ఇక వచ్చే 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగేదాకా బోలెడన్ని వార్తలు కనిపిస్తూనే ఉంటాయి… కుహనా సెక్యులరిస్టులు నెత్తీనోరూ బాదుకుంటూనే ఉంటారు… లౌకికత్వం అంటే హిందువులను వ్యతిరేకించాలనీ, ఇతర మతస్తులను అక్కున చేర్చుకోవాలనే భ్రమాత్ముల విశ్లేషణలు కూడా బోలెడు చదువుతూ ఉంటాం… కొన్ని వైపరీత్యాలు, విశేషాలు కూడా కనిపిస్తయ్…
రాముడి జన్మభూమి అట, శూర్పణఖ జన్మభూమి కాదా, రావణుడి జన్మభూమి కాదా… అని ప్రేలాపనలకు దిగిన పెద్దమనిషి అయిపూజాడా లేకుండా పోయాడు… ఆయన కూతురేమో హఠాత్తుగా అయోధ్య సానుకూల ప్రకటనలకు పూనుకుంది… తమ మౌత్ పీస్ అకస్మాత్తుగా రాముడి సేవలో తరించిపోతోంది… కాలాల కొద్దీ, పేజీల కొద్దీ కథనాలు… మరి లోకసభ ఎన్నికలు వస్తున్నాయి కదా, హిందువులను మభ్యపెట్టే కొత్త వేషాలు… ఇదుగో ఇలా…
Ads
బీజేపీ, సంఘ్ పరివార్‌ను మించిన దూకుడుతో బాబ్రీ కట్టడాన్ని కూల్చిన శివసేనకు ఇప్పుడు రాముడు జస్ట్, బీజేపీ కార్యకర్తలా కనిపిస్తున్నాడు… శివసేన శల్యుడు సంజయ్ రౌత్ ఏకంగా ‘‘రాముడిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తారేమో’’ అని ఎకసక్కేలు సంధిస్తున్నాడు… మరి కాంగ్రెస్, ఎన్సీపీలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు కదా, హఠాత్తుగా సెక్యులరిజాన్ని ఒళ్లంతా పూసుకోకతప్పడం లేదు… సంఘ్ పరివార్, అయోధ్య ట్రస్టు అసలు శివసేన నుంచి ఎవరినీ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదట… సోనియాకు ఆహ్వానం, ఠాక్రేకు ఆహ్వానమే లేదు… వావ్…
ఇక సీతారాం ఏచూరి పిచ్చికూతలు చదువుతూనే ఉన్నాం… ఎర్రన్నలు కదా, ఉలిపికట్టె బ్యాచు… వదిలేస్తే ఒకావిడ వీడియో వాట్సపులో బాగా వైరలవుతోంది… సంఘం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బాలరాముడి అక్షింతల్ని ప్రతి గడపకూ చేరుస్తుందట, కలశప్రముఖులు ఇల్లిళ్లూ తిరుగుతారట… ఆల్‌రెడీ మనం ముందే కలిపి ఉంచుకున్న అక్షింతలతో వాటిని కలిపేసుకోవాలట… ఆరోజు అయిదు దీపాలు వెలిగించి, రెండు పూజ గదిలో, రెండు గడపకు ఇరుపక్కలా, ఒకటి తులసికోటపై ఉంచాలట… అవును మరి, ఈ సందర్భాన్ని ఆర్ఎస్ఎస్ తన వ్యాప్తికి బ్రహ్మాండంగా వాడుకుంటుందని అనుకుంటున్నదే… కానీ..?
మోడీ మాత్రం ఆరోజు ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి చాలు అంటున్నాడు… అప్పట్లో కరోనా వేళ కూడా ఇలాంటి పిలుపులు కొన్ని ఇచ్చినట్టు గుర్తు… అఫ్‌కోర్స్, దీపం వెలిగించండి అనేది మంచి సూచనే… విదేశీయుల దండయాత్రలో దెబ్బతిన్న హిందూ స్వాభిమానానికి అయోధ్య ఓ ఉపశమనం… ఏదో ఎయిర్ పోర్టు ప్రారంభం, అమృత్ భారత్ రైలు ప్రారంభం ఎట్సెట్రా వార్తల్ని అలా కాసేపు వదిలేస్తే… చటుక్కున ఆకట్టుకున్న వార్త ఒకటి కనిపించింది… అదేమిటంటే… అబ్బే, ఫరూఖ్ అబ్దుల్లా నాలుగు మంచి మాటలు కాదు…
అయోధ్య గుడి మీద ఏళ్ల తరబడీ సాగిన కోర్టు వివాదం తెలుసు కదా… ముస్లిం పక్షాన పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ అన్సారీ ప్రధానిపై పూలవర్షం కురిపించాడనే వార్త… దాన్ని సమర్థించుకున్నాడు కూడా… గుడ్, సద్భావన… దీనికన్నా ఆసక్తికరం అనిపించింది… రాముడి అత్తింటివారు, అనగా ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న జనకపురి ప్రాంతం నుంచి ఈ ప్రాణప్రతిష్ఠ ఉత్సవం కోసం పవిత్రజలాల్ని పంపించడం… అంతేకాదు, రాముడి తల్లి కోసల ప్రాంతానికి చెందినది కదా, చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్‌ఖురీ ఆమె స్వస్థలం అంటారు… అందుకని చత్తీస్‌గఢ్ ప్రభుత్వమే 300 టన్నుల సువాసనభరిత బాస్మతి బియ్యాన్ని అయోధ్య ప్రసాద వితరణ కోసం పంపించింది… ఇదంతా ఆ ఉత్సవాన్ని ఓన్ చేసుకునే ప్రక్రియ, భక్తి…
Share this Article