రైతు ఉద్యమాల ఢిల్లీలో సాగుతున్న పోరాటాల వెనుక ఎవరెవరి వ్యూహాలు ఏమిటనేది ఇక్కడ డిస్కషన్ కాదు… ఎవరెవరో ట్వీట్లు చేస్తూ అంతర్జాతీయ ప్రాపగాండాకు దిగడం, దేశీ సెలబ్రిటీలు ఎదురుదాడికి దిగడం అనే చర్చలోకి కూడా మనం ఇక్కడ వెళ్లడం లేదు… రైతు సమస్యలు అనే ఓ సున్నితమైన అంశాన్ని ముందుపెట్టి సాగుతున్న యాంటీ-బీజేపీ ఐక్యకార్యాచరణ గురించీ కాదు… ఒక దినపత్రిక… సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక పత్రిక… తన మొదటిపేజీలోనే ‘‘కుమ్మేయండి, పోలీస్ చర్య తీసుకొండి, పారామిలిటరీని దింపండి, సైన్యాన్ని నడిపించండి’’ అని పిలుపునిచ్చిన తీరు విస్మయకరం… ఆవేశానికి గురై, అది అన్నిరకాల పాత్రికేయ లక్ష్మణరేఖల్ని దాటేసినట్టుంది… అదుగో, ఆ ధోరణే విభ్రాంతిని కలిగించింది… ఎహె, ఆ పత్రికలో వ్యాసానికీ ఓ విశ్లేషణ అవసరమా అని తేలికగా తీసేయకండి… ఎందుకంటే..? సంపాదకీయాలు, ఎడిట్ వ్యాసాలు, పర్సనల్ అభిప్రాయాలు, ప్రచారాలు ఏకంగా మొదటిపేజీకి ఎక్కి, ఎలా తైతక్కలాడుతున్నాయో మొన్న ఆంధ్రజ్యోతిలో షర్మిలపై కథనాన్ని చూశాం కదా… అది కాస్త నయం, అందులో వార్త ఉంది… కానీ ఇది చూడండి ఓసారి…
ఎవరెవరు ఇంటర్నేషనల్ ప్రాపగాండాకు దిగారో రాయడం వోకే… తమ పరిధులు దాటి, ఒక దేశాన్ని అంతర్జాతీయంగా బదనాం చేయడానికి పూనుకున్న సెలబ్రిటీల పోస్టులను అనుమతిస్తున్న ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా తదితర సోషల్ మీడియా వేదికల మీద చర్యలకు మోడీ, షాలకు దమ్ములేదా అని అడుగుతున్నావంటే వోకే… ఇండియన్ సెలబ్రిటీలు ఒక్కసారిగా ఈ ప్రాపగాండాపై ఎదురుదాడికి దిగిన తీరు రాయడం వరకూ వోకే… అటు రైతుల పేరిట రాజకీయాలు, ఇటు ఇనుప మేకులు, సిమెంటు బారికేడ్లతో రహదారుల్ని ప్రభుత్వమే దిగ్బంధిస్తున్న తీరుపై విశ్లేషణలు రాస్తే వోకే… యాంటీ-మోడీ కార్యాచరణ వెనుక ఎవరెవరున్నారో రాయగలిగితే వోకే… కానీ అసాంఘిక శక్తులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ఈ దేశ సార్వభౌమత్వంపై దాడి చేస్తున్నాయనే వ్యాఖ్యలు… తక్షణం పోలీస్ చర్య తీసుకుని ఎక్కడికక్కడ అణిచివేయాలని ఓ మాస్మీడియా ప్లాట్ఫారం పిలుపునివ్వడమే వింతగా ఉంది…
Ads
నిజమే… 26 జనవరి రోజున రైతుల పేరిట అసాంఘిక శక్తులు చేసిన విధ్వంసం అసలు కాజ్ను దెబ్బతీసింది… ఎప్పుడైతే హింస, విధ్వంసం చోటుచేసుకుంటాయో ఆ ఆందోళన ప్రజల సానుభూతిని కోల్పోతుంది… ఇక్కడా జరిగేది, జరగబోయేది అదే… అయితే రైతుల పేరిట సాగుతున్న ఆందోళనలు కాబట్టి.., బీజేపీ రాజకీయంగా తమకు ఎక్కడ నష్టం జరుగుతుందేమో అని భయపడుతోంది… ఎటూ చేతకాని స్థితి… రాజకీయమూ ప్రయోగించలేదు… లా అండ్ ఆర్డర్ దిశలోనూ వైఫల్యమే… ఇప్పుడు రహదారుల నిండా మేకులు దింపుతూ, నవ్వులపాలయ్యే కార్యాచరణకు దిగుతోంది తప్ప… సమస్యకు అసలు పరిష్కారం ఏమిటో ఆలోచించడం లేదు… అసలు సమస్యను ఇక్కడి దాకా రానివ్వడమే బీజేపీ అతి పెద్ద ఫెయిల్యూర్… రాజకీయ కుట్రలున్నాయీ అని చెప్పడం కాదు, ప్రచారం చేయడం కాదు, అవెప్పుడూ ఉంటయ్… అధికారంలో ఉన్న ఓ రాజకీయ పార్టీగా బీజేపీ వాటిని చేధించాల్సిందే… కనీసం ప్రయత్నించాల్సిందే… అయితే మరీ ఈ పత్రిక పిలుపునిచ్చినట్టు అరాచకంగా సైన్యాన్ని నడిపించడం, ట్యాంకులను కదం తొక్కించడం అయితే పరిష్కారం కాదు… ఇలాంటి మీడియా అనాలోచిత దండోరాలు రాజనీతిని డిస్టర్బ్ చేస్తాయి… శాంతిభద్రతలు అంటే కేవలం లాఠీలు, తూటాలు కాదు… చాలా మార్గాలుంటయ్… అమిత్ షా ఎంతసేపూ బెంగాల్, తమిళనాడు ఎన్నికల గురించే కాదు, ఇది సద్దుమణిగేదాకా కాస్త తన హోం శాఖనూ సీరియస్గా పట్టించుకుంటే మేలు..!
Share this Article