ముందుగా వాట్సప్‌లో కనిపించిన ఓ మెసేజ్ చదవండి…
నమస్తే తెలంగాణలో ఉద్యోగాల కుదింపు – ఆందోళనలో జర్నలిస్టులు!
నమస్తే తెలంగాణా దిన పత్రికలో ఇరవై శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నామంటూ యాజమాన్యం ఈ ఉదయం ఇక మీ సేవలు అవసరం లేదని కొద్దిమందికి చెప్పినట్టు నా పూర్వ సహచర జర్నలిస్టు మిత్రులు ఫోన్ చేసి తెలిపారు. ఎంతమాత్రం ఊహించని ఈ పరిణామంతో వారు చాలా ఆందోళనలో ఉన్నారు. ఎవరెవరికి వద్దని చెప్పారో ఒకరినొకరు సంప్రదించుకుంటూ వారంతా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు.
Ads
పాత్రికేయ మిత్రులారా, ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగాలు మానేయాలని చెప్పడాన్ని ఖండిస్తూ ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మన అందరం డిమాండ్ చేయాలి. ప్రభుత్వం మారగానే జర్నలిస్టులను రోడ్డు పాలు చేయడాన్ని నిలువరించాలి.
ప్రస్తుత సంపాదకులు తిగుళ్ళ కృష్ణమూర్తి గారు గారు స్పందించాలని కోరుతూ ఈ విషయం తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు, ఆ పత్రిక పూర్వ సంపాదకులూ ఐన TUWJ అధ్యక్షులు అల్లమన్న దృష్టిలో పెడుతూ ఈ చర్యను ఆపేందుకు ఇతర అన్ని యూనియన్లు, సోదర పాత్రికేయులు, ఉద్యమ సహచరులు అంతా కూడా దయదేసి కృషి చేయాలని సాదర విజ్ఞప్తి…
కందుకూరి రమేష్ బాబు
స్వతంత్ర జర్నలిస్టు
అల్లమన్న టీఆర్ఎస్ క్యాంపే కాబట్టి ఏం మాట్లాడగలడు..? కేసీయార్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటగళం వినిపిస్తాడా..? ఇన్నాళ్ల విధేయతను వదుల్చుకోగలడా..? హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్ బాధ్యతలకు సమాంతరంగా మరోవైపు అధికారిక అకాడమీ పదవి… ఈ ఎపిసోడ్‌కు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చాక బ్రేకులు పడ్డయ్… సరే, వాటిని అలా వదిలేస్తే నమస్తే తెలంగాణ భవిష్యత్తు ఏమిటి..? ఇదీ పెద్ద ప్రశ్న…
నిజంగానే తన మీద వ్యక్తిగతంగా, తన పార్టీ మీద టన్నుల కొద్దీ విషం చిమ్మిన నమస్తే తెలంగాణ పత్రిక మీద రేవంత్ రెడ్డి ఓ చూపు చూస్తే… దాని అసలు సర్క్యులేషన్, దాని ప్రభుత్వ యాడ్ టారిఫ్ గనుక కాస్త తవ్వితే చాలు నమస్తే తెలంగాణ పరిస్థితి పొయ్యిలో పడ్డట్టే…!! ఇంకాస్త రియాలిటీలోకి వెళ్దాం… ‘‘2017-2018 కాలానికి తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల ఆదాయం గత సంవత్సరపు ఆదాయంతో పోల్చితే 387.4% పెరిగింది’’ ఇదీ వికీపీడియా చెబుతోంది… ‘‘తెలంగాణా టుడే, ఆంగ్ల వార్తాపత్రిక, 1749.2% పెరుగుదలను చూసింది…’’ ఏదో న్యూస్ వెబ్ సైట్ రాసింది ఇలా…
సదరు పత్రిక ఒకప్పుడు తెలంగాణ ఉద్యమావసరాల కోసం స్థాపించబడినా… దాని ఒరిజినల్ పెట్టుబడిదారుడు సీఎల్ రాజం నుంచి కేసీయార్ దాన్ని పూర్తిగా తీసేసుకున్నాక అది అక్షరాలా టీఆర్ఎస్ కరపత్రికగా మారిపోయింది… (తరువాత బీఆర్ఎస్)… కేవలం ఆ పార్టీ గెజిట్ అది… జనం చదవడం మానేస్తే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టి మరీ చందాలు చేయించారు… చివరకు పార్టీ అవసరాల కోసం ఫ్రీ కాపీలు కూడా పలుచోట్ల సప్లయ్ చేశారు… మరి ఇప్పుడేమైంది..?
కేసీయార్ పార్టీని జనం తిరస్కరించారు… ఇన్నాళ్లుగా కేవలం పార్టీ అవసరాల కోసం మాత్రమే ఎలాగోలా నడిపించబడుతున్న ఆ పత్రిక ఇప్పుడు హఠాత్తుగా గుదిబండలా కనిపిస్తోంది ఓనర్లకు… నిజానికి ఇప్పుడే ఆ పత్రిక అవసరం వాళ్లకు… ప్రభుత్వ విధానాలపై బలంగా పోరాడే ప్రతిపక్షంగా ఉండాలని ప్రజలు తీర్పు చెప్పారు… దానికి ఓ వాయిస్ కావాలి… ఆ అవసరం తీర్చడానికి నమస్తే తెలంగాణ కావాలి… కానీ దానికి విరుద్ధ దిశలో వెళ్తోంది యాజమాన్యం… కాస్ట్ కటింగ్ పేరిట దాన్ని కుదించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు… దీంతో ఆగదు… ఇంకా సీరియస్ నిర్ణయాలు ఉంటయ్… (గుర్తుందా..? పార్టీ ఆంధ్రా అవసరాల కోసం నమస్తే ఆంధ్రా అనే పత్రికను కూడా ఆలోచించారు అప్పట్లో…)
ప్రస్తుతం ప్రింట్ మీడియా పరిస్థితి నిజంగానే బాగాలేదు… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వ యాడ్స్ వస్తయ్ కాబట్టి వెలుగు పత్రికను కొనసాగిస్తారేమో ఎలాగోలా… కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే, వివేక్ గెలవకపోతే ఆ పత్రిక పరిస్థితి ఏమై ఉండేదో… నిజానికి దాని సిట్యుయేషన్ కూడా ఏమీ బాగాలేదు… అధికారంలో ఉన్నారు కాబట్టి యాడ్స్, సర్క్యులేషన్ విషయాల్లో ప్రభుత్వం ఫుల్లు సపోర్ట్ చేస్తోంది కాబట్టి సాక్షి పొజిషన్ పైకి బాగానే కనిపిస్తోంది… ఏమో… రేప్పొద్దున ఏమిటో… అంతటి ఈనాడే ‘‘కార్డు టారిఫ్’’కు అడ్డగోలు రిబేట్లు ఇస్తూ, ఖర్చుకు సరిపడా ఆదాయం కోసం కిందామీదా పడుతోంది… ప్రింట్ మీడియా ఇప్పుడున్న దురవస్థలో నమస్తే నిర్ణయాలు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు కానీ, నిజంగా పోరాడాల్సిన సందర్భంలో చేతిలో కాగడాగా నిలవాల్సిన పత్రికను చేజేతులా కుదించడం దేనికనేదే అంతుపట్టని ప్రశ్న…!!
Share this Article