Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏనిమల్ పేరెట్టాడు గానీ… అవే నయం ఈ హీరోకన్నా… ఇదేం సినిమార భయ్…

December 8, 2023 by M S R

అప్పట్లో అర్జున్‌రెడ్డి సినిమా మీద బోలెడన్ని విమర్శలు… తిట్లు, శాపనార్థాలు… మరోవైపు మెచ్చుకోళ్లు… అదే దర్శకుడు దానికి డబుల్, ట్రిపుల్ ఇంపాక్ట్‌తో అదే ‘అతి’తో జనం మీద రుద్దిన సినిమా ఏనిమల్… నిజంగానే హీరో కేరక్టరైజేషన్ జంతువే… దర్శకుడి ఆలోచన విధానం కూడా అదే… వాడెవడో మెచ్చాడు, వీడెవడో చప్పట్లు కొట్టాడు, వందల కోట్లు కొల్లగొడుతున్నాడు అనే కోణంలో ప్రభావితులై చాలామందికి ‘సద్విమర్శ’ చేతకావడం లేదు… కానీ ఫేస్‌బుక్‌లో Haribabu Maddukuri రాసిన ఒక రివ్యూ ఆసక్తికరంగా అనిపించింది… అది యథాతథంగా… ఇదుగో… (సినిమాలోని మహా బోల్డ్ సంభాషణలు, సోకాల్డ్ విశ‌ృంఖల దృశ్యాలు, థియేటర్ నుంచి కాల్వలు కట్టిన నెత్తురు మీద మరో పోస్టులో చెప్పుకుందాం ఎప్పుడైనా…)



ఏనిమల్ వంగా అనే దర్శకుడు ఏనిమల్ కపూర్ అనే హిందీ హీరోతో తీసిన ఏనిమల్ అనే పద్దెనిమిదో వింతని మొన్న కళ్ళార్పకుండా చూడటం జరిగింది.. మరి ఎలా ఉందని అడక్కండి..? దీన్ని వర్ణించే స్థాయిగానీ, విశ్లేషించే జ్ఞానం గానీ నాకు పెట్టలేదు ఆ యొక్క భగవంతుడు..! టైటిలే సగం కథ చెప్పేసింది కాబట్టి ఇక మనం చెప్పడానికి కూడా ఏం మిగల్లేదు..!!

డబ్బులెక్కువైపోవడం చేత దాపురించిన కొవ్వు వల్ల బాగా అల్లరిచిల్లరిగా పెరిగిన ఓ అర్జున్రెడ్డికి పగాప్రతీకారాలు కూడా తోడైతే యానిమల్గా ఎలా వృద్ధి చెందేడన్నదే ఈ ఏనిమల్ అన్నమాట.. ఆ జంతుకుర్రోడు చినప్పట్నుంచీ అంతా ఇంతా చదును కాదు.. ఇంటి మీదకి రాయేసి గొడవ తెచ్చుకునే రకం.. నిశ్చితార్ధానికి వెళ్ళి పెళ్ళికూతుర్ని రెచ్చగొట్టి లేపుకొచ్చేయ్యగల టాలెంటు మనోడి సొంతం..

Ads

బోర్ కొట్టినప్పుడు బుల్లి విమానాలు నడుపుకుంటా, కుదిరితే అందులోనే శోభనాలు గట్రా చేసుకుంటా.. అదొక రకం, అంతే.. అవసరం ఉందంటే చాలు.. విప్పి చూపించడానికి, పక్కోడి లోచెడ్డీ లాక్కుని మరీ వేస్కోడానికి కూడా వెనుకాడడన్నమాట.. అంత పద్ధతైన పిల్లోడు..

ఇప్పటికైనా మీకర్ధం అయ్యుండాలి.. ఆడితో పెట్టుకుంటే జీవితం సంక నాకిపోయినట్టేనన్న రేంజులో ఉంటాది మనోడి ప్రతాపం.. పైపెచ్చు మా అయ్య నన్ను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఇలా తయారయ్యానని గుండాపిండీ ఐపోతా, తుపాకీ పట్టుకుని చలాకీగా తిరుగుతుంటాడు సంజయ్ దత్ లా కనబడే ఆ రణబీరుడు..

ఇదంతా చూస్తా కూడా “మనం ఒక క్రిమినల్ని కన్నాం పార్వతీఈఈఈ…” అని తల బాదుకుంటారు తప్ప యే పిచ్చాసుపత్రిలోనో పడేద్దామని ఉండదు పాపం ఆ రిచ్చి తల్లిదండ్రులకి.. ఈళ్ళ మ్యాడ్ మాక్సులో నా మ్యాగీ మిక్సని..!! తండ్రంటే గుర్తొచ్చిందండో..

సినిమా ప్రారంభంలో క్షణం కూడా తీరిక దొరకని దేశంలోనే అతిపెద్ద మోతుబరి వ్యాపారవేత్తగా పరిచయం చెయ్యబడ్డ అనిల్ కపూర్ గారు మిగతా సినిమా అంతటా మూతి మీద చెయ్యేస్కుని ఇంట్లోనే కూర్చుని బేలగా చూస్తా ఉంటాడు పాపం. అది కూడా ఒక యాపారమే కాబోలు.. పోతే..

ఆ అనిల్ కపూర్ గారి భార్యాకూతుళ్ళే హీరోయిన్లేమో అనుకున్నాను చాలాసేపు.. కానీ తర్వాత తెల్సింది మన రష్మిక గాడు వీరోయినని.. వంగా గారు నటులందర్నీ బత్తాయి పిండినట్టు పిండేశాడు.. ఎమోషన్లేమో మిరప్పంట పండించినట్టు పండించేశాడు..

ఫైటింగులు ఐతేనా..? టెస్టోస్టీరాన్ ఎక్కువైన ఆ పోరాటాలకి మన ఒంట్లో అడ్రినలిన్ రసాలు తెగ ఊరేసి, వాటిని ఎక్కడ వొంపాలో కూడా తెలీదు..!!

సూట్లేసుకున్న ఉక్కుమాస్కు మనుషుల్ని జంతువు గారు గొడ్డలితో కసాకసా నరికేస్తా ఉంటే వెనకాల తలపాగాలు చుట్టుకున్న సిక్కుమనుషులు గొంతు చించుకుంటా పంజాబీ పాట పాడతా ఉంటారు.. “ఛోడియే హ ఊడియే తోడియే పెరుగు తోడెట్టియే..” అని..

ఆ పాటై పోయాకా ఓ భారీ మిషన్ గన్నుని చిన్నసైజు కృషి ట్రాక్టర్కి బిగించి మన యానిమల్ గారు అందులో కూర్చుని అదేదో దోమలమందు కొట్టినట్టు తెగ కాల్చి పారేస్తా ఉంటాడు.. కసక్ కసక్ కసాక్.. హే డిష్కేం.. ఈ అరాచకాలు చూస్తే ఆడు విలన్ల నుంచి కుటుంబాన్ని కాపాడ్డం కాదు.. విలన్లే ఆడి నుంచి కుటుంబాన్ని కాపాడతన్నారేమోని అనిపిస్తా ఉంటాది.. యే రాయి అయితేనేం.. ఆల్ స్టోన్స్ ఆర్ సేమ్..!!

మరి ఈ ఉన్మాద చేష్టల్ని యువజనులు తెగ మెచ్చుకుంటారు, మెతక మనస్కులేమో మూర్ఛబోతారు.. నాలాంటి సున్నితమనస్కులు మాత్రం తమ చేతులను సున్నిపిండి వలె నలుపుకుంటారు. ఏదేమైనాగానీ ఈ చిత్రరాజాన్ని ఫ్యామిలీసుతో కల్సి నిరభ్యంతరంగా చూడొచ్చు.. (వాళ్ళ కళ్ళకి గంతలు, చెవుల్లో దూది పెట్టి..!)

పోతే.. వంగాగారి పట్ల నాకో స్పష్టత ఏర్పడింది.. రేపొద్దున్న యే నిర్మాతైనా “నా దగ్గర బాగా డబ్బులున్నాయ్, మహేష్ ని హీరోగా పెట్టి రామాయణాన్ని నేటి తరానికి బాగా అర్థమయ్యేట్టు తీసిపెట్టు నాయనా” అని వంగా యానిమల్ గార్ని అడిగితే.. “తండ్రి దశరథుని మీద అమితమైన ప్రేమని ఇష్టమొచ్చినట్టు పెంచుకున్న కోపధారి రాముడు ఆవేశంగా అడవికి వెళ్ళి లంకని దత్తత తీస్కుని …” అని తీసేట్టున్నాడు ఇతగాడు… ఇంకా ఈ సినిమా చూడాలనిపిస్తోందా… మీకో దండం బాబూ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions