2,59,900 కోట్ల రూపాయలు, 5,000 సంస్థలు, 30,750 ఎకరాల భూమి సంపాదించిన సహారా సంస్థ సుబ్రతోరాయ్ యజమాని అంత్యక్రియలకు అతని ఇద్దరు కుమారులు రాలేదు, కానీ అందరూ వచ్చారా..? ఈ వ్యక్తి తన పిల్లల పెళ్లిళ్లకే ఏకంగా 500 కోట్లు ఖర్చు చేశాడు… జీవితం ఇలాగే ఉంటుంది.., బంధాల విలువ కూడా…
….. ఇదీ ఓ మిత్రురాలి ఫేస్‌బుక్ తాజా పోస్టు… నిజమే… డెస్టినీ ఎవరిని ఎటు తీసుకెళ్తుందో ఎవరు చెప్పాలి..? ఇది చదవగానే మొన్నటి కరోనా చావు ఒకటి గుర్తొచ్చింది… హైదరాబాదులోనే ఫేమస్ ఫార్మసీ వ్యాపారి… పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పెట్టుబడులు… వెరీ బిగ్ షాట్… టన్నుల కొద్దీ మందులు… వందల కొద్దీ డాక్టర్లు… కానీ ఏం లాభం..? కరోనా కాటేసింది… ఒక్కడంటే ఒక్కడూ తనవాడు వెంట లేడు… ప్రభుత్వ సిబ్బంది ఓ అర్ధరాత్రి పూట పంజాగుట్ట స్మశానంలో అనామక శవానికి చేసినట్టు దహనం చేశారు…
సుబ్రతోరాయ్ అలియాస్ సహారాశ్రీకి ఏం తక్కువ..? వేల కోట్ల ఆస్తులు… కోట్ల కస్టమర్లు… పలురంగాలకు విస్తరించిన బలమైన భారీ గ్రూపు… కానీ మన దేశంలోనే బోలెడు మంది లక్షల కోట్లను ఎగ్గొట్టారు… దోచుకున్నారు… కానీ కోర్టు ఈయనపైనే ప్రత్యేక విచారణను స్వీయ పర్యవేక్షణలో చేయించింది… జైలులో ఉంటూనే నిధుల సమీకరణ, అప్పుల సర్దుపాట్లు ఎట్సెట్రా… బీపీ, సుగర్… చివరకు స్ట్రోక్‌తో అంబానీ హాస్పిటల్‌లో మరణిస్తే ప్రత్యేక విమానంలో లక్నో తీసుకెళ్లారు…
Ads
అంత పెద్ద బలగం… అంతకుముందు కొడుకుల పెళ్లిళ్లు చేస్తే దేశ అతిరథ మహారథుల వంటి నాయకులు, స్టార్లు, వ్యాపారులు, సెలబ్రిటీలు హాజరయ్యారు… కానీ అంత్యక్రియల వేళ అఖిలేష్ యాదవ్ మినహా వేరే పెద్ద తలకాయలు లేవు… అంతెందుకు..? కొడుకులు రాలేదు… తనకు ఇద్దరు కొడుకులు… సుశాంతోరాయ్, సీమాంతోరాయ్… లండన్‌లో ఉంటారు… నీ కొడుకులు ఎందుకు రాలేదమ్మా అనడిగితే సుబ్రతో భార్య స్వప్నా రాయ్ ‘‘వ్యాపార ఒత్తిళ్లు, అనివార్య కారణాలతో రాలేకపోయారు’’ అని చెప్పింది… అదీ విధి…
ప్రపంచంలో ఎక్కడికంటే అక్కడికి ప్రత్యేక విమానాల్లో వెళ్లగలిగిన కుటుంబం… కానీ తండ్రి అంత్యక్రియలకు హాజరు కాని కొడుకులు… అదే లండన్ నుంచి సీమాంతోరాయ్ కొడుకు హిమాంక్ రాయ్‌ను రప్పించారు… సుశాంతోరాయ్ కొడుకు కుషాన్ రాయ్ కూడా వచ్చాడు… ఆ ఇద్దరు మనుమలే చితికి నిప్పంటించారు… తండ్రిని ఈ లోకం నుంచి గౌరవంగా సాగనంపని కొడుకులకు వేల కోట్ల ఆస్తులుండీ ఏ లాభం..? వాళ్లు ఎందుకు తప్పించుకున్నారో రకరకాల కథనాలు వచ్చాయి…
సుబ్రతోరాయ్ కొడుకులు తండ్రి బాపతు నేరవ్యవహారాల్లో ఇరుక్కుని కష్టాలపాలు కావల్సి వస్తుందని భయపడ్డారా..? అంత్యక్రియలకు రాకపోతే ఆ అప్పులు, బాధ్యతల చెర నుంచి తప్పించుకున్నట్టేనా..? ఇండియా లీగల్ ఇష్యూస్ తప్పించుకునేందుకు సుబ్రతో భార్య, కొడుకు మాసిడోనియన్ పౌరసత్వాన్ని పొందారు, భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు… 4 లక్షల యూరోలు, పది మందికి ఉపాధి కల్పిస్తే చాలు ఆ దేశం పౌరసత్వాన్ని ఇస్తుంది… సుబ్రతోకు ఇష్టమైన నేల అది… అక్కడికి ప్రభుత్వ అతిథిగా వెళ్లివచ్చేవాడు…
చివరకు అలా వెళ్లిపోయాడు… ఇదంతా చదువుతూ ఉంటే ఓ తెలుగు సినిమా గుర్తొచ్చింది… ఒకరి మరణం, పాడెను తీసుకెళ్తుంటారు… కొడుకు లేడు, తను దొంగ… అనుకోకుండా పోలీసుల బారి నుంచి తప్పించుకుని పారిపోతూ అప్పటికప్పుడు ఆ పాడె మోస్తూ పోలీసుల బారి నుంచి తప్పించుకుంటాడు… ‘‘మమతే మనిషికి బంధిఖానా… భయపడి తెంచుకు పారిపోయినా… తెలియని పాశం వెంటపడి… ఋణం తీర్చుకోమంటుంది… నీ భుజం మార్చుకోమంటుంది’’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది… ప్చ్, సుబ్రతో రాయ్ అంత్యక్రియల్లో అలాంటి నాటకీయాలు ఏమీ చోటుచేసుకోలేదు…!!
Share this Article