సీరియల్స్‌లో గొప్ప నటులు ఉన్నారు … మన దేశంలో సినిమాలకు మాత్రమే జాతీయ పురస్కారాలు ఇస్తారు. టీవీల్లో పనిచేసేవారికి జాతీయ అవార్డులు లేవు. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు గతంలో ఇచ్చేవారు. ఈ మధ్య అవీ మానేసినట్టు ఉన్నారు. కొన్ని ఛానెళ్లలో ప్రత్యేకంగా అవార్డులు ఇస్తున్నారు. సినిమాల్లో ఉన్నంత గుర్తింపు, గమనింపు టీవీలో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలా అని వాళ్లు తక్కువ నటిస్తారని కాదు.
వారికంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్దిష్టమైన గుర్తింపు/అవార్డులు ఇచ్చే వ్యవస్థ ఇంకా పూర్తిగా రాలేదు. త్వరలో రావాలని ఆశిద్దాం! ఇప్పుడు ఇచ్చే జాతీయ పురస్కారాల్లో కూడా డబ్బింగ్ కళాకారులకు అవార్డులంటూ లేవు. అంతమాత్రాన వారి కళ, ప్రతిభ సాధారణమైపోదు. గొప్ప కళ ఎప్పుడూ అసాధారణమే!
… టీవీ సీరియల్స్‌ని ప్రాణాలకన్నా ఎక్కువగా ప్రేమించిన కాలం ఒకటి ఉండేది. అటువంటి కాలంలో భాషాభేదం లేకుండా ఆ సీరియళ్లను మనం తెలుగులోకి అనువదించుకున్నాం, చూశాం, ప్రేమించాం, ఆదరించాం! నటులు సూర్య, కార్తి తండ్రి శివకుమార్ గారు తమిళంలో సీనియర్ నటుడు. కానీ ఆయన తెలుగువారికి దగ్గరైంది ‘పిన్ని’, ‘శివయ్య’ సీరియల్స్ ద్వారా! తెలుగులో కేవలం సీరియల్స్ ద్వారానే స్టార్ స్టేటస్ పొందినవారు మనకు తెలియదా? అచ్యుత్ గారిని బుల్లితెర మెగాస్టార్ అని పిలిచిన కాలం మనకు గుర్తే!
Ads
కిన్నెర, వినోద్‌బాల, యమున, హరిత, అశ్విని, నీరజ, శ్రుతి, కౌశిక్, ఇంద్రనీల్, నిరుపమ్, ప్రీతినిగమ్, గాయత్రి.. నిన్నా మొన్నటి వంటలక్క! అందరూ సీరియళ్ల ద్వారానే మనకు చాలా దగ్గరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సైతం ‘మట్టిమనిషి’ సీరియల్ చేసి టీవీల్లోనూ తన నటనా కౌశలాన్ని చూపారు. పూరీ జగన్నాథ్, రాజమౌళి లాంటి దర్శకుల ప్రస్థానం మొదలైంది కూడా టీవీ నుంచే!
… ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తమిళంలో ‘అళగి’ అనే సీరియల్ చూస్తూ ఉన్నాను. చాలా బాగుంది. ‘హయ్యో! నువ్వు సీరియళ్లు చూస్తావా? ఏం పోయేకాలం?’ అని అనుకోవద్దు. ‘మగవాళ్ళు టీవీ సీరియల్స్ చూడరాదు’ అని ఎక్కడా రాసిపెట్టి లేదు. ఆసక్తి ఉన్న ఎవరైనా చూడొచ్చు. ఏదైనా భాష మీకు ధారాళంగా రావాలంటే సీరియల్స్‌ని మించిన సిలబస్ లేదు. నా మాట నమ్మండి! కావాలంటే మీరూ ప్రయత్నించండి. తప్పకుండా భాష వస్తుంది. నాదీ హామీ!
2006-2011 మధ్య కాలంలో సన్ టీవీలో వచ్చిన సీరియల్ ఇది. తెలుగు నటి సరిత చెల్లెలు విజి చంద్రశేఖర్ (‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్ర) ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. సీరియల్ చాలా ఆసక్తిగా ఉంది. ఒకేరోజు 50 ఎపిసోడ్లు చూశాను. ఇందులో ఒక పాత్ర నన్ను భలే ఆకట్టుకుంది. చాలా వినోదాత్మకంగా ఉంది.
కళ గల మొహం, చక్కటి డైలాగ్ డెలివరీ, చూసేందుకు భలే ముచ్చటగా, ఆకర్షణీయంగా ఉన్న ఈ నటి ఎవరా అని వెతికాను. పేరు ‘నాగలక్ష్మి’. చాలా తమిళ సీరియల్స్‌లో నటించారు. అమ్మ, వదిన, కోడలు, చెల్లెలు వంటి పాత్రలకు ఫేమస్. ముఖ్యంగా గడుసుదనం, విలనిజం కలగలిసిన పాత్రలకు పెట్టింది పేరు. ఈమె నటించిన చాలా తమిళ సీరియల్స్ తెలుగులోనూ అనువాదమయ్యాయి. అందులో నటి దేవయాని ప్రధాన పాత్ర పోషించిన ‘ముత్యాలముగ్గు’ (తమిళంలో ‘కోళంగల్’) ఒకటి. ఇంత చక్కని నటులు టీవీలకే పరిమితం అవడం, అదీ ఒకే భాషకి అంకితమైపోవడం కొంత లోటే! ఇలాంటి వాళ్లను సినిమా దాకా తేవడంలో ఎందుకు అడ్డంకులు వస్తాయో తెలియదు. ఏం చేస్తాం? టీవీ నటులు అంటేనే చిన్నచూపు. ఎప్పటికి పోతుందో అది?
ఇంత చక్కని నటులు తెలుగు, తమిళ టీవీ సీరియల్స్‌లో ఇందరు ఉంటే, మొత్తం దేశం మీద ఎంతమంది ఉన్నారో? వాళ్ల నటన అంతా టీవీలకు పరిమితమైపోవాల్సిందేనా? ఇప్పుడు కనీసం యూట్యూబ్ అయినా ఉంది. ఒకప్పటి పరిస్థితి మరీ దారుణం కదా! ఏ రోజుకు ఆరోజే! కరెంట్ పోతే అంతే సంగతులు! – విశీ
Share this Article