రెండు డజన్లో, రెండున్నర డజన్లో పార్టీలు కలిపి ఓ కూటమి పెట్టుకున్నయ్… అవన్నీ బీజేపీ వ్యతిరేక పార్టీలు… మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావద్దు అని కలిసి కొట్లాడబోతున్న పార్టీలు… ఇండియా కూటమి అని ఓ పేరు కూడా పెట్టుకున్నయ్… ఛలో, జంగ్ షురూ అన్నాయి… బీజేపీ అధికారంలోకి రావద్దు సరే, మోడీ మళ్లీ ప్రధాని కావద్దు సరే.., మరి ఎవరు ప్రధాని కావాలి..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల సంఖ్యకన్నా ఇండియా విపక్ష కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థుల సంఖ్య ఎక్కువ… రాహుల్ గాంధీకి యాక్సెప్టెన్సీ ఉందా..? స్థూలంగా లేదు, ఏకపక్షంగా కూడా లేదు… సరే, ఆశలు ఉండటంలో తప్పులేదు… కానీ అది కలిసి పోటీచేయడానికి ముందే ఇచ్చుకుపోయేట్టుగా ఉంది… దానికి కారణం మొన్నటి ఎన్నికల్లో మూడు హిందీ రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగించడం, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న రాష్ట్రాలూ చేజారిపోవడం…
ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం… తెలంగాణలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు… బలమైన కేసీయార్‌ను ఢీకొనే ఎన్నికలు… టీజేఎస్, టీఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఎట్సెట్రా పార్టీలు బరి నుంచే తప్పుకున్నయ్… ఒక్క సీటుకు అంగీకరించిన సీపీఐ కూడా దోస్తీకి సై అన్నది… జనసేనను బీజేపీ నెత్తిన మోస్తోంది తప్ప కాంగ్రెస్ ఎప్పుడూ దాన్ని లైట్ తీసుకుంది… కానీ సీపీఎం..? జస్ట్, ఒక్క సీటు కోసం, అదీ తన కార్యదర్శి కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసుకుంది… పోతేపోయింది అని కాంగ్రెస్ పిచ్చ లైట్ తీసుకుంది…
Ads
తీరా ఏం జరిగింది..? సీపీఎం దారుణంగా భంగపడింది… కేవలం ఒకే ఒక సీటు, అదీ ఒక అసెంబ్లీ స్థానంలోనే సీట్ షేరింగ్ కుదరనప్పుడు… ఇక దేశం మొత్తమ్మీద సీట్ల షేరింగ్ ఎలా సాధ్యం..? తెలంగాణలో కాంగ్రెస్‌కు గాకుండా బీఆర్ఎస్‌కు ఉపయోగపడే స్ట్రాటజీని సీపీఎం ఏ సిద్దాంతం మేరకు అమలు చేసినట్టు..? అసలు ఈ కలయిక, ఈ కూటమి స్థిరంగా ఎలా కలిసి పనిచేయగలదు..?
మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో సీట్ల షేరింగ్ లేదు… సమాజ్‌వాదీ పార్టీకి మండుతోంది… రేపు ఏర్పాటు చేసిన కూటమి మీటింగుకు నేను రానుపో అంటున్నాడు అఖిలేష్… తృణమూల్ కాంగ్రెస్ మమత కూడా అదే అంటోంది… ఆప్ ఎప్పటి నుంచో పెద్దగా అంటీముట్టనట్టుగానే ఉంటోంది… లెఫ్ట్‌తో మిగతా చోట్ల సరే, కేరళలో సయోధ్య కుదరదు, సవాలే లేదు… (స్టాలిన్ కూడా మీటింగుకు వెళ్లడం లేదు, కాకపోతే తను తుఫాన్ సహాయక చర్యల్లో, సమీక్షల్లో బిజీ)…
ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఫలితాలు ఇండియా కూటమికి పెద్ద షాక్… బీజేపీకి బూస్టప్… కాకపోతే తెలంగాణలో మంచి రిజల్ట్స్ సాధించే స్థితిని, కేసీయార్ వ్యతిరేక పవనాల్ని వాడుకోలేక తెల్లమొహం వేసింది… రాంగ్ స్ట్రాటజీలు… వెరసి ప్రస్తుతం మొత్తం దక్షిణం ప్లస్ ఎక్కువ భాగం తూర్పు బీజేపీకి మింగుడపడటం లేదు… ప్రస్తుతం బలంగా ఉన్న ఉత్తరాదిలోనే తనకు కావల్సినన్ని సీట్లు సంపాదించాలి వచ్చే ఎన్నికల్లో… తెలంగాణలో వేసిన ఎడ్డి వేషాలే మిగతా రాష్ట్రాల్లో గనుక వేస్తే మోడీ వేగానికి బ్రేకులు తప్పవు…
కేరళ, తమిళనాడు, ఏపీల్లో బీజేపీ ఉండీ లేనట్టే… తెలంగాణలోనూ చెడగొట్టుకుంది… కర్నాటకలో సగం వరకూ సీట్లు రావచ్చు, ఒడిశా- బెంగాల్‌లలో కూడా కొంత బెటర్ రిజల్ట్ రావచ్చు… ఏపీలో జగన్ సపోర్ట్ చేస్తున్నాడూ అంటే భక్తితో కాదు, భయంతో… అదీ స్ట్రెయిట్ సపోర్ట్ ఏమీ కాదు… ఇక తెలుగుదేశంతో ఎలా ఉండాలో బీజేపీకి సరైన స్ట్రాటజీయే లేదు… బీఆర్ఎస్‌తో గుప్తస్నేహం తప్ప స్ట్రెయిట్ ఫ్రెండ్‌షిప్ లేదు… జనసేనతో పెద్ద ఫాయిదా ఏమీ లేదు… బీహార్‌లో నితిశ్, ఆర్జేడీలు బాగానే నిలువరించే చాన్స్ ఉంది…
కాకపోతే బీజేపీకి పెద్ద రిలీఫ్ ఏమిటంటే… విపక్ష కూటమి సరిగ్గా లేకపోవడం… ఉమ్మడి అభ్యర్థి అనబడే సీట్ షేరింగ్ సాధ్యం కాకపోవడం… అదే బీజేపీకి పెద్ద ఆశ… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీకి సొంత మెజారిటీ రావచ్చునని ఒకటీరెండు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలు తేల్చి చెబుతున్నది అందుకే…!!
Share this Article