‘‘బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనలపై పోలీసుల విచారణ.. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో సుమోటోగా కేస్ నమోదు.. 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు ఫైల్.. పలువురు అభిమానులపైన కేసులు నమోదు చేసిన పోలీసులు…’’
….. ఇదీ వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపిస్తున్న వార్త… చాలామంది బిగ్‌బాస్ ఫాలో కానివాళ్లకు ఆ ఘటన ఏమిటో తెలియదు… బిగ్‌బాస్ ఫినాలే షూటింగ్ కొన్ని గంటలపాటు జరిగింది… ఫినాలే నిన్న ఓ రాత్రిదాకా సాగింది… అమర్‌దీప్ అనే టీవీ సీరియల్ యాక్టర్ రన్నరప్‌గా నిలవగా, ఓ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు… ప్రోగ్రాం అయిపోయాక కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు బయటికి రాగానే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌గా చెప్పబడేవాళ్లు రన్నరప్ అమర్‌దీప్ కారుపై దాడికి దిగారు…
గత సీజన్ కంటెస్టెంట్, ఈసారి ఇంటర్వ్యూయర్‌గా ఉన్న గీతూ రాయల్ కారు మీదా కొందరు దాడికి దిగారు… ఓ బస్సు, పోలీస్ వెహికిల్ ధ్వంసం… ట్రాఫిక్ జామ్, ఉత్కంఠ, ఆ దారిలో వెళ్లే వాళ్లలో భయం… వెరసి ఓ శాంతి భద్రతల సమస్య… తరువాత పోలీసులు రంగంలోకి దిగిన పరిస్థితిని చక్కదిద్దారు… కానీ ముందుగానే అక్కడ అభిమానులు గుమికూడకుండా ఆంక్షలు విధిస్తే బాగుండేది…
Ads
గత సీజన్ల ఫినాలేల తరువాత చిల్లరమల్లర సంఘటనలు చోటుచేసుకున్నాయి… బిగ్‌బాస్ పలు భాషల్లో ప్రసారం అవుతుంది… ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో నిర్మిస్తున్నారు… కానీ ఇలాంటి ఫ్యానిజం, ఉద్రిక్తతలు ఇంకెక్కడా లేవు… చివరకు ఫ్యాన్ల పిచ్చి అధికంగా ఉండే తమిళనాట కూడా ఇలాంటి సంఘటనలు ఏమీ లేవు… కానీ హైదరాబాదులోనే ఎందుకిలా..? నగర జీవితానికి ఓ బెడదగా మారుతున్నది దేనికి..?
ఈ ఫినాలేలో పనిలోపనిగా నాలుగైదు సినిమాల ప్రచారం కూడా చేశారు… ఈగిల్, నాసామిరంగ, బబుల్‌గమ్ ఎట్సెట్రా టీజర్ల ప్రదర్శనతో పాటు ఆయా సినిమాల్లోని ముఖ్య పాత్రధారులు రవితేజ, కల్యాణరాం, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, యాషికి, సంయుక్త, సుమ, రోషన్, మానస తదితరులు కూడా వచ్చారు… అఫ్‌కోర్స్, ఆ ప్రచారంతోపాటు ఫినాలే ప్రోగ్రాంలోనూ వాళ్లను భాగస్వాములను చేశారు… దీంతో ఫ్యాన్స్ తాకిడి అధికమైంది… తీరా ఫినాలే అయిపోగానే అందరూ ఒకేసారి ఇళ్లకు బయల్దేరడంతో ట్రాఫిక్ జామ్…
అన్నింటికీ తోడు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ హంగామా మరీ ఎక్కువైంది… గొడవ జరిగింది వీళ్ల మధ్యే… పోలీసులు సూమోటో కేసు అంటున్నారు గానీ గీతూ రాయల్, contestant అశ్విని పోలీసులకు ఫిర్యాదులు చేసినట్టు వార్తలొచ్చాయి… అంతేకాదు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు దాడికి గురైన బస్సుల సిబ్బంది కూడా పోలీసు కేసులు పెట్టారు… అవసరమే… సజ్జనార్ చెప్పింది కరెక్టు… ఆర్టీసీ బస్సుల మీద దాడి అంటే సమాజం మీద దాడే… మొత్తం ఆరు ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది…
నిజానికి ప్రశాంత్ ఫ్యాన్స్ మీద కేసులు కాదు… కేసులు పెట్టాల్సింది బాధ్యతారహితంగా వ్యవహరించిన అన్నపూర్ణ స్టూడియోస్ (ఇక్కడే బిగ్‌బాస్ సెట్, ఫినాలే షూట్), టీవీలో ప్రసారం చేసిన స్టార్ మాటీవీ, ఈ బిగ్‌బాస్ నిర్మాతలు ఎండమోల్ షైన్ ఇండియా, హోస్టుగా ఉన్న నాగార్జున… వీళ్లందరినీ బాధ్యులను చేయాలి…
ఇలా చేస్తేనే రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా… గేమ్ గేమ్ అంటూనే ఫ్యాన్స్ నడుమ గొడవలు పెంచకుండా… అందరికీ ఓ బాధ్యతను, భయాన్ని గుర్తుచేసినట్టు ఉంటుంది… అవునూ, పెద్ద పెద్ద స్టార్ల ప్రిరిలీజ్ ఫంక్షన్లు జరుగుతుంటాయి… కానీ ఇలాంటి గొడవ ఒక్కటీ జరిగినట్టు దాఖలాల్లేవు… నాలుగురోజులు పోతే ఈ బిగ్‌బాస్ హీరోలు ఎవరికీ గుర్తుండరు… మరి వీళ్ల ప్రోగ్రాములకు ఈ ఘర్షణలేమిటి..? ఈ గొడవలేమిటి..? పోలీసులు బాధ్యుల కోణంలో నరుక్కురావడమే కరెక్టు పద్ధతి…!!
కామన్ మ్యాన్, మామూలు రైతుబిడ్డ అని చిత్రిస్తూ వచ్చారు కదా, మరి ఆ పల్లవి ప్రశాంత్‌కు ఇంతమంది వీర ఫ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చారు నాగార్జునా..? రెగ్యులర్ షూటింగుల వరకూ వోకే, కానీ ఇలాంటి ఫ్యాన్లు రెచ్చిపోయే ప్రోగ్రాంలు ఎక్కడో సిటీకి దూరంగా ఉండే రామోజీ ఫిలిమ్ సిటీల్లో చేసుకోవచ్చు కదా… ఎలాగూ టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉంటుంది కదా… నగరం నడిమధ్యలో ఈ ఇష్యూస్ క్రియేట్ కావడం దేనికి..?!
Share this Article