Kandukuri Ramesh Babu ………. విను తెలంగాణ – ‘గంజాయి తెలంగాణ’: ఒక హెచ్చరిక….. మనం చూస్తున్న అనేక వార్తలు గంజాయి పట్టుబడటం గురించే. కానీ ఆ గంజాయి చాపకింద నీరులా పల్లెటూర్లకు ఇదివరకే చేరిందని, ఇప్పటికే మత్తుకు బానిసలైన యువత కొన్ని చోట్ల ఆత్యహత్యలు కూడా చేసుకున్నారని తెలిసి ఆందోళనతో ఈ వ్యాసం రాయవలసి వస్తోంది.
పదేళ్ళ పరిపాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మౌలిక మార్పులను క్షేత్ర స్థాయిలో పరిశీలించే ప్రయత్నంలో తీవ్ర భయాందోళనకు గురిచేసే మరో అంశం, రేపటి పౌరులు మత్తుకు భానిసలవుతున్న క్రమం. అది ‘మత్తు’ కూడా కాదు, నిర్వీర్యం అవుతున్న దశ. ఈ స్థితి రానున్న రోజుల్లో ఇంటింటా సంక్షోభానికి గురిచేయనున్నదని చెబుతూ తక్షణం పౌర సమాజాన్ని స్వచ్ఛంద కార్యాచరణకు నడుం కట్టవలసిందే అని హెచ్చరించ వలసి వస్తోంది.
మలి తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు మొదలయ్యాక కొద్ది మంది మేధావులు, డాక్టర్లు, కౌన్సిలర్లు ఒక సామాజిక బాధ్యతగా యువత ఆత్మహత్యల నివారణకు చేసిన ప్రయత్నం గుర్తుండే ఉంటుంది. అటువంటిది ఇప్పుడు మొదలెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. లేకపోతే అత్యంత వేగంగా స్వరాష్ట్రంలో మన పిల్లలు మనకు దక్కకుండా పోతారని చెప్పక తప్పదు.
Ads
ఎక్కడి కక్కడ ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, పేరెంట్స్ కమిటీలు, వైద్యులు, కౌన్సిలర్లు బృందాలుగా ఏర్పడి కాలేజీలు మొదలు పాఠశాలలకు వెళ్లి ఈ సమస్యను అడ్రస్ చేయవలసిన అగత్యం ఎంతైనా ఉన్నది. వీలైతే ఇండ్లల్లకు వెళ్లి మాట్లాడే వెసులు బాటు కోసం ఒక ‘ఆత్మీయ సంఘటన’ అవసరం. ఇందుకు కొత్తగా ఏర్పడే రేపటి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తూనే ప్రజలుగా స్వచ్ఛంద కార్యాచరణకు నడుం కట్టక తప్పదని చెప్పక తప్పదు.
వాస్తవానికి స్వరాష్టంలో నిరుద్యోగ సమస్య గురించి మనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. జాబ్ క్యాలండర్ కోసం డిమాండ్ చేస్తున్నాం. కానీ అది మెరుగైన జీవితం కోసం. శాశ్వతమైన ఉపాధి కోసమే. కానీ విద్యార్థులు, ముఖ్యంగా బడీడు పిల్లల గురించి మనం తక్షణం జాగురూకత వహించాలి. అది రేపటి మన పౌరుల కోసం. వారి ఆరోగ్యవంతమైన జీవితం కోసం.
ఐతే, మనం కొన్ని అసాధారణ స్థితుల గురించి ఆలోచనలు చేస్తున్నాం. మన యువత జీవన శైలిలో మార్పుల గురించి దిగులు పడుతున్నాం. వాళ్ళు బెట్టింగ్ లు కడుతున్నారని విచారిస్తున్నాం. రకరకాల మనీ లెండింగ్ యాప్స్ కి అలవాటు పడుతున్నారని ఆందోళన చెందుతున్నాం. పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారని విలపిస్తున్నాం. ఆ క్రమంలో కొందరు చనిపోవడం తెలిసి గుండె బాదుకుంటున్నాం.
కానీ ఈ వ్యాసకర్త పరిశీలనలో పెద్ద ఎత్తున బాలురు, విద్యార్థులు ఒక పెను ప్రమాదంలో పడ్డారని తెలిసింది. వీరంతా గంజాయి మత్తుకు బానిసలైన క్రమంలోనే పైన పేర్కొన్న విచారకరమైన పర్యవసానాలు జరిగాయని గ్రహించడం విచారకరం. అవన్నీ విడివిడి అంశాలు. ఐతే, మత్తుకు బానిసలైన పిదపే ఇవన్నీ వారు నిరభ్యంతరంగా చేయడానికి కావలసిన ధైర్యం పొందుతున్నారని తెలిసి వచ్చింది.
కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియకుండా వారి అకౌంట్ల నుంచి లక్షలకు లక్షలు బెట్టింగ్ ల ద్వారా కోల్పోయిన సంగతి తెలిసింది. అ తర్వాత తీరిగ్గా ఆ తల్లిదండ్రులకు తెలిసిందేమిటీ అంటే తమ అబ్బాయి గంజాయి మత్తులోనే ఇవన్నీ చేశాడని. ఒక వైపు కోల్పోయిన డబ్బులతో అలాంటి కుటుంబాలు దివాలా తీస్తుండగా మరివైపు తోడు కొడుకులను కౌన్సిలింగ్ కి ఎక్కడికి పంపాలో తెలియని స్థితిలో ఆ కుటుంబాలు నేడు కొట్టుమిట్టాడుతున్నాయి. కొందరు కోపంతో పిల్లలను మందలించడంతో వారు ఆత్మహత్యలు చేసుకున్న ఉదారణలూ ఉన్నవి.
ఇవన్నీ యువ మంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రిగా పేరొందిన కేటి ఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఉన్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయ్. మొత్తంగా మూడోసారి పరిపాలనకు రావాలనుకుంటున్న రాష్ట్రంలో అంతటా ఉన్నవి.
ఈ వ్యాసకర్త చాలా జిల్లాలు, నియోజక వర్గాలు తిరిగితే, అది ఉమ్మడి పాలమూరు కావొచ్చు, సింగరేణి బెల్ట్ కావొచ్చు, నేడు తెలంగాణా వ్యాప్తంగా గ్రామాల్లోకి కూడా ఈ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్నదని తెలిసింది. వేగంగా ఈ గంజాయి వలయంలో యువత అనివార్యంగా చిక్కుకున్నదని తేలింది. తత్పలితంగా తల్లిదండ్రులు ఎవరికీ తమ బిడ్డల స్థితి చెప్పుకోలేక సతమత మవుతున్నది. కొందరు దాచి పెడుతున్నారు గానీ ప్రయోజనం లేదు.
గంజాయి వాడుతున్న యువకుల్లో ఒకడిగా పోలీసులు ఒక లిస్టు తయారు చేశారని, తమ బిడ్డ అందులో ఉన్నాడని చెప్పడంతో ఇదొక సామాజిక సమస్యగా కాకుండా పరువు ప్రతిష్టల సమస్యగా చూసి కృంగిపోతున్న కుటుంబాలూ ఉన్నాయి. వారికి భరోసా ఇచ్చే వ్యవస్థ ఒకటి నేటి తక్షాణావసరం. అది పోలీసులతో కూడినది కాకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా పౌర సమాజానిది.
నిజానికి ఇదంతా ఒక అభివృద్ధి వలయం. ప్రపంచవ్యాప్త సమస్యే. . కానీ ప్రపంచీకరణను శక్తిమేరా నిరోధించగలిగే శక్తియుక్తులు ఉండీ, ఉద్యమ చేతన గల తెలంగాణాలో కూడా పరిస్థితి ఇలా ఉండటం అంటే అది విషాదం.
పల్లెటూర్లల్లో ఉన్న యువత చేతిలోకి మొదట ‘స్మార్ట్ ఫోన్’ వచ్చింది. తర్వాత ‘బండి’ చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత బెల్టు షాపుల పుణ్యంగా ఎప్పుడంటే అపుడు మద్యం’ వారికీ చేరువైనది. వీటిని తలదన్ని ఆ తర్వాత వచ్చి చేరిన మత్తు పదార్థం ‘గంజాయి’. దీనికి బానిసలైన పిల్లలు నేడు ఊరి పోలోమెరల్లో ఏర్పడిన కెఫేల్లో, నూతనంగా కట్టిన బ్రిడ్జిల పక్కన గుంపులు గుంపులుగా కానరావడం సాధారణ దృశ్యం అయింది.
కొన్ని పాఠశాలల్లో టీచర్లు తమ పిల్లల అలవాటును గమనించి మందలిస్తే విద్యార్థులు గుంపులు గుంపులుగా వచ్చి బెదిరించిన సందర్భాలూ ఉన్నవి.
ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతున్నది. ఇంజినీరింగ్, మెడిసన్, ఐటి తదితర ఉన్నత విద్యకోసం నగరాలు, పట్టణాలు, ఇతర రాష్టాలకు చేరిన యువతకు మొదట గంజాయి అందుబాటులోకి వచ్చింది. వారు ఎలాగైతే ఊరు దాటి మండలం దాటి పట్టణం దాటి రాజధానికి ఇతర రాష్ట్రాల దాకా వెళ్ళారో, అట్లాట్లా వాళ్ళు గ్రామానికి తిరిగి వచ్చేటప్పటికి తమకు అలవాటైనది సొంత ఊర్లోనే దొరికే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఎక్కడున్నా వారు దాన్ని వదిలి లేని స్థితిలోకి నెట్టబడ్డారు.
వీటన్నిటికీ ఒక క్రమం ఉన్నది. ఒకవైపు సాంకేతికత, దానివల్ల పెరిగిన కమ్యూనికేషన్ సౌకర్యాలు, స్మార్ట్ ఫోన్లు. మనీ ట్రాన్స్ఫర్ యాప్స్. మరోవైపు ఉన్నత చదువులు, ముందు చెప్పినట్లు, దూరాలకు వెళ్ళిన పిల్లలు. వాళ్ళు గంజాయి మత్తుకు గురైన తర్వాత పట్టపగ్గాలు లేని స్థితి. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశలో పట్టించుకోక పోవడమే గాక చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నది. ఇలాంటి వైఖరి ఈ అలవాటును పెంచి పోషించేందుకే. ఆ తర్వాత దాన్ని నేరంగా చూపి పిల్లలను తల్లిదండ్రులను బెంబేలెత్తించడం, అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నవి.
పదేళ్ళ బిఆర్ ఎస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజల్లో సంతృప్తి లేకపోవడమే కాదు, అసంతృప్తి పెరిగిందని, అది తీవ్ర ఆగ్రహానికి కూడా కారణమైనదని చెబుతూ అందులో నాలుగు మాఫియాల గురించి నేను గత వ్యాసాల్లో నొక్కి చెప్పాను. మద్యం, ఇసుక, ఘనులు, భూముల దోపిడీ గురించి ప్రస్తావించాను. ఈ నాలుగు సహజ వనరులను ప్రభుత్వాల కనుసన్నల్లో అధికార మంత్రులు, శాసన సభ్యులు ఇష్టానుసారంగా దోచుకోవడం గురించి రాశాను. ( లింక్ : https://muchata.com/why-this-negativity-on-brs…/…)
కళ్ళ ముందు ఆ వనరులు కొల్లగొట్టుకు పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాల్లో ఉన్నారనీ పేర్కొన్నాను. ఐతే, అది బయటి విషయమే కాదు, అంతర్గత విషయం. ఆ వనరులలో మానవ వనరులు కూడా ఉన్నాయి. అవి అమూర్తం కాదు, తమ పిల్లలే అని, మొదటే పేర్కొన్న నాలుగింటిలో ‘మద్యం’తో పాటు యువత గంజాయికి బానిసై ఆఖరికి కొన్ని చోట్ల ఆత్మ హత్యలు కూడా చేసుకున్నారని ఆవేదనతో చెప్పవలసి వస్తోంది.
యావత్ తెలంగాణాలో అందుబాటులోకి వచ్చిన గంజాయి ఇటు పిల్లలను అటు తల్లిదండ్రులను తీరని వేదనకు గురిచేస్తోందని, ఎక్కడికక్కడ స్థానిక సమాజం ఈ విషయం తెలిసీ మాట్లాడలేని స్థితిలో ఉన్నది. ఈ సంక్షోభం పరిస్థితుల్లో నేటి ‘తెలంగాణ’ను ‘గంజాయి తెలంగాణా’ అని పేర్కొనవలసి వస్తోంది. దీన్ని మార్చడం కోసం కూడా బాధిత కుటుంబాలు ఓటును ఆయుధం చేసుకున్నారన్నది ఈ వ్యాసకర్త అభిప్రాయం.
‘మార్పు’ అవసరం అన్నది ఆచరణాత్మకంగా పాలనలో అని. అది మనం గ్రహించేందుకే ఇంత సూటిగా చెప్పవలసి వస్తోంది. ఐతే, పౌర సమాజం కూడా ఈ పరిస్థితి తీవ్రతను గ్రహించి నివారణకు విజిలెన్స్ తో పాటు అవసరమైన కార్యాచరణకు నడుం కట్టాలి. లేకపోతే నిశబ్దంగా నమోదు కాని ఈ తరహా ఆత్మహత్యలు పెద్ద ఎత్తున పెరగడం ఖాయం…
Share this Article