మనం ముందే చెప్పుకున్నాం కదా… జగన్ వర్సెస్ నిమ్మగడ్డ సినిమాలో మొదటి రీల్ కూడా పూర్తికాలేదు ఇంకా…! మొదటి రీల్లోనే ఇన్ని ట్విస్టులు, ఇంత హంగామా, ఈస్థాయి హైప్ ఏర్పడిందీ అంటే… రాను రాను కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెర మీద చూడాల్సిందే… వ్యవస్థల ఘర్షణ ఓపట్టాన తెగదు… అసలే ఎన్నికల వేడి, రోజుకో నిర్ణయం… నా అసలు అధికారం ఏమిటో చూపిస్తా అన్నట్టుగా కసిగా అడుగులు వేస్తున్న నిమ్మగడ్డ… సరే, కానివ్వు, ఎక్కడికక్కడ కౌంటర్లు చేస్తాం అన్నట్టుగా ప్రభుత్వం… నడుమ తెలుగుదేశం అధినేత ఏం చేస్తున్నాడనేది రహస్యం… నిమ్మగడ్డను కెలకడానికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి పరుషమైన పదాలతో దాడికి దిగారు… మంత్రులపై తను చర్యలు తీసుకోలేడు కదా… గవర్నర్‌కు లేఖ రాశాడు నిమ్మగడ్డ… వాళ్లు పన్నిన ట్రాపులోకి నేరుగా ప్రవేశించాడు… ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ ఆ లేఖలో రాసిన అంశాలు మాకు మనస్తాపాన్ని కలిగించాయి అంటూ వెంటనే వాళ్లు స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ పంపించారు… ఆయనకు విషయతీవ్రత తెలుసు కదా… వెంటనే ప్రివిలేజ్ కమిటీకి అప్పగించేశాడు… ఇక బంతి ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధనరెడ్డి కోర్టులోకి వచ్చి పడింది…
వైసీపీ వేసిన బ్రహ్మాస్త్రం పవర్ ఎంతో నిమ్మగడ్డకు తెలుసు… అందుకే వెంటనే రాజ్యాంగవ్యవస్థలు ఒకదాంట్లో ఒకటి జొరబడొద్దు అనే వ్యాఖ్యలకు దిగాడు… విషయం ఇంతదూరం వచ్చాక, ఎవరి అధికారాల్ని వాళ్లు నిరూపించుకునే పట్టుదలతో ఉన్నప్పుడు… ఒకరి పరిధిలోకి ఒకరు రావొద్దు అనే వ్యాఖ్యలకు విలువ ఎక్కడిది..? నిజంగానే కాకాణి వెంటనే మీటింగు పెట్టేసి, ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా స్పీకర్‌కు నివేదిక ఇస్తే, స్పీకర్ అనివార్యంగా నిమ్మగడ్డ మీద చర్యలకు పూనుకుంటే… కథ పాకాన పడుతుంది… అప్పుడు నిమ్మగడ్డ ఏం చేయాలి..? అనివార్యంగా కోర్టుకు పోవాలి… కోర్టులకూ, అసెంబ్లీలకు నడుమ గతంలో బోలెడు అంశాల మీద ‘ఘర్షణ’ ఉదాహరణలున్నయ్… కానీ స్పీకర్ స్థిరంగా తన నిర్ణయం మీద నిలబడితే… సుప్రీం దాకా పోరాడటానికీ సై అంటే… చట్టసభ అధికారమే పవర్ఫుల్ అని తేలొచ్చు బహుశా..!
Ads
గతంలో చెప్పాను, అవసరమైతే సీబీఐ ఎదుట ఇప్పటికీ మళ్లీ సాక్ష్యం చెబుతానన్నట్టుగా నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాంపులో సెగపుట్టించాయి… (వైఎస్ హయాంలో ఆయన ఆర్థిక కార్యదర్శిగా చేశాడు…) ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయాల్సిన సందర్భం ఏముంది..? అకారణంగా సీఎంను బెదిరిస్తున్నాడా అంటూ ఆ క్యాంపు రుసరుసలాడుతోంది… నిన్న వైసీపీ సోషల్ మీడియా తెర మీదకు ఓ కేసు తీసుకొచ్చింది… గతంలో, అంటే 2008లో మహారాష్ట్ర స్పీకర్ అప్పటి ఎన్నికల కమిషనర్‌ను జైలుకు పంపించాడు అనేది వార్త… నిమ్మగడ్డ తప్పించుకోలేడు అని వాళ్ల పోస్టుల సారాంశం… నిజానికి ఆ కేసు 2006లో మొదలైతే 2008 దాకా నడిచింది… నిమ్మగడ్డపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు అనే ఎపిసోడ్ ఎంత వేగంగా నడవాలని జగన్ కోరుకున్నా… రెండు నెలల్లోనే నిమ్మగడ్డ రిటైర్మెంట్… ‘మాజీ’ అయిపోయినా సరే, వదిలేదు అనే స్టాండ్ తీసుకుంటే అది వేరే సంగతి… కోర్టులు వర్సెస్ ఏపీ అసెంబ్లీ దాకా పోతుందా ఇష్యూ..? సరే, ఇదంతా వదిలేస్తే ఏకగ్రీవాలు అనేది కూడా నిమ్మగడ్డను ఇరకాటంలో పడేసే సూచనలున్నయ్… ఎక్కడా లేనిది ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకంగా ఉండటం విచిత్రమే… ఒకవేళ నిర్బంధంగా చేయిస్తున్నారు అనే పక్షంలో, అలా గాకుండా చూడాల్సిన బాధ్యత తనదే… పాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాల్ని ఏం చేయాలో ఇంకా నిర్ణయం లేదు… ఇప్పుడు ఏకగ్రీవ సర్పంచుల సంఖ్య పెరిగితే ఏం చేయాలి..? సో… పిక్చర్ అభీ బహుత్ బాకీ హై…!!
Share this Article