Bharadwaja Rangavajhala…….. రావో! మము మరచితివో… దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బరామన్. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలసవెళ్లిన కుటుంబం నుంచి వచ్చిన సుబ్బరామన్ ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు.
చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బురామన్ కి. పరిస్థితిని గమనించిన తండ్రి కుంభకోణంలో కర్ణాటక సంగీతం నేర్పించడానికి సిద్దమయ్యారు. పదేళ్ల శిక్షణ అనంతరం మద్రాసు చేరి పియానో నేర్చుకున్నారు. హెచ్ఎమ్వీలో హార్మోనియం ప్లేయర్ గా జీవితం ప్రారంభించారు.
1943లో అంటే 22 ఏళ్ల వయసులో చిన్నయ్య, సాలూరి రాజేశ్వర్రావుల తో కలసి తమిళనాడు టాకీసు వారి చెంచులక్ష్మి సినిమాకు సంగీతం అందించారు. అందులో రెండు పాటలు కంపోజ్ చేసే అవకాశం దక్కింది. ఇక వెనక్కు తిరిగి చూడలేదు. చెంచులక్ష్మి లో టైటిల్స్ పడేప్పుడు ఆయన విపిపించిన నేపధ్యసంగీతం కూడా బోల్డు పాపులార్టీ సాధించింది. కేవలం ఆ సంగీతమే ప్రత్యేకంగా రికార్టుగా విడుదలై విజయవంతమైంది.
Ads
బాలరాజు చిత్రానికి గాలి పెంచల నరసింహారావుతో కల్సి సంగీత దర్శకత్వం వహించారు సుబ్బురామన్. అందులో ఓ బాలరాజా అంటూ ఎస్.వరలక్ష్మి ఆలపించిన పాట సుబ్బురామన్ కంపోజ్ చేసిందే. సుబ్బురామన్ సినీ సంగీత ప్రపంచంలో కాలూనుకుంటున్న వేళల్లోనే ఘంటసాల ప్రవేశం జరిగింది.
భానుమతి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన లైలామజ్నూకు సుబ్బురామనే స్వరకర్త. అందులో పయనమయే ప్రియతమ నను మరచిపోకుమా అనే ఓ విషాదగీతాన్ని ఘంటసాలతో పాడించారు. పాటలోని భావాన్ని ప్రేక్షకుల హృదయాలకు గురి పెట్టే గాయకుడుగా ఘంటసాలకు ఆ పాట చాలా పాపులార్టీ తెచ్చింది.
తెలుగు సినిమాలకు సంబంధించి సుబ్బురామన్ కు చాలా ప్రోత్సాహాన్ని అందించారు సముద్రాల రాఘవాచార్య. ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి భరణీ నుంచి బయటకు వచ్చిన డి.ఎల్.నారాయణ, సముద్రాల, డైరక్టర్ వేదాంతం రాఘవయ్యలతో కల్సి దేవదాసు చిత్ర నిర్మాణం లో పాలుపంచుకున్నారు.
సుబ్బురామన్ సంగీతాన్ని విపరీతంగా ఇష్టపడ్డ వారిలో భానుమతి ఒకరు. తను స్వయంగా సంగీతజ్ఞురాలు కావడంతో సుబ్బురామన్ సంగీతంలోని గొప్పతనాన్ని అర్ధం చేసుకున్నారు భానుమతి. తను దర్శకత్వం వహించిన చండీరాణి కి కూడా సుబ్బురామన్నే సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. అయితే ఎమ్ఎస్ విశ్వనాథన్ కంప్లీట్ చేశారు. అందులో ఘంటసాల, భానుమతి పాడిన ఓ తారకా పాట ఇప్పుడు విన్నా కొత్తగానే అనిపిస్తుంది. అది ఎమ్మెస్వీ చేసిన పాటే.
రావు బాలసరస్వతి, పిఠాపురం నాగేశ్వరరావు లాంటి అప్పటి యువ గాయనీ గాయకులను ప్రోత్సహించారు సుబ్బరామన్. అంతే కాదు తన దగ్గర ఖాళీ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఓ వాయిద్యకారుడు వస్తే అతన్ని నిరుత్సాహపరచేవారు కాదు. అలా ఎందరికో సినిమా మార్గంలో జీవనయానానికి అవసరమైన ఆదరువు చూపించారు సుబ్బరామన్.
భరణీ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చిన డి.ఎల్, వేదాంతం, సముద్రాలలతో కల్సి చేపట్టిన దేవదాసు ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు సుబ్బురామన్. నిజానికి అప్పటికే ఆయన నలభై చిత్రాలకు మ్యూజిక్ కంపోజరు. చండీరాణికి సంగీతం అందిస్తున్న సందర్భంలోనే దేవదాసు ఐడియా ప్రారంభమైంది.
దేవదాసు లో జగమే మాయ తప్ప దాదాపు అన్ని పాటలకూ సుబ్బురామనే స్వరాలు అందించారు. దేవదాసు చిత్రం పూర్తి చేయకుండానే సుబ్బురామన్ కు నూరేళ్లూ నిండాయి. అప్పటికి ఆయన వయసు ముప్పై ఒక్కటి. చిన్నప్పట్నించి ఉన్న ఫిట్స్ రోగమే ఆయన్ను తీసుకెళ్లిపోయింది అంటారు. కాదు హత్యే అనేవాళ్లూ లేకపోలేదు.
అప్పటికి ఆయన చండీరాణి, దేవదాసు, బ్రతుకు తెరువు చిత్రాలు చేస్తున్నారు. వీటిలో మొదటి రెండు చిత్రాల బాధ్యత సుబ్బురామన్ శిష్యుడు ఎమ్.ఎస్.విశ్వనాథన్ వహించారు. బ్రతుకు తెరువు మాత్రం ఘంటసాల పూర్తి చేశారు. దేవదాసు సమయంలో ఘంటసాలకూ సుబ్బురామన్ కూ ఏవో విభేదాలొచ్చాయట. దీంతో వేరే గాయకుడితో ప్రయత్నించారు కూడా. భావం పలకకపోవడంతో మళ్లీ ఘంటసాలతోనే కంటిన్యూ అయ్యారు.
సుబ్బరామన్ అంటే ఘంటసాలకు చాలా గౌరవం.
తాను స్వయంగా అప్పటికే సంగీత దర్శకుడుగా పాపులర్ అయి ఉండీ కావాలని సుబ్బరామన్ దగ్గర అసిస్టెంటుగా పనిచేశారు. సుబ్బరామన్ మీదున్న ప్రత్యేక అభిమానంతోనే ఆయన ప్రారంభించిన బ్రతుకుతెరువులో తను చేసిన కంపోజిషన్స్ కూ సుబ్బురామన్ పేరే వేయమన్నారు ఘంటసాల.
దేవదాసులో సుబ్బురామన్ వదిలేసిన రెండు పాటల్లో ఒకటి జగమే మాయ. రెండోది ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా అనే క్షేత్రయ్య పదం.
ఈ రెంటిడినీ విశ్వనాథన్, రామ్మూర్తిల ధ్వయం కంప్లీట్ చేసేసింది. అయితే వారిద్దరూ ఎక్కడా ఆ విషయం ప్రత్యేకంగా చెప్పుకోకపోవడం గురువు మీద వారికున్న భక్తికి నిదర్శనం. సుబ్బరామన్ జీవించింది చాలా తక్కువ సంవత్సరాలే. అంతా కలిపి ముప్పై రెండేళ్ల జీవితంలో ఆయన చేసిన కృషి మాత్రం అసామాన్యం.
ఏది ఏమైనా సంగీత దర్శకుడుగా సుబ్బరామన్ దక్షిణాది సినీ సంగీతం మీద వేసిన ముద్ర మాత్రం అసామాన్యం. సుబ్బరామన్ … ఎమ్మెల్ వసంత కుమారితో కలసి పాడిన పాటొకటి ఉంది. పాపులలో పెనుపాపి అంటూ సముద్రాల సీనియర్ రాసిన గీతం అది. కృష్ణన్ డైరక్ట్ చేసిన పెళ్లి కూతురు చిత్రంలో గీతం ఇది. …
Share this Article