రష్మిక.. జాతీయ అవార్డు అందుకోగల నటి …. Note: This is not a Film Review. There is nothing about Story and Other Details…
… ‘Animal(హిందీ వెర్షన్) సినిమాని వచ్చే ఏడాది జాతీయ అవార్డుల కోసం పంపిస్తే, అవార్డుల కమిటీ సరిగ్గా, నిష్పక్షపాతంగా, వినూత్నంగా ఆలోచించి అవార్డు ఇస్తే, ‘రష్మిక’ గారి తప్పకుండా జాతీయ ఉత్తమ నటి అవార్డు ఇవ్వాలి! తప్పకుండా ఆమెకే రావాలి. ఈసారి మిస్సయినా మరో సినిమాలో తప్పకుండా అవార్డు అందుకుంటుంది. పక్కా!
… ఒక పక్క సీనియర్ నటుడు అనిల్‌కపూర్, మరో దిక్కున నిండా దెబ్బలు, నిద్రమత్తుతో కనిపించే రణ్‌బీర్‌కపూర్ తెర మీద ఉన్నా కూడా తన నటనతో ఆమె వాళ్లని డామినేట్ చేశారు. రెండు సార్లు హీరోని చెంపదెబ్బ కొట్టే సన్నివేశాల్లోనూ భలేగా చేశారు. పెళ్లి కాని యువతిగా మొదలై, హీరోని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డల తల్లిగా, పెద్దింటి కోడలిగా, భర్ర కోసం ఆరాటపడే ఇల్లాలిగా, అదే భర్త మరో స్త్రీతో శారీరక సుఖం పొందాడని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసే మహిళగా.. ఎన్ని షేడ్స్ ఆ పాత్రకు! ఎంత బాగా చేశారు ఆ క్యారెక్టర్‌ని! ఇన్నాళ్లూ తెలుగులో చేసినప్పుడు పెద్దగా తెలియలేదు కానీ, ఈమె ఇంత బాగా నటిస్తారా అనే విషయం సినిమా చూస్తుంటే అర్థమైంది.
Ads
… ఒక దక్షిణాది నటికి హిందీ సినిమాలో ఇంత ముఖ్యమైన పాత్ర ఇవ్వడం వెనుక మార్కెట్ కారణాలు ఉన్నా, ఆమె సెలెక్షన్ విషయంలో సందీప్ గారిని చాలా చాలా పొగడాలని అనిపిస్తుంది. ఆమె ఉన్న సన్నివేశాల్లో రణ్‌బీర్‌ని అసలు చూడాలని అనిపించలేదు. మొత్తం తన నటనతో మెస్మరైజ్ చేశారు. ఇంత పొడుగాటి సినిమాలో ఆమె నటనే కాస్త రిలీఫ్‌గా అనిపించింది.
… ‘మేమూ సినిమా చూశాం! మాకేమీ అంత గొప్పగా అనిపించలేదే!’ అని మీరు అనుకుంటే అనుకోవచ్చు! “నా కళ్లతో చూడు మావా” అని నేనూ ‘దేశముదురు’ డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. Anyway, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎవరైనా గొప్పగా నటిస్తారు. అంత స్కోప్ ఉంటుంది. కానీ హీరో ప్రధాన సినిమాల్లో, ఉన్న కొద్దిసేపైనా బాగా నటించేవారు కదా అసలైన నటులు. ఈ విషయంలో ఆమెకు వందకు వంద మార్కులు వేయొచ్చు.
PS: ‘అర్జున్‌రెడ్డి’ అనేవాడు కోట్ల ఆస్తిని, ఇంటివాళ్లను కాదని సొంతంగా అపార్ట్‌మెంట్‌లో ఉంటూ డాక్టర్‌గా పనిచేస్తున్నవాడు. పైగా ప్రేయసి దూరమైన దిగులుంది. ఈ కారణంగా గడ్డం పెంచాడంటే అర్థం, అందం ఉన్నాయి. మరి కోట్ల ఆస్తి, కంపెనీ, పెద్ద ఇల్లు, చుట్టూ అమ్మానాన్నలు, భార్యాబిడ్డలు ఉండి కూడా ‘Animal’ సినిమాలో హీరో పాత్ర ఆ గడ్డం పెంచడం, బట్టలు లేకుండా గ్రౌండ్‌లో తిరగడం.. ఇవన్నీ ఏంటో ఆడియన్స్‌లో చాలామందితో పాటు నాకూ అర్థం కాలేదు.
పైగా రణ్‌బీర్‌కపూర్ గడ్డంతో ఉన్న సన్నివేశాలు రాగానే థియేటర్‌లో జనం ‘అర్జున్‌రెడ్డి’ అని అరిచారు. సో! వీళ్లంతా రణ్‌బీర్‌కపూర్ నటన చూద్దామని రాలేదు, ‘అర్జున్‌రెడ్డి లాంటి క్యారెక్టర్ ఏదో సినిమాలో ఉంది చూద్దాం’ అని వచ్చారని అర్థమైంది. సినిమాలో ముగ్గురు కపూర్‌లు(ఆనిల్, రణ్‌బీర్, శక్తి) ఉన్నా, వాళ్ల కోసం కాకుండా ఒక తెలుగు సినిమాలోని పాత్ర లాంటి పాత్ర కోసం జనం థియేటర్‌కి వచ్చారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని కపూర్‌లు కనీసంలో కనీసం ఊహించి ఉండరు… – విశీ
Share this Article