అప్పట్లో ఏదో ఎన్టీయార్ సినిమాకు జనం ఎడ్ల బళ్లు కట్టుకుని, సద్దులు కట్టుకుని, పిల్లాపాపలతో ఊళ్ల నుంచి తరలిపోయేవారట… విన్నాం, చదివాం… యానిమల్ సినిమాకు సంబంధించిన రెండుమూడు వార్తలు చదివితే అదే గుర్తొచ్చింది… రాజమౌళి అనుకుంటే రాజమౌళికే తాత పుట్టుకొచ్చాడు కదా అనిపించింది…
విషయం ఏమిటంటే… నార్త్‌లో కొన్నిచోట్ల యానిమల్ సినిమాను 24 గంటలూ వేస్తున్నారట… మనం శివరాత్రి పూట జాగారం కోసం వేసే మిడ్ నైట్ షోలు చూసేవాళ్లం… మరీ గిరాకీ అధికంగా ఉండే స్టార్ హీరోల సినిమాల్ని పొద్దునే ఎర్లీ మార్నింగ్ షోలు వేయడమూ తెలుసు… కానీ ఎర్లీ మార్నింగ్, మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, మిడ్ నైట్ షో… ఇలా రోజంతా షోలు వేస్తున్న తీరు తొలిసారి…
అసలు ఆ సినిమా నిడివే ఈరోజుల సినిమాలతో పోలిస్తే అరాచకం… దాదాపు మూడున్నర గంటలు… ఐతేనేం, జనం విసుక్కోవడం లేదు… ఎగబడి చూస్తూనే ఉన్నారు… (ఆ బోల్డ్ సీన్లు, ఆ డైలాగ్స్, ఆ ఇంటిమేట్ సీన్లు ‘తృప్తి’గా ఎంజాయ్ చేస్తున్నారంటారా..?) కలెక్షన్లలో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నది ఈ సినిమా… రణబీర్ హఠాత్తుగా టాప్ హీరో అయిపోయాడు… సల్మాన్, షారూక్, ఇమ్రాన్ ఖాన్లు, ప్రభాస్ ఎట్సెట్రా స్టార్లను కొట్టిపారేశాడు…
Ads
నిజానికి ఈ సినిమా ప్రజెంటేషన్ పట్ల నాకు చాలా అభ్యంతరాలు, అసంతృప్తులూ ఉన్నయ్… ఆ దర్శకుడు నాటి అర్జున్‌రెడ్డి కాలం నుంచే ఓ యానిమల్ టైప్… ఆ అర్జున్‌రెడ్డికి మూడింతల అరాచకాన్ని అద్ది మరీ ఈ యానిమల్ తీశాడు… ఐతేనేం, జనానికి నచ్చింది… కేవలం హిందీ ప్రేక్షకులకు మాత్రమే సుమా… ఆ కలెక్షన్ల లెక్కల మీదా సందేహాలున్నయ్… బట్, అందరి సినిమాల కలెక్షన్లూ డౌట్ ఫుల్లే కదా…
పది రోజుల్లో 600 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా ఊదిపారేసింది… చిన్న విషయమేమీ కాదు… 1000 కోట్ల మార్క్ దాటడం పెద్ద కథేమీ కాదు… బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎట్సెట్రా లెక్కలన్నీ యానిమల్ తిరగరాస్తోంది… ఒక పుష్ప కావచ్చు, ఒక కార్తికేయ కావచ్చు, ఆర్ఆర్ఆర్ కావచ్చు, ఇప్పుడు ఈ యానిమల్ కావచ్చు… ఇండియన్ సినిమాకు తెలుగు దర్శకులు కొత్త దిశను, దశను చూపిస్తున్నారు… (కేజీఎఫ్ నీల్ కూడా తెలుగువాడే)… ఐతే ఇదెంత కాలమో చెప్పలేం… వర్తమానం మాత్రం తెలుగు దర్శకుడిదే… యానిమల్ రికార్డులు చెబుతున్న నిజం కూడా అదే…
చివరగా మరో మాట… ఇది పేరుకు పాన్ ఇండియా సినిమా కానీ హిందీలోనే దుమ్మురేపుతోంది… మొత్తం 600 కోట్ల వసూళ్లను తీసుకుంటే మలయాళంలో 10 రోజుల్లో జస్ట్, 9 లక్షలు… తమిళంలో 3.39 కోట్లు… కన్నడంలో 54 లక్షలు మాత్రమే… మన తెలుగువాడు అనుకుని చూశారేమో తెలుగులో మాత్రం 38.69 కోట్లు… ఐనా కన్నడ, తమిళ, మలయాళ ప్రేక్షకుల టేస్ట్ వేరు… దానికి యానిమల్ సూట్ కాలేదు… కాదు కూడా… సో, కలెక్షన్లు ఇరగదీసినంత మాత్రాన గొప్ప సినిమా ఏమీ కాదు… పాన్ ఇండియా అసలే కాదు… శుభం…
Share this Article