నిజం నిజమే…
ముందుగా అది ఒక ఆట అని మరిచిపోయాం… ఆటలో ఎవరైనా గెలవొచ్చుననీ మరిచిపోయాం… పర్టిక్యులర్‌గా అది వన్డే క్రికెట్ అనీ మరిచిపోయాం… ఒక మంచి వికెట్, ఒక మంచి క్యాచ్, ఒక మంచి రనౌట్ కూడా మ్యాచ్‌ను అటూఇటూ తిప్పే అవకాశమున్న ఆట అది… పైగా మనం ఆడుతున్నది పక్కా ప్రొఫెషనల్ టీంతో అనీ మరిచిపోయాం… గతంలో ఐదుసార్లు కప్పును ముద్దాడిన జట్టు అనీ మరిచిపోయాం… చివరి బంతి దాకా పోరాటం ఆపని వాళ్లతో ఆడుతున్నామనీ మరిచిపోయాం… మొదట్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండి, పోరాట పటిమతో ఫైనల్స్ దాకా వచ్చి చేరిన జట్టనీ మరిచిపోయాం…
స్టార్ హీరో సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ చేసినట్టు… ఈ మ్యాచ్‌కూ అదే హంగామా… ఇక ఇండియన్స్ గెలిచినట్టేననీ, కేవలం కప్పు అందుకునే సెరిమనీ మాత్రమే బాకీ ఉందనీ, అహ్మదాబాద్‌లో ఇప్పుడు జరిగేది బహుమతి ప్రదానం అన్నట్టుగా వ్యవహరించాం… ప్రధాని సహా పెద్ద పెద్ద పొలిటికల్, సినిమా, స్పోర్ట్స్, ఇండస్ట్రియల్, కార్పొరేట్ సెలబ్రిటీలు స్టేడియానికి క్యూ కట్టారు… సోషల్ మీడియా ఓ ఉన్మాదంతో ఊగిపోయింది… దేశవ్యాప్తంగా స్పెషల్ స్క్రీన్లు, అందరమూ కళ్లప్పగించాం…
Ads
ఎయిర్‌ఫోర్స్ విమానాల విన్యాసాలు… అందరికీ ఫ్రీ జెర్సీలతో నీలి సముద్రాన్ని తలపించిన స్టేడియం… ప్రత్యేక గీతాలాపనలు… అయిదారు కోట్ల మంది ప్రత్యక్ష వీక్షణం… జట్టు మీద అత్యంత భారీ నమ్మకం… వెరసి ఎంత ఒత్తిడి జట్టు మీద… క్రికెట్‌లో ఎప్పుడూ ఒత్తిడి నష్టదాయకమే… కొంతవరకు మాత్రమే ఒత్తిడి, ప్రేక్షకుల జోష్ జట్టుకు ప్రేరణగా ఉంటాయి… కానీ మితిమీరితే ఆ అంచనాలకు అందుకోవడం కష్టం అవుతుంది…
గెలిస్తే గుడ్… పండుగ చేసుకుందాం దేశమంతా… జాతికి అదొక ఉత్సాహం… ఉత్తేజం… కులాల్ని, మతాల్ని, రాష్ట్రాల్ని, అందరినీ ఒక్కదగ్గర కట్టేసేది క్రికెట్… మంచిదే… కానీ ఓడితే..? మామూలుగా ఓడిపోతే పర్లేదు, ఆటలో ఇవన్నీ సహజం అనుకుంటాం… కానీ ఇంత హైప్ తరువాత ఓడిపోతే ఆ నిరాశ, ఆ అసంతృప్తిని తట్టుకోవడం కష్టం… వాటిని బయటపెట్టేసుకోవాలి కాబట్టి ఆటగాళ్లను తిట్టేస్తాం సోషల్ మీడియాలో… ఫలానా బాల్ ఇలా వేసి ఉంటే బాగుండు, అరెరె, ఆ షాట్ అనవసరంగా కొట్టాడు, ఇలా ఆడి ఉంటే బాగుండు, వాడిని అనవసరంగా ఆడించారు వంటి ఎన్నో విశ్లేషణలు…
ఫీల్డ్‌లో ఉన్నవాడికి తెలియదా ఎలా ఆడాలో…? ఎవడైనా ఉద్దేశపూర్వకంగా వికెట్ పారేసుకుంటాడా..? ఓడిపోయారు కాబట్టే మన ప్లేయర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు… ఉద్వేగపు చెరువుకట్టలు తెగిపోయి నీళ్లు మత్తళ్లు దూకాయి… ఎస్, మనం ఓడిపోయాం, ఓ మేలిమి జట్టు మీద ఓడిపోయాం… మనం వాళ్ల ఆటను అభినందించడం మానేశాం… వాళ్లు ఈ కప్పు ముద్దాడటానికి అర్హులనీ మరిచిపోయాం… ఎంత తెలివిగా, ఎంత జాగ్రత్తగా వాళ్ల ఇన్నింగ్స్ నిర్మించారు… ఒక దశ దాటాక వాళ్లకు పరుగులు వాటంతటవే వచ్చాయి… వాళ్ల ఫీల్డింగ్ ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి… మెరికలు… అదే వాళ్లకు కనీసం 40 పరుగుల ఫాయిదాను ఇచ్చింది…
లక్షా ముప్ఫయ్ వేల మంది ప్రేక్షకుల ఎదుట ఆ ఒత్తిడిని వాళ్లు జయించిన తీరు అపూర్వం కాదా..? సో, క్రికెట్ గెలిచింది, ఆట గెలిచింది… ఎవడో ఒకడు గెలుస్తాడు, వాడికి ఎదుటోడు ఓడిపోతాడు… సహజం… ఆట అంటేనే అది కదా… జాతి యావత్తూ ఊగిపోతోంది కదాని ఆట దాసోహం అనదు కదా… అయిపోదు కదా… పోనీ, మనం ఇదే పిచ్చిని వేరే ఆట మీద చూపిస్తామా..? లేదు, వేరే ఆటల్లో మనవాళ్లు ఎన్ని విజయాలు సాధించడం లేదు… ఎన్ని మెడల్స్‌ను మెడల్లో వేసుకుని సంబరపడటం లేదు… అవేవీ మనకు ఆనవు… ఎందుకు..? మనకు క్రికెట్ అంటే మాత్రమే పిచ్చి కాబట్టి…!!
పైగా మనకు వ్యక్తిపూజ అనే దరిద్రం ఉండనే ఉంది… స్టార్ హీరోలను దేవుళ్లుగా పూజించినట్టే క్రికెటర్లనూ ప్రేమిస్తాం… పూజిస్తాం… ఇదేమిటోయ్ ఈ హంగామా, ఓడిపోతే ఎలా మరి అని ఎవడైనా అంటే వాడిని దేశద్రోహిగా ముద్రేస్తాం… మరీ తిక్క రేగితే తన్నేస్తాం… ఆటను ఆటలా చూస్తే కదా… పోనీ, ఇదే క్రికెట్‌లో ఆడవాళ్ల ఆటను ఎప్పుడైనా ఎవడైనా ఇంత ప్రేమగా చూశాడా..? మగ క్రికెట్‌కు మాత్రమే ఈ వెలుగుజిలుగులు… ఈ ఆట ఒక సరుకు… వేల కోట్ల దందా… జూదం, బెట్టింగులు…
మన ఉద్వేగాల్ని మనమే వందల రెట్లకు పెంచుకున్నాం… ఎదుటోడి వికెట్ పడితే 126 డెసిబుల్స్‌తో హోరెత్తిన స్టేడియం మన వికెట్ పడితే పిన్ డ్రాప్ సైలెంట్… చివరకు మన చేతిలో ఉన్న కప్పును ఎవడో దొంగిలించుకుని పోతున్నట్టు బాధపడిపోయాం… మొదట్లో మందకొడిగా ఉన్న పిచ్, కాస్త మంచు కురవడం స్టార్ట్ కాగానే ప్రత్యర్థికి అనుకూలించింది… వికెట్లు కాపాడుకుంటే చాలు రన్స్ అలవోకగా వచ్చి పడ్డయ్… ఇద్దరు ప్లేయర్లు, సరిగ్గా చెప్పాలంటే ‘హెడ్’ ఒక్కడే ఒంటి చేత్తో గెలిపించాడు… పరిస్థితి అలా అనుకూలించింది…
అలాగని మన రోహితో, మన కోహ్లీయో, మన షమీయో తక్కువ కాదు కదా… లీగ్ మ్యాచులన్నీ గెలిపించారు కదా… సెమీస్ ఘనంగానే నెగ్గారు కదా… సో, మనవాళ్లు వెధవాయిలు ఏమీ కాదు… ఎదుటోళ్లు తీసిపారేసే సరుకు కాదు… అందుకే… ఎవరినీ నిందించే పనిలేదు… ఆ ఆటను ఒక రోజంతా ఆస్వాదించాం… అంతే… ఆ రోజును జాతి యావత్తూ పండుగలా జరుపుకుంది… మీమ్స్, జోక్స్, పోస్టులు, ఫోటోలతో సోషల్ మీడియా ప్రతిరోజుకన్నా వందరెట్లు మెరిసింది… అంతే… గెలిస్తే ఈ ఆనందం వంద రెట్లు ఉండేది… కానీ ఆ విజయమాల మన మెడలోనే పడాలని ఏమీ లేదు… సో, చల్నేదో బాల్‌కిషన్…
మనతో పాకిస్థాన్ గనుక ఫైనల్ ఆడి ఉంటే… ఆ ఆటలో పాకిస్థాన్ గనుక గెలిచి ఉంటే… ఇంకెలా ఉండేదో…
Share this Article