విను తెలంగాణా – … వెనుదిరిగి చూసే నవ్వు…. పెన్షన్లు ఉపశమనమే. కానీ అదొక్కటే వృద్ధులను కలిసినప్పుడు మాట్లాడే విషయం కాదని బోధపడింది. పెద్ద వాళ్ళు అంటే పని విరమణా – జీవిత విరమణా కానే కాదనిపించింది.
సాయంత్రం వెలుతురు. ఆ ఊరు పేరు జ్ఞాపకం లేదు, పాలమూరులో కృష్ణా నది పుష్కరాలు జరిగే బీచుపల్లి సమీప గ్రామం. తిరిగి ఆ గ్రామ శివార్లు దాటి తారు రోడ్డు మీదుగా వెనక్కి, పట్టణానికి వెళుతుండగా ఆమె పల్లెటూరులోకి ప్రవేశిస్తున్నది. ఇంటికి తిరిగి వస్తూ కనిపించింది. అవేమిటో ముందు అర్థం కాలేదు. ‘రగ్గులు’ అని చెప్పింది. వాటిని అమ్మేందుకు ఈ అమ్మ తన గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్త పెద్ద గ్రామానికి వెళ్లి వస్తోంది.
“ఈ వయసులో ఎందుకమ్మా ఇంత కష్టం?” అంటే, ఆమె నవ్వింది.
ముందుకు నడుస్తూ ఉన్న ఆమె ఆగింది. నాకు బదులివ్వడానికి నెత్తిమీద రగ్గులతో తలతిప్పి నా వైపు చూడడానికి నిదానంగా తాను మోమును కదలాల్సి వచ్చింది. తలమీది రగ్గులతో ఆమె తిరిగి చూసి నవ్వితే ఒక పొద్దు తిరుగుడు పువ్వులా అనిపించింది,
మాటలు కలిపితే పిల్లలు లేరని చెప్పింది. క్షణం సేపే అందులో బాధ. తిరిగి చెప్పింది, భర్తా తాను ఇద్దరే ఉంటామని. “ఆయనకు చాత గాదు. కాలు కదపలేడు. కష్టం చేయలేడు’ అంది. “పక్షవాతం” అన్నట్టుగా కూడా చెప్పినట్టు గుర్తు. మందులకు మాకులకు ఇతర అవసరాలకూ తానే ఆధారం. అందుకే తనకు చేతనైనది తాను చేస్తున్నానని చెప్పింది.
రోజుకు రెండుమూడు రగ్గులైనా అమ్ముతుందని అనుకున్నాను. “కాదు, రోజుకు ఒక రగ్గు అమ్ముతాను. యాభై రూపాయలు మిగులుతాయి” అని చెప్పి ఆశ్చర్యపరిచింది.
పదేళ్ళ పాలనలో మంచి చెడుల గురించి పరిశీలిస్తూ ఉన్నందున ప్రభుత్వం పథకాల గురించి కూడా అరా తీస్తున్నందున వృద్ధులను తప్పక అడిగే ప్రశ్న ఒకటున్నది. అదేమిటో కాదు, “పెన్షన్ వస్తున్నదా? అని. అదే అడిగాను. “వస్తుంది” అన్నది. “ఇద్దరిలో ఒకరికైనా వస్తుంది కదా. నయమే అన్నాను. “అవును బిడ్డా” అన్నది. “ఆ రెండువేలతోనే ఇల్లు ఎల్లదు కదా? అంటే, నిజమే అన్నది. “సొంత ఇల్లు ఉన్నదా?” అంటే కూడా చెప్పలేదు. నవ్వుముఖం పెట్టింది. ఇంత సంభాషణలో ఆమె ఏవరినీ నిందించలేదు. పించను ఇద్దరికీ ఇవ్వాలనీ అనలేదు. ఇల్లు వాకిలి ప్రస్తావన లేదు. పిల్లలు లేకపోవడం పట్ల కూడా విచారాన్ని వ్యక్తం చేయలేదు. “కాళ్ళు రెక్కలు ఆడినంత వరకు పని చేసుకోవాలె గదా” అని మాత్రం అన్నది. అందులో ఆత్మ గౌరవం కూడా కాదు, అదేమిటో అర్థం కానీ జీవన లాలస ధ్వనించింది.
ఇల్లు గడవడానికి పెన్షన్లు వారికి ఎంతో ఉపకారం చేస్తున్నది నిజమే. కానీ యువతతో పోలిస్తే కష్ట పడటం అన్నది వీరితరంలోనే ఒక బ్రతుకు నేర్పుగా ఉన్నది. అదే అర్థమైంది. అదలా ఉంచి, “ఇలా పనిలోకి దిగడం, రోజూ కాలి నడకన వెళ్ళడం, ఇదంతా భారం కాదా?” అంటే, అమ్మ మళ్ళీ నవ్వింది.
వృద్ధాప్యం మాటు వేసినప్పుడు ఎవరినీ చేయి చాచకుండా ఉండడ మొక్కటే కాదు, భారంగా మారే ఆ గడ్డకట్టే కాలం సునాయాసంగా కరిగిపోవాలంటే కష్టపడటమే మిన్న అని ఆమె చెప్పి చకచకా ముందుకు నడిచింది.
అప్పుడు బోధపడింది. వృద్ధులను కలిసినప్పుడు పెన్షన్లు మాత్రమే మాట్లాడే ఒక ప్రధాన విషయం కాదని! అంతేకాదు, సానుభూతి మాటలూ, పరమార్శలూ, అయ్యో పాపం అన్న తీరూ వారికి నిజానికి అక్కరలేదని.
ఆ అమ్మను కలిసి నెలరోజులపైగా ఐంది. కానీ సంధ్యా కాంతిలో ఆమె పల్లెటూరులా గుర్తుకు వస్తుంది. నేడు చల్లగా మారిన వాతావరణంలో కూడా యాదికొచ్చింది. తలమీద రగ్గులతో ముందుకు నడిచే ఆ అమ్మ అంటే – ఒక వెనుదిరిగి చూసే నవ్వు. అది బతుకు దెరువు వ్యవహరం కాదు, వృద్దాప్య వీచికా కాదు. జీవితం…. కందుకూరి రమేష్ బాబు… Samanyashastram Gallery
Share this Article