అంతటి బిగ్‌బాస్ రియాలిటీ షోను అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించే స్టార్‌మాటీవీ… ఇతర రియాలిటీ షోలలో అట్టర్ ఫ్లాప్..! ఆ చానెల్ ఏ రియాలిటీ షోను కూడా విజయవంతంగా జనంలోకి తీసుకురాలేకపోయింది… ఈమధ్య మరీ భ్రష్టుపట్టించారు గానీ కాస్తో కూస్తో ఈటీవీ రియాలిటీ షోలకే ఆదరణ ఎక్కువ ఉండేది… చివరకు జీతెలుగు కూడా స్టార్‌మా బాటలోనే… దానికీ రియాలిటీ షోలు అచ్చిరావు… నిజానికి స్టార్ మా, జీతెలుగు టీవీల్లో క్రియేటివ్ టీమ్స్ మరీ అంత క్రియేటివ్ కాకపోవడమే వాటి సమస్య…
ఎంటర్‌టెయిన్‌మెంట్ టీవీలకు సంబంధించి ఫిక్షన్, నాన్ ఫిక్షన్, మూవీస్ ఎట్సెట్రా కేటగిరీలుంటాయి… ఫిక్షన్ అంటే సీరియళ్లు ప్రధానంగా… నాన్ ఫిక్షన్ అంటే రియాలిటీ షోలు… మూవీస్ సరేసరి… నిజానికి చానెళ్ల రేటింగులు పెరిగేవి, నిలిపేవి ప్రధానంగా ఫిక్షన్ సీరియళ్లే… రీచ్ ఎక్కువ కారణంగా స్టార్ మా సీరియళ్ల రేటింగులు ఎక్కువ… జీతెలుగు దాంతో పోటీపడటానికి బలంగానే ప్రయత్నిస్తోంది… ఆరేడు సీరియళ్లు మంచి రేటింగ్సే పొందుతున్నయ్…
కానీ మంత్రతంత్రాలు, మాయలు, మూఢనమ్మకాల సెంట్రిక్ కథలు, అభూతకల్పనలు, జనం నవ్వుకునే ట్విస్టులు జీతెలుగు సీరియళ్లను చెడగొడుతుంటయ్… ఇక రియాలిటీ షోల విషయానికి వస్తే అంతటి బిగ్‌బాస్ షోను కూడా రెండు సీజన్లుగా భ్రష్టుపట్టించారు… గతంలో ఈటీవీలో డాన్స్, మ్యూజిక్, కామెడీ, కిట్టి పార్టీల్లాంటి షోలు బాగా నడిచేవి… ఇప్పుడవన్నీ మూస… దాంతో వాటి రేటింగ్స్ దారుణంగా పడిపోయి, మొత్తంగానే ఈటీవీ మూడో ప్లేసుకు వెళ్లిపోయింది… ఆ సీరియళ్లు కూడా బాగుండవు…
Ads
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… జనం ఆసక్తిగా చూసే ‘పాటల పోటీ’ షో, అనగా సూపర్ సింగర్ షోను కూడా స్టార్ మాటీవీ చెడగొట్టేసింది… అంతకుముందే సరిగమప పేరిట జీతెలుగు దాన్ని ఓ కామెడీ షోగా మార్చింది… ఇప్పుడు సూపర్ సింగర్‌ను కూడా అలాగే మార్చేశారు… అందుకే జనం ఛీకొట్టారు… లాంచింగ్ ఎపిసోడ్లకే జస్ట్ 3.96… 3.21 రేటింగ్స్ వచ్చాయి (హైదరాబాద్ బార్క్)… స్టార్ మా రీచ్, వారు పెట్టే ఖర్చు, తీసుకున్న సెలబ్రిటీలు, ప్రేక్షకుల ఆసక్తి కోణంలో నిజానికి మంచి రేటింగ్స్ రావాలి… కానీ ఇప్పుడొచ్చినవి సింపుల్‌గా దరిద్రపు రేటింగ్స్… పేరుకు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, అనంత శ్రీరాం, మరో లేడీ సింగర్ శ్వేతామోహన్ జడ్జిలు… కానీ… మొన్న మనం ముచ్చటలో రాసుకున్న లాంచింగ్ ఎపిసోడ్ల రివ్యూ ఏమిటంటే..?
‘‘లెక్కకు మిక్కిలి జడ్జిలు, మెంటార్స్, ఎట్సెట్రా హంగులన్నీ ఉన్నా సంగీతం కొరవడింది… ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీలా నడిపించారు… వెకిలి జోకులు, బిగ్‌బాస్ వీకెండ్ షోలాంటి ఛాయలు… సేమ్, అవన్నీ స్టార్ మా సూపర్ సింగర్ షో పుణికి పుచ్చుకుంది… జడ్జిలే మెంటార్లు, వాళ్లకే గ్రూపులు… తమకు ఏ జడ్జి కావాలో కంటెస్టెంట్ ఎన్నుకోవడం అట… ఫన్నీ… మరో ఓచోట ఘోరం ఏమిటంటే… ఇద్దరు జడ్జిలకు డాన్స్ పోటీ పెట్టి, వాళ్లు వేసిన పిచ్చి గెంతుల ఆధారంగా కంటెస్టెంట్ ఓ జడ్జిని కమ్ ఓ మెంటార్‌ను కమ్ ఓ ఓనర్‌ను ఎన్నుకోవడం… తాగినోడిలా గెంతులేసిన అనంతశ్రీరాం గెలిచాడు అందులో…
ఇది మరీ శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా దాటిపోయింది… జడ్జిలకు స్టెప్పులు రావాలి… కంటెస్టెంట్లకు స్టెప్పులు రావాలి… స్టెప్పులతోనే వేదిక మీదకు రావాలి… హోస్ట్ భీకరమైన కేకలు సరేసరి… ఆమెకు దీటుగా అనంత శ్రీరాం… ఆ సరిగమపలో ఓ లిరిక్ రైటర్‌లా గాకుండా ఓ కమెడియన్‌లా అలరించిన ఆయన ఈ సూపర్ సింగర్‌లోనూ అంతే… అలవోకగా పదాల్ని అల్లేయగల ఈ కలనేత నిపుణుడు చివరకు ఇలా జోకర్ కావడం ఏమిటో… ఫాఫం… ఒక తమన్, ఒక శైలజ, ఒక కార్తీక్ తరహాలో టెక్నికల్‌గా పాటను జడ్జి చేయగల వారెవరూ లేరు… ఫాఫం… స్టార్ మా సూపర్ సింగర్ షో…!!’’
అవును, సగటు సంగీతాభిమాన ప్రేక్షకుడు కూడా ఇలాగే ఫీలయ్యాడు… అందుకే ఎహెపోరా అని చీదరించేసుకున్నాడు… కామెడీ చేయడానికి జబర్దస్త్‌లు, ఎక్సట్రా జబర్దస్త్‌లు ఉన్నాయి కదా, ఈ సినిమా పాటల పోటీలో కూడా ఎందుకు కామెడీ స్కిట్లు..?!
Share this Article