Stress Eating.. ఒక అనారోగ్యకరమైన ఫేజ్! వారం నుంచి కొంత పని ఒత్తిడి, స్ట్రెస్‌తో ఉన్నాను. ఎప్పటికప్పుడు పనులు జరిగిపోతూ ఉన్నాయి. అయినా ఏదో అలజడి! ఈ మధ్యలో నాలో ఒక మార్పు గమనించాను. ఖాళీగా కూర్చుంటే ఆకలి వేస్తున్నట్లు అనిపించడం, ఉదయం 8 గంటలకు టీ తాగినా, మళ్లీ 10 గంటలకు మరోసారి టీ తాగాలని అనిపించడం, బాగా తియ్యగా, బాగా కారంగా ఉన్న పదార్థాలు, స్ట్రీట్ ఫుడ్ తినాలని అనిపించడం.. ఇవన్నీ తెలుస్తున్నాయి.
మొదట్లో ఇదంతా మామూలే అనుకున్నాను కానీ వారానికే శరీరం కొంచెం లావు ఎక్కడం తెలిసింది. సాయంత్రం వేళ ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. వారం రోజులపాటు రోజూ సాయంత్రం కొంచం స్వీట్ తినడం చూశాక నాకు అనిపించింది, నేను ‘Stress Eating’ బారిన పడ్డానేమోనని. నాకు నేనుగా దీన్ని నిర్ధారించడం లేదు కానీ, ఈ లక్షణాలు అలాగే కనిపిస్తున్నాయి.
అసలు ఏమిటి ఈ Stress Eating?
Ads
ఆ మధ్య నటి అనసూయ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఒకప్పుడు Stress Eatingని ఎదుర్కొన్నానని అన్నారు. మహానటి సావిత్రి గారు కూడా ఈ ఫేజ్‌లోనే బాగా లావయ్యారని అందరికీ తెలుసు! ఇదేమీ జబ్బు కాదు, కానీ ఇదొక రకమైన మానసిక ఒత్తిడితో చేసే అనారోగ్యకరమైన పని. మానసిక ఒత్తిడి, ఆలోచనల కారణంగా వేళ కాని వేళ ఏదో ఒకటి తినాలని అనిపించడం, కడుపు నిండినా ఇంకా ఇంకా కావాలి అనిపించడం, అందులోనూ ఉప్పు, కారం, తీపి వంటివి ఎక్కువగా తినాలని కోరిక కలగడం.. ఇవన్నీ ఆ లక్షణాలు.
అలా తినడం ద్వారా మానసిక సంతృప్తి వచ్చినట్టు భ్రమ కలుగుతుంది. దీనివల్ల లావు పెరుగుతారు. బద్దకం, ఊబకాయం పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. దాదాపు అందరూ ఏదో ఒక సందర్భంలో ఈ Stress Eating బారిన పడతారని అంచనా. వాళ్లకు లక్షణాలు కాస్త వేరుగా ఉండొచ్చు కానీ జరిగే నష్టం మాత్రం ఇదే!
ఎందుకొస్తుంది ఈ Stress Eating?
‘మానసిక ఒత్తిడి’ అనేది ప్రధాన కారణం. ఏదైనా పని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఒత్తిడి వస్తుంది.(అలా నీకేంటి ఒత్తిడి అని ఇక్కడికిక్కడ అడగొద్దు. నరుని జన్మకు నలభై రకాల బాధలు. చాలా చిన్నవే కానీ ఒత్తిడి పెంచుతూ ఉంటాయి). ఆ స్ట్రెస్‌తో మనం పోరాడుతున్న సమయంలో చుట్టూ ఎవరూ లేకపోతే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అన్నిసార్లు మానసిక ఒత్తిడే కారణం కానవసరం లేదు, ఒక్కోసారి విపరీతమైన ఉత్సాహం, ఉత్కంఠ, ఆందోళన, ఏమీ తోచని స్థితి.. ఇవన్నీ కూడా Stress Eatingకి కారణం అవుతాయి.
కొందరు భోజనం చేసి సినిమాకి వెళ్లినా ఇంటర్‌వెల్‌లో మళ్లీ ఏదో ఒకటి కొని నములుతూ ఉంటారు. సినిమా చూస్తున్న ఉత్సాహం, ఉత్కంఠ దీనికి కారణం. కొందరు ఏమైనా రాసేప్పుడు, చదివేప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు తింటూ ఉంటారు. మనలో చాలామంది ఫోన్ చూడకపోతే భోజనం చేయలేరు. ఇవన్నీ Stress Eatingలోని అంశాలే! ఇంకా చెప్పాలంటే, కొందరు పొద్దున్నే సిగరెట్ తాగకపోతే మలవిసర్జన చేయలేరు. అది కూడా ఇందులో భాగమే!
దీన్ని ఎలా అధిగమించాలి?
వరుసగా వారం రోజుల పాటు కిలోమీటర్ దూరంలోని స్వీట్ షాప్‌కి వెళ్లి జిలేబీ తిన్నాను. కేవలం రూ.20లదే తిన్నాను కదా, పెద్ద నష్టం లేదు అని నాకు నేను సర్ది చెప్పుకొన్నాను. ఇవాళ సాయంత్రం మళ్లీ అడుగులు అటు పడుతుంటే నాకు విషయం అర్థమై నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. మరో రెండు గంటల్లో భోజనం చేయొచ్చు కదా అని నాకు నేను చెప్పుకొంటూ ఉన్నాను.
ఇలా ఎవరికి వారు తమను తాము నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. సినిమా చూడటం, పుస్తకం చదవడం, ఏదైనా రాయడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, ఇంట్లో వారితో ఏదో ఒక అంశంపై చర్చించడం, సంగీతం వింటూ మనసు ఆకలి మీదకు పోకుండా చేసుకోవడం.. ఇలాంటివి చేయొచ్చు. ‘Walking’ చేయడం అన్నింటికంటే ఉత్తమమైన మార్గం. ఇవి చేస్తున్నంతసేపు చేతికి అందుబాటులో తిండి పదార్థాలు ఉంచుకోకూడదు. ఆ ధ్యాసే లేకుండా చూడాలి. ఇలా Stress Eating బారిన పడినవారు ఒక బృందంగా ఏర్పడి ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకుంటే మరింత బాగుంటుంది.
దొంగ ఆకలిని గుర్తించాలి!!
మనకు నిజం ఆకలి, ఉత్తుత్తి ఆకలి అని రెండు రకాల ఆకలి వేస్తూ ఉంటుంది. నిజమైన ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం అవసరం. అందులోనూ సరైన పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. కానీ ఉత్తుత్తి ఆకలి దొంగది! కంటి ముందు ఏమైనా ఆహారం ఆకర్షణీయంగా కనిపిస్తే ఈ దొంగ ఆకలి మొదలవుతుంది. ఈ దొంగ ఆకలి అనేది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద మార్కెట్. Street Food కొనేవారిలో చాలామంది ఈ దొంగ ఆకలి బారిన పడి ఇబ్బంది పడుతుంటారు.
మిర్చీ బజ్జీలు, పునుగులు, సమోసాలు, పానీపూరీ.. ఇవన్నీ దొంగ ఆకలి ప్రేరేపితాలే! వాటిని ఎప్పుడో ఒకసారి తినడం ఫర్లేదు కానీ రోజుకోసారి తప్పకుండా తినడం అలవాటు చేసుకుంటే మాత్రం అంతే! కొందరు పని నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు బజార్లో ఆగి బజ్జీలో, పునుగులో పార్సల్ చేసి తీసుకువెళతారు. ఒక టైం తర్వాత అవి లేకపోతే పిల్లలు ఇంట్లో అన్నం తినని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా దొంగ ఆకలిని సీరియస్‌గా తీసుకోవడం వల్ల జరిగే నష్టం. ఆ ఆకలిని గుర్తించి ముందే కట్టడి చేయకపోతే మెల్లగా అనారోగ్యం బారిన పడక తప్పదు. – విశీ
Share this Article