తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ … అతను ఊరికి పెద్ద. ప్రేమించింది ఒకర్ని, పెళ్లి చేసుకుంది మరొకర్ని. తప్పలేదు. ఊరిని ఒకటిగా నిలపడానికి అదొక్కటే దారి! భార్య పల్లెటూరి అమాయకురాలు. చదువు లేదు. కానీ బోలెడంత సంస్కారం ఉంది. భర్తపై ఎనలేని ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోడానికి ఆమెను పడకటింటికి పిలిచాడు. దగ్గరగా కూర్చోబెట్టుకొని పాట పాడమన్నాడు.
గీత రచయితలకు ఇలాంటి సందర్భాలకు అరుదుగా దొరుకుతాయి. ఆ క్షణాన ఆ సందర్భానికి అందమైన పదాలు రాయడం వేడుక. తమిళ రచయిత వాలి గారు అద్భుతంగా రాశారు.
“ఇంజి ఇడుప్పళగా.. మంజసెవప్పళగా..
Ads
కళ్లసిరిప్పళగా.. మరకమనం కూడదిల్లయే”
కమల్‌హాసన్, శివాజీ గణేశన్, రేవతి, గౌతమి నటించిన ‘దేవర్‌మగన్’ సినిమాలో పాట ఇది. ఏమిటి ఈ వాక్యాలకు అర్థం? “అల్లం లాంటి అందమైన నడుమున్నవాడా.. నీ పసుపుపచ్చ మేనిఛాయ అందంగా ఉంది. నీ దొంగ నవ్వు అందంగా ఉంది. అది మరిచిపోయేందుకు సాధ్యపడటం లేదు”
సినిమాలో ఈ పాట రేవతి పాత్ర పాడుతుంది. తనొక పల్లెటూరి అమాయకపు ఇల్లాలు. ఆమె నోటికి వచ్చినవి ఏవో పల్లె పదాలు. కచ్చాపచ్చా రూపంతో తీరుగా ఇమిడే అల్లంతో నడుమును పోల్చింది. మేనిఛాయను పసుపుతో పోల్చింది.
అల్లం లాంటి నడుము అనే పోలిక తమిళవాళ్లకు కుదిరింది. పాటలో చక్కగా ఇమిడింది. కానీ అలా మనం పాట మొదలుపెట్టలేం! తప్పు అని కాదు, మన నేటివిటీకి అది కుదరదు. ఎలా మరి? ఏదో ఒకటి రాసేద్దాం అంటే సందర్భం చాలా ముఖ్యమైనది. పైగా రేవతి గారి టైట్ క్లోజ్ షాట్! పెదాల కదలిక సరిగా రాకపోతే జనం మెచ్చరు.
వెన్నెలకంటి గారు ‘క్షత్రియపుత్రుడు’ సినిమాలో ఈ సమస్యను చక్కగా పరిష్కరించారు.
‘సన్నజాజి పడక.. మంచె కాడ పడక.. చల్లగాలి పడక..
మాట వినకుందీ ఎందుకే’
తమిళ పదాలకు ఏమాత్రం పోలిక లేకుండా, తమిళ సాహిత్యానికి ఏమాత్రం తగ్గకుండా రాశారు. జోహార్ వెన్నెలకంటి! అక్కడా ఇక్కడా ఎస్.జానకి గారు అత్యద్భుతంగా పాడారు.
శిష్యుడే ఇలా ఉంటే గురువు గారు మరికాస్త ఘనంగా ఉండాలి కదా! వెన్నెలకంటి గురువుగారు రాజశ్రీ గారు. సినీ అనువాద సాహిత్య బ్రహ్మ. దాదాపు వెయ్యి సినిమాలకు మాటలు రాశారు. అనువాద పాటలను అచ్చ తెలుగు పాటలుగా రాయడంలో అందె వేసిన చేయి. ఆయనకో సందర్భం దొరికింది.
పరువాల హొయల సోయగంతో తుల్లిపడుతున్న ఆడపిల్ల. తన మనసుకు నచ్చిన వాడు ఒక పాట పాడమన్నాడు. ఏం పాడాలి? ఎవరి గురించి పాడాలి? అతని గురించే! తన మనసులో మాటను చెప్పాలి. తమిళంలో శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల జంటగా వచ్చిన ‘జంటిల్‌మెన్’ సినిమాలో సన్నివేశం ఇది. ఈ సందర్భానికి తమిళంలో వైరముత్తు చక్కటి మాటలు రాశారు.
“ఎన్ వీట్టు తోట్టత్తిల్ పూవెల్లాం కేట్టుప్పార్
ఎన్ వీట్టు జన్నల్ కంబి ఎల్లామె కేట్టుప్పార్
ఎన్ వీట్టు తెన్నన్‌గిట్రై ఇప్పోదై కేట్టుప్పార్
ఎన్ నెంజై సొల్లుమే”
ఈ వాక్యాల అర్థమేంటి?
“మా ఇంటి తోటలోని పూలను అడిగి చూడు
మా ఇంటి కిటికీ ఊచల్ని అడిగి చూడు
మా ఇంటి కొబ్బరితోటను ఇప్పుడే అడిగి చూడు
నా హృదయం ఏమిటో చెప్తుంది”
ఇదే పాట తెలుగులో కావాలి. తొలి లైన్ ‘ఎన్ వీట్టు తోట్టత్తిల్ పూవెల్లాం కేట్టుప్పార్(మా ఇంటి తోటలోని పూలను అడిగి చూడు)’ని తెలుగులో రాయొచ్చు. అక్కడ నేటివిటీ సమస్య లేదు. కానీ రెండో లైన్ ‘ఎన్ వీట్టు జన్నల్ కంబి ఎల్లామె కేట్టుప్పార్(మా ఇంటి కిటికీ ఊచల్ని అడిగి చూడు)’ని యథాతథంగా రాయలేం! ‘ఎన్ వీట్టు తెన్నన్‌గిట్రై ఇప్పోదై కేట్టుప్పార్(మా ఇంటి కొబ్బరితోటను ఇప్పుడే అడిగి చూడు)’ని కూడా మక్కీకి మక్కీ దించలేం! అమ్మాయి మనసు కిటికీ ఊచలకు, కొబ్బరితోటలకు తెలియడం అనే ఊహ బాగానే ఉన్నా పాటలో తాళానికి అవి రాయడం ఇబ్బంది. పైగా ఎబ్బెట్టుగా ఉంటుంది.
రాజశ్రీ గారు ఎలా రాశారో చూడండి!
“నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ ఊసే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే”
వాహ్! రాజశ్రీ గారు. అనువాదంలో నిజంగా ఆయన మహారాజశ్రీ! ఇంత చక్కని మాటలు వింటే ఎవరైనా ఇది అనువాదం అనుకుంటారా?
ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. తమిళ వాళ్ల నేటివిటీకి, తెలుగు వాళ్ల క్రియేటివిటీకి పొత్తు కుదరని పక్షంలో రచయితలు తమ ప్రతిభతో ఆ పరిస్థితిని గట్టెక్కించారు. అందమైన భావాలకు పదాలు పేర్చి పాటల్ని జనరంజకం చేశారు. ఒక్కోసారి అవి తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించాయి.
‘జెంటిల్‌మెన్’ సినిమాలోనే మరో పాట ఉంది. తమిళంలో అది ‘ఉసిలంపట్టి పెన్‌కుట్టి’ అని సాగుతుంది. ‘ఉసిలంపట్టి’ అనేది మదురై జిల్లాలో ఒక పట్టణం. ఇదే పాట తెలుగులో రాసేటప్పుడు రాజశ్రీ గారు ‘ముదినేపల్లి మడిచేలో’ అని రాశారు. మీరు నోటితో పలికేటప్పుడు ‘ముదినేపల్లి’, ‘ఉసిలంపట్టి’ పదాలు ఒకేలాగా వస్తాయి. ఆ Lip Sink జ్ఞానం రాజశ్రీ గారికి ఉంది కాబట్టే ఈ పాటతో ముదినేపల్లికి శాశ్వత గౌరవం కల్పించారు. ఈ పాట తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
ఇలాంటిదే మరొకటి! మణిరత్నం గారి ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నాలనే’ పాటను వేటూరి గారు తెలుగులోకి అనువదించారు. తమిళంలో వైరముత్తు గారు ‘ఉన్నై పార్తెందేన్ తాయ్‌మొళి మరందే'(నిన్ను చూస్తుంటే నా మాతృభాష మర్చిపోతున్నాను) అని రాస్తే, దాన్ని వేటూరి గారు ‘నీ నమాజుల్లొ ఓనమాలు మరిచా’ అని అతి సొగసుగా అనువాదం చేశారు. తమిళంలో ఆ లైన్ పెద్దగా పాపులర్ కాలేదు. తెలుగులో మాత్రం నేటికీ ప్రత్యేకంగా చెప్పుకొంటాం.
అనువాద రచన ఉత్త Google Translation కాదు. దానికంటూ ప్రత్యేకమైన కృషి, నేర్పు, నైపుణ్యం కావాలి. అందుకోసం సాధన చేయాలి… – విశీ
Share this Article