తలుపులు వాటంతటవే కొట్టుకోవడం… దూరంగా నక్కల ఊళలు, గబ్బిలాల రెక్కల చప్పుడు, కెవ్వుమని ఓ ఆడగొంతు అరుపు… కుర్చీలు ఊగడం, బాత్‌రూంలో అద్దం పటేల్మని పగిలిపోవడం… ఏదో ఓ ఫోటో నుంచి నెత్తురు కారడం… ఊరికి దూరంగా ఉన్న ఇల్లు, ఎవరూ ఉండని దెయ్యాల కొంప, అందులోకి కొందరు దిగడం, ఆత్మలు యాక్టివేట్ కావడం, చిల్లర వేషాలతో ప్రేక్షకుల్ని చిరాకెత్తించడం… ఢమఢమ అంటూ నేపథ్యసంగీతం… మంత్రగాళ్లు, యంత్రగాళ్లు, నిమ్మకాయలు, ముగ్గులు… హారర్ అంటే ఇదేనా..? అవును, తెలుగు సినిమా వాళ్లకు హారర్ అంటే ఇదొక్కటే…
తాజాగా వచ్చిన పిండం సినిమా కూడా కొత్తగా ఏమీ ఉండదు… కడుపులో పిండానికీ, ఆత్మలకూ ఓ లింక్ తప్ప, కథలోనూ కొత్తదనం ఏమీ లేదు… అసలు కొత్త హారరే ప్రేక్షకులకు ఎక్కడం లేదు, ఇక పాత చింతకాయ పచ్చడి ఏం చూస్తారు..? పైగా దీనికి పెద్ద ప్రచారం, భయపడినవాళ్లు ఉండరు అంటూ… నిజమే, ఇలాంటి సినిమాల్ని రుద్దుతున్నారు, ఇలాగైతే ఏమిట్రా తెలుగు సినిమా భవిష్యత్తు అని భయపడాల్సిందే…
కాకపోతే ఈ సినిమాలో ఈశ్వరిరావు పాత్రను మెచ్చుకోవాలి… ఆమె ఓ మంత్రగత్తె… తంత్రసాధనలో ఆమె ఊరివాళ్లకు వచ్చే ఇలాంటి ఆత్మ సమస్యల్ని పరిష్కరిస్తుంటుంది… ఇంట్రస్టింగ్… ఇలాంటి కేరక్టర్లు మన సినిమాల్లో మరీ అరుదు… ఆమె కూడా బాగా చేసింది… మరో సీనియర్ అవసరాల శ్రీనివాస్ కూడా ఉన్నాడు, కానీ ఆ పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు…
Ads
నిజానికి తెలుగు ఇండస్ట్రీ ఎంతోకాలంగా, అంటే దశాబ్దాలుగా హారర్ సినిమాలు తీస్తోంది… సక్సెస్ అయినవి కొన్నే… ఊరికే దెయ్యాలు, భూతాలు అంటే ఎవడూ చూడడు… ఏదైనా కొత్త విషయం చెప్పాలి… కొత్తగా చెప్పాలి… అందరూ చంద్రముఖిని ఆత్మ సినిమా అనుకుంటారు కానీ కాదు… అది ఓ మానసిక సమస్య బాపతు సినిమా… శాస్త్రీయమే… కాకపోతే కాస్త వెగటు కామెడీ, ఆత్మ ప్రవేశం వంటి రంగులు పూసి విడుదల చేశారు…
యండమూరి బాగా పాపులరైన సినిమా తులసిదళం గుర్తుంది కదా… నిజానికి అందరూ క్షుద్రనవల, క్షుద్రప్రయోగం అని ఆడిపోసుకున్నారు కానీ తను మేజిక్, హిప్నాటిజం, సైన్స్, మెడిసిన్, పూజలు వంటి చాలా అంశాల్ని రంగరించాడు కథలో.., పైగా తన చదివించే శైలి కూడా బాగా ఉపయోగపడింది… తరువాత అదే క్షుద్రపూజల కాన్సెస్టుతో కాష్మోరా నవల వచ్చింది కానీ ఫ్లాప్… కారణం, అందులో మేక నెత్తురు, నాలుగు నిమ్మకాయలు తప్ప మరేమీ లేదు…
1980 ప్రాంతంలో ది ఎంటిటీ అనే ఇంగ్లిష్ సినిమా వచ్చింది… ప్రేక్షకులు థియేటర్‌లో కేకలు వేసేవాళ్లు… అదీ హారర్ అంటే… సో, మా సినిమా బాగా భయపెడుతుందోయ్, జాగ్రత్త అని ప్రచారం చేసుకున్నా.., కథలో, కథనంలో ఆ దమ్ము లేకపోతే ఇదుగో ఈ పిండం సినిమాలాగా మారిపోతుంది… అవునూ, దెయ్యాలు అంటేనే బలమైన నెగెటివ్ ఫోర్సెస్ కదా… వాటి శక్తులతో టార్గెట్ చేధిస్తాయి తప్ప మరీ జబర్దస్త్ షోలోలాగా కామెడీ చేసుకుంటూ కూర్చుంటాయా..? మరీ చోద్యం కాకపోతేనూ…!!
Share this Article