అమ్మచేతి వంట.. కొన్ని ముచ్చట్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అమ్మ– ఒక అక్షయపాత్ర…!
Ads
అమ్మ చేతిగుణమేమిటోగానీ వంట అద్భుతం!
శాఖాహార వంటలకు మా వంశంలోనే పెట్టిందిపేరు.
బెండ, కాకర, సోర, గోరుచిక్కుడు వంటి
అంటుపులుసులు అమృతతుల్యంగా చేసేది.
తియ్యబెండకాయ, కలెగూర, టమాటపప్పు,
టమాటాతో బీర, సోర, పొట్ల, కాకర వంటి
కలగలుపు కూరలు వేటికవే సాటిగా ఉండేవి.
రాములక్కాయ కూర గురించి ఎంత చెప్పినా తక్కువే.
పప్పుచారు కలవోసినా, చుక్కకూర పప్పు వండినా
వంకాయ కూరవండి – పచ్చిపులుసు చేసినా
ఆ రోజున ఇంటికి పండుగ వచ్చినట్టే ఉండేది.
అనుపపప్పువేసి పచ్చిపులుసు చేస్తే…
వందవంటల్లోనైనా గుర్తుపట్టేటంత మంచిగుండేది.
పెసరుపప్పు మద్దపప్పు వేసి, చింతకాయ చారు చేస్తే
ఇక ఏ కూరగాయల అవసరమూ లేనేలేదు.
చలికాలంలో మా చేనులో తను పండించిన
అరొక్క కాయగూరలతో వరుగులు చేసేది…
మాకు తక్కువ – మందికి ఎక్కువ ఖర్చుజేసేది.
ఎండకాలంల వరుగులతో ఎన్నిరకాల పులుసులో !
అన్నిటిలో ఉల్లిగడ్డ పులుసుది రారాణివన్నె !!
చింతపండు తొక్కునూరినా, పుంటికూర తొక్కు నూరినా
కొత్తిమీరతో టమాట పచ్చెడ చేసినా దేనికదే పసందు.
పచ్చికాయలతోటి నువ్వుల తొక్కునూరితే ఆ రుచేవేరు.
పచ్చిమిరుపకాయలు నిప్పులమీద కాల్చి
పచ్చిపులుసు చేస్తే.. పిల్లికూనలెక్క కాళ్లలో తిరిగేవాడిని.
అమ్మకు పిండివంటల కొలతలు కొట్టినపిండి.
అరిసెలకు , లాడూలకు ఆనుకం (పాకం) పట్టాలంటే
వాడకట్టంతా అమ్మనే పిలుచుకపొయ్యేవారు.
చకినాలు చుట్టుటానికి సంక్రాంతికి వారం ముందు నుండే
ఇంటిచుట్టున్నవాళ్లు అమ్మ దగ్గర హామీ తీసుకునేవారు.
నువ్వుల కరిజలు చేసినా, ఉప్పుడు పిండి పోసినా
అమ్మచేతి కమ్మదనం అమ్మదే… ఇంకెక్కడా దొరుకదు.
చింతకాయ, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ,
కరక్కాయ, టమాట… ఏ ఊరగాయ పెట్టినా
మడతమాను అడుగు తేలేదాకా కాదూలేదనకుండా
పనిపాటలోళ్లకు, అచ్చెగాళ్లకు, బిచ్చగాళ్లకు
చేతికి ఎముకలేకుండా అందరికీ కన్నతల్లిగా పంచిపెట్టేది.
అమ్మది– అరుకతిగల్ల చెయ్యి…!
మాది కాపుదనపు కుటుంబం కనుక చేనుపనికి వెళ్లేది.
చేండ్ల అరొక్కచెట్టు, కాయగూరల పంట పండించేది
పుంటి కూరైతే సగం ఊరికి సరిపొయ్యేటంత…
పనికివచ్చిన కైకిలివాళ్లు ఏనాడూ వట్టి చేతులతో
ఇంటికి తిరిగివెళ్లేవారుకాదు. కొంగునింపుక పొయ్యేవారు.
మూడు నెలల పొద్దు గుమ్మడి చెట్టుకు నీళ్లుపోసి కాపాడితే
సద్దుల బతుకమ్మ నాడు పూలన్నీ పలారం పంచిపెట్టేది.
ఈ విషయమై ఎన్నిపండుగలకు ఏడ్చిగగ్గోలు పెట్టేవాడినో !
రకరకాల పూలచెట్లు, కలియామాకు చెట్లు, జామ పండ్లు..
కాలాన్ని అనుసరించి కాయగూరలు, ఆక్కూరలు
అడిగినవారికి లేదనకుంట ఆత్మీయంగా పంచిపెట్టేది.
పొరుగూరివారూ, ఎవరో తెలియని బాటసారులూ
మా చేను దగ్గర ఆగి ఆకలి తీర్చుకునేవారు.
ఆడవారికైతే.. గులాబో, దాసనపువ్వో ఇచ్చిపంపేది.
అమ్మది.. పాడిగలిగిన జీవితం…!
పొద్దున గుడిలో మైకు వెయ్యకముందే లేచేది
నాలుగు పాడిబర్లనూ దుడ్డెలనూ అరుసుకునేది
బర్రె ఈనితే మొదటి జున్ను పోచమ్మ తల్లికి చెల్లించి
మూడు రోజులూ చుట్టుమెట్టు అందరి కుతీ తీర్చేది
ఎంత చలికాలమైనా సరే, పొద్దు ఎక్కకముందే
దాలిలో రోజూ పెద్దకుండెడు పాలుకాగబెట్టేది.
రెండుపూటలా పెరుగుదుత్తలనిండా గట్టి గడ్డపెరుగు
విసుక్కోకుండా వాడకట్టుమీద అందరికీ
పాలు, పెరుగు ఓపికగా వాడుకలు పోసేది.
అమ్మ చేతి తీపి పెరుగంటే— కోమట్లకు ప్రాణం
లేదన్నా వినేవారుకాదు, ప్రాణసరం పడేవారు.
బతుకమ్మ పండుగ వస్తుందంటే నెలముందునుంచే
నెయ్యి కోసం ఊరంతా మా ఇంటిదారి పట్టి
ఈ రుచి మరో దగ్గర దొరుకదని తేల్చి చెప్పేవారు.
అమ్మ రోజువిడిచిరోజు పెద్దకుండలో చల్లజేసేది
శేరు సర్వెడు వెన్న, రెండు పటువల నిండ చల్ల…
అమ్మది బతికి చెడ్డ సంసారమే
కానీ పేదసాదల బలుగానికి లోటెప్పుడూ లేదు.
గంగెడ్లవాడు, సాతాని, బుడబుక్కలవాడు
తొలుతొలుత మా ఇంటివాకిలే తొక్కేవారు
ఊరిలో అడుగుపెట్టిన బిచ్చగాండ్లందరూ
మా ఇంటికేవచ్చి మా అరుగమీదనే వాళ్ల సామానుంచి
ఊరుతిరుగుటకు పొయ్యచ్చి.. అవ్వా దూపైతంది !
అనుడే ఆలస్యం.. అమ్మ పెద్దచెంచెడు చల్లపోసేది.
ఆ చెంబెడు చల్లత్రాగి నీ కడుపు చల్లగుండ బిడ్డ
నీ ఇంటిదీపం కలకాలం చల్లగ వెలుగనియ్యి తల్లి…
అని బీదసాదలు దీవెనార్తి ఇచ్చిపొయ్యేవారు.
ఇదంతా ఈనాటికి ఇరువయేండ్లకు ముందు కథ !
ఇవాళ అమ్మ లేదు, అన్నపూర్ణ వంటి అమ్మ
ఇంకెక్కడ, ఎవరి ఋణం తీర్చుకుంటున్నదో..!
రాత్రి ఎనిమిదింటికీ ఊరి అలికిడి మగ్గినంకా
మా ఇంటి కడపతొక్కి ఆకలి తీర్చుకున్న
అన్నార్తుల దీవెనలే… నాకు కొండంత అండ…!!…. డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article