మొన్న మనం కూడా చెప్పుకున్నాం కదా… అన్నపూరణి అనే ఓ దిక్కుమాలిన సినిమాలో క్లైమాక్సులో దర్శకుడి పైత్యం ఎలా పెడదోవలు పట్టిందో… బిర్యానీ అద్భుతంగా రుచిగా రావడానికి, వంటలపోటీలో గెలవడానికి ఓ బ్రాహ్మణ పడతి ముస్లిం వేషధారణతో వంట చేయాలని సూచించిన ఆ సినిమా గురించి…
అసలు మతానికీ వంటలకూ సంబంధం ఏమిటి..? వేషధారణకూ వంట అద్భుతంగా రావడానికి లంకె ఏమిటి..? సినిమా చూసిన ప్రేక్షకులకు పిచ్చెక్కింది… అంటే… దద్యోదనం బాగా వండాలంటే జంధ్యం వేసుకుని, పంచె గోచీ వేసుకుని, నొసటన నామాలు దిద్దుకుని, ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థించి వంట చేయాలా..? సరే, మళ్లీ ఆ మొత్తం కథలోకి ఎందుకులే గానీ… కథ, కథనం, క్లైమాక్స్ ఏమీ పట్టని నయనతారకు భారీ షాక్… (ఈమేనా బాపు రామరాజ్యంలో సీత… !!!)
ఇప్పటికే ఎల్ఐసీ అనే పేరు పెట్టి సదరు జీవిత బీమా సంస్థ నుంచి నోటీసులు అందుకున్న ఆమె భర్త విఘ్నేశ్ శివన్ కథ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా… ఇక అన్నపూరణి కథకు వద్దాం… సోషల్ మీడియాలో సదరు దర్శకుడిని, కథను, నటిని ఏకిపారేశారు… ప్రతి దానికీ మతంతో ముడిపెట్టే నిర్వాకాన్ని అందరూ ఎండగట్టారు…
Ads
ఈ విమర్శలన్నీ చూసిన, చదివిన విశ్వహిందూ పరిషత్ ఆ సినిమాను ప్రదర్శించే జీ5, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫారాలకు ఫిర్యాదు చేసింది… ఈ సినిమా కథ, కథనం మొత్తం హిందువుల, బ్రాహ్మణుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని, ఆ సినిమా ప్రదర్శన కొనసాగితే దానిపై తమ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించింది…
దీంతో సదరు జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఉలిక్కిపడింది… సదరు సినిమా ప్రసారాన్ని నిలిపివేసింది… నెట్‌ఫ్లిక్స్‌తో కూడా సంప్రదింపులు స్టార్ట్ చేసింది… ఎడిట్ చేసేవరకు ఈ నిర్ణయం ఇలాగే ఉంటుందని ఓ లేఖను విశ్వహిందూపరిషత్‌కు పంపించింది… పైన కనిపిస్తున్న లెటర్ అదే…
ఐతే, నిజానికి ఆ సినిమాలో క్లైమాక్స్ ఎడిట్ చేయడం కష్టం… అది లేకపోతే సినిమాయే లేదు… సదరు దర్శకుడి నిర్వాకం అది… సో, ఆ సినిమాను కనీసం ఓటీటీ షో కోసమైనా సరే ఎలా ఎడిట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది… చివరగా… సకినాలు పోయాలంటే తెలంగాణ మహిళ అయి ఉండాలి… ఉలవచారు రుచిగా రావాలంటే ఆంధ్రా మహిళ అయి ఉండాలి… సాంబార్ సరిగ్గా కుదరాలంటే తమిళ మహిళ అయి ఉండాలి… కేక్ టేస్టీగా రావాలంటే క్రిస్టియన్ అయి ఉండాలి… పైగా ఆ వేషధారణతో, ఆ ప్రార్థనలతో ఆ వంటలకు ఉపక్రమించాలి… ఏమిటర్రా ఇది..? మన సినిమాలో క్రియేటివిటీ, బుర్ర తిరుగుడు పైత్యం వైపు పయనిస్తున్నట్టుంది..!
Share this Article