కనకదుర్గను దర్శించుకోవడానికి రేవంత్ విజయవాడ వెళ్లబోతున్నాడు… పనిలోపనిగా ఏపీ సీఎం జగన్‌ను కూడా కలుస్తాడు… ఇదీ తాజా వార్త, వాట్సపులో కనిపించింది… హఠాత్తుగా అనిపించేది ఏమిటంటే… ఎందుకంత ఆత్రం..? జగన్ ఎన్నోసార్లు హైదరాబాద్ రాడా..? అసలు తన ఇల్లే హైదరాబాద్ కదా…
ఒక రాష్ట్రానికి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గనుక వెళ్తే, అక్కడి ముఖ్యమంత్రితో భేటీ మర్యాదపూర్వకం… అదీ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు… కలిసినప్పుడు మాత్రం ఇరు రాష్ట్రాల నడుమ సమస్యలు, సమకాలీన రాజకీయాల ప్రస్తావనలు కూడా ఉంటయ్… సహజం… ఐతే పైకి చూస్తే అనిపించేది మాత్రం… జగన్‌కూ కాంగ్రెస్‌కూ పడదు, జగన్‌ను నానా గోస పెట్టింది కాంగ్రెస్, ఏపీలో అసలు కాంగ్రెస్ లేనట్టే లెక్క… పైగా జగన్ ప్రబల ప్రత్యర్థి తెలుగుదేశం చంద్రబాబుకు రేవంత్ కావల్సినవాడు…
ఇటువైపు చూస్తే రేవంత్‌కు అసలు వైసీపీ బెడద లేదు తెలంగాణలో… సో, స్థూలంగా చూస్తే రాజకీయంగా ఒకరి అవసరం ఒకరికి లేదు అనిపిస్తుంది… వ్యక్తిగతంగా చూస్తే జగన్‌ది వారసత్వ పరంపర, రేవంత్ సొంత ఎదుగుదల… ఇద్దరివీ వ్యాపార పోకడలే… కానీ ఆ ఇద్దరి నడుమ చంద్రబాబు అనే ఓ అడ్డంకి ఉంది స్నేహానికి…! అందుకే మీకు ఎంత సెర్చ్ చేసినా వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటో దొరకదు… ఇద్దరూ ఎక్కడా బహిరంగంగా కలిసిన దాఖలాయే కనిపించదు… కానీ ఇప్పుడు ఇద్దరూ రెండు తెలుగు దాయాది రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు…
Ads
రేవంత్ మరో అయిదేళ్లు ఉంటాడు, హైకమాండ్ దయతలిస్తేనే సుమా… కానీ జగన్ త్వరలోనే మలిపరీక్షకు వెళ్లాలి… తను పాలనకు మార్కులేయించుకోవాలి… జనం మెచ్చకపోతే ఇదే రేవంత్ బాస్ చంద్రబాబు వచ్చేస్తాడు… ఐనా సరే, రెండు రాష్ట్రాల నడుమ తలెత్తే సమస్యల విషయంలో ఇద్దరికీ ఓ సయోధ్య అవసరం… లేకపోతే నాగార్జున సాగర్ మీద ఇరు పోలీసులను మొహరించి కయ్యం పెట్టుకున్నట్టే… రెండూ దేశముదురు కేసులే… ఎవరూ తక్కువ కాదు… ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పుకోవాలి…
జగన్, కేసీయార్ తదితరులు తమదితాము సంపాదించుకుంటే చాలు… ఇంకెవరికీ ఇవ్వనక్కర్లేదు… కానీ రేవంత్ సిట్యుయేషన్ వేరు… తనకు మాత్రమే కాదు, పార్టీ జాతీయ అవసరాలు తీర్చాలి… సంపాదించకతప్పదు, లేకపోతే ఆ కుర్చీ తనను వదిలేస్తుంది… తెలంగాణ ఆర్థికస్థితి చూస్తేనేమో ఎక్కడికక్కడ కుప్ప చేసిపెట్టాడు కేసీయార్… ఐదారు లక్షల కోట్ల అప్పు… డబ్బులొచ్చే మద్యం, కరెంటు కొనుగోళ్లు, ప్రాజెక్టులు అన్నీ సమస్యలే… అన్నీ అప్పులే… జగన్ చేసినట్టు రీటెండరింగులకూ చాన్స్ తక్కువ… కేసీయార్ చేసినట్టు కాలేశ్వరం రీఇంజినీరింగులకూ చాన్స్ తక్కువ…
జగన్ వ్యాపార అవసరాల రీత్యా రేవంత్ కావాలి… రేవంత్‌కేమో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సీమాంధ్ర సెటిలర్ల వోట్ల మద్దతు కావాలి… జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా… అలాగే కొందరు ఎమ్మెల్యేలు కావాలి… లేకపోతే తమ పార్టీ సీనియర్ల పడగ నీడల్లో ఈ బొటాబొటీ మెజారిటీతో నెగ్గుకురావడం కష్టం… అఫ్‌కోర్స్, ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే కేసీయార్‌ను వదిలేసి మజ్లిస్ వచ్చేస్తుంది… రేవంత్ తెలుగుదేశం మనిషి అనే భావనతో కమ్మలు కాంగ్రెస్‌ను ఓన్ చేసుకుంటే, కమ్మేతరులు బీఆర్ఎస్‌కు సై అన్నారు… ఈ సిట్యుయేషన్ మార్చుకోవాలి రేవంత్…
పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు కూడా జగన్ మనుషులే లోలోపల… మేఘా కృష్ణారెడ్డి కూడా నిన్న రేవంత్‌ను కలిసినట్టు మరో వార్త… మేఘా జగన్‌కూ ఆంతరంగికుడే… (అందరూ ఒకే సామాజికవర్గం)… అఫ్‌కోర్స్, కృష్ణారెడ్డి డబ్బే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని నడిపించింది పదేళ్లుగా… తను తెలుగు ముఖేష్ అంబానీ… ఆదానీ… ఆ డబ్బు జాతీయ రాజకీయాల్లోకి కూడా ప్రవహించింది… సో, బయటికి కనిపించే పాలన, తిప్పలు, గ్యారంటీల అమలు గట్రా వేరు… రథాన్ని నడిపే ఇంధనం సంపాదన వేరు… రేవంత్ దృష్టి పెట్టకతప్పదు… ఆ దిశలో జగన్ దోస్తీ కూడా తప్పదు… జగన్‌కూ రేవంత్ దోస్తీ తప్పదు… మధ్యలో ఇద్దరూ కలిసి కేసీయార్‌ను ఏం చేస్తారు… చంద్రబాబు పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటి..? ఇవీ పెద్ద ప్రశ్నలు…!!
Share this Article