నిజమే… కాళేశ్వరం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఎదుట అతి పెద్ద సవాల్… ఆహా ఓహో, ఇది ప్రపంచపు పదో వింత, అబ్బురం, నదికి కొత్త నడకలు అని కేసీయార్ గ్యాంగ్ ఊదరగొట్టింది కదా… తీరా చూస్తే డిజైనింగ్ లోపాలు, నిర్మాణ లోపాలు, కమీషన్ల కథలు… రెండుమూడేళ్లకే ఓ ప్రధాన బరాజ్ కుంగిపోయింది… మిగతావీ బాగాలేవు… నిజానికి ఇంజనీరింగ్ నిపుణులు అన్నీ ఆలోచించి ఎల్లంపల్లికి రూపకల్పన చేస్తే… తనేదో పెద్ద ఇంజినీర్ అయినట్టు, తోెచినట్టు బరాజులు కాగితాలపై గీసి, రీడిజైనింగ్ చేసి, లక్షన్నర కోట్లకు పైగా వెచ్చించిన మహాఘనత కేసీయార్‌ది…
చెక్స్, క్రాస్‌చెక్స్, బ్యాలెన్సుల గొప్ప సిస్టంగా చెప్పుకునే మన వ్యవస్థ మాత్రం కళ్లప్పగించి చూస్తుండిపోయింది… ఒక ముఖ్యమంత్రి ఎలా ఆలోచించకూడదో చెప్పడానికి ప్రపంచంలోకెల్లా అత్యంత తాజా గొప్ప ఉదాహరణ… మేడిపల్లి బరాజ్ కుంగిపోయాక ఈరోజుకూ కేసీయార్ పల్లెత్తు మాట మాట్లాడలేదు దానిపై… అందరికన్నా ప్రధానమైన జవాబుదారీ తను… అబ్బే, చిన్న టెక్నికల్ ప్రాబ్లం, మనకేం నష్టం లేదు, ఎల్అండ్‌టీదే బాధ్యత, వాళ్లే కట్టిస్తారు లేదా రిపేర్ చేస్తారు అని కేటీయార్ చెప్పాడు…
విచిత్రంగా పీసా టవర్‌తో కూడా పోల్చాడు… అలా పోల్చాలని ఎవరు చెప్పారో గానీ అది ఓ బ్లండర్… వోకే, వోకే, మాదే బాధ్యత, మేమే రిపేర్ చేస్తాం అని ఎల్‌అండ్‌టీ ప్రకటించినట్టు కూడా వార్తలొచ్చాయి ఆమధ్య… కేంద్ర బృందం అంతకుముందు ఎక్కడ పడుకుని నిద్రపోయిందో గానీ (మనకు జలశక్తి శాఖ అని ఓ కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది… అసలు కాళేశ్వరం డిజైన్లపై ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు, హఠాత్తుగా బరాజ్ కుంగిపోగానే వచ్చి, అసలు బరాజ్ మొత్తం ప్రాబ్లమాటికే, ఇతర బరాజులు కూడా చూడాల్సిందే అని చెప్పింది…)
Ads
అదే ఎల్అండ్‌టీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించినట్టు ఈనాడు బ్యానర్ వార్త ఒకటి చెబుతోంది… మాకేం సంబంధం లేదు, మేం బాధ్యత వహించే పీరియడ్ అయిపోయింది… ఖర్చులు ప్రభుత్వం భరిస్తే, ఒప్పందానికి సిద్ధపడితే మేం పనులు చేసిపెడతాం అని అత్యంత ఔదార్యంతో ఓ లేఖ కూడా రాసిందట… మరి మొదట్లో తమదే బాధ్యత అని ఎందుకు చెప్పింది..? అలా కేసీయార్ ప్రభుత్వ పెద్దలు అప్పటికప్పుడు ఏదో సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి అలా చెప్పించారా ఆ సంస్థతో…
ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం రాగానే మాట మార్చేసిందా..? నిజం చెబుతోందా..,? ఇప్పుడు దాన్ని దారికి తెచ్చుకోవడం ఎలా..? మిగతా ప్రాజెక్టు దురవస్థ ఏమిటి..? ఏం చేయాలి..? ఇంత పెద్ద టెక్నికల్, క్వాలిటీ ఫెయిల్యూర్లను చక్కదిద్దడం ఎలా..? ‘‘కేసీయార్ తిన్నదంతా కక్కిస్తా’’ అని రేవంత్ ఎన్నికల ప్రచారాల్లో భీషణ ప్రతిజ్ఞలు చేశాడు కదా… ఇప్పుడు ఏం చేయబోతున్నాడు..? (రేవంత్ పాత బాస్ చంద్రబాబుకు ఇదే ఎల్‌అండ్‌టీ బాగా సన్నిహిత సంస్థ)… అటు పోలవరం పాలక వైఫల్యాలకు అతి పెద్ద సూచిక… కాళేశ్వరం దాన్ని మించిన ప్రతీక కాబోతున్నదా..? ఎస్, రేవంత్‌రెడ్డికి అసలైన పరీక్ష కాళేశ్వరమే…!! పాత ఒప్పందాల మేరకు ఎల్‌అండ్‌టీ బాధ్యత ఏమీ లేనట్టయితే… రేవంత్‌రెడ్డి ఈ దారుణ వైఫల్యాలకు గాను ఎవరిని ఎలా బుక్ చేయబోతున్నాడు..?!
అప్ డేట్ …. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాడు…
Share this Article