భారతీయ సినీ దర్శకురాలు దీపా మెహతా 1996లో ‘ఫైర్’ అనే సినిమా తీశారు. ఎగువ మధ్యతరగతి ఇంట్లో ఇద్దరు తోడికోడళ్ళు. పెద్దామె భర్త ఆధ్యాత్మిక దారిలో పడి భార్యకు శారీరకంగా దూరంగా ఉంటున్నారు. రెండో ఆమె భర్త ప్రియురాలి మోహంలో మునిగి భార్యను పట్టించుకోవడం లేదు. ఇలాంటి స్థితిలో ఆ ఇద్దరు స్త్రీల మధ్య శారీరక సంబంధం మొదలైంది. కొన్నాళ్లకు ఆ సంగతి ఇంట్లో వారికి తెలిసింది. ఆ తర్వాత?
27 ఏళ్ల తర్వాత మలయాళంలో ‘కాతల్’ అనే సినిమా వచ్చింది. స్వలింగ సంపర్కి అయిన భర్త. అతని వల్ల ఇరవై ఏళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే శారీరక సుఖం పొందిన భార్య. వారి సంసారానికి సాక్ష్యంగా ఒక కూతురు పుట్టింది. కానీ ఒక స్త్రీగా ఆ భార్య సుఖం, సంతోషం ఎవరికీ పట్టడం లేదు. భర్త మంచివాడే, కానీ ఈ విషయంలో నిస్సహాయుడు. బలవంతపు పెళ్లిలో నెట్టివేయబడ్డ అతనూ ఈ స్థితిని యథాతథంగా అంగీకరించి మౌనంగా ఉన్నాడు. ఇరవై ఏళ్ల తర్వాత ఆ భర్త నుంచి భార్య విడాకులు కోరుతోంది. కోర్టులో తన భర్త గురించి నిజం చెప్పింది. అందుకు సాక్ష్యంగా తన భర్త తండ్రిని న్యాయస్థానంలో నిలిపి అందరికీ వాస్తవం తెలిపింది. ఆ తర్వాత?
భారతీయ సమాజం ఎదిగిందని అనాలని ఉంది కానీ, నిజానికి ఈ 27 ఏళ్లలో ఎదిగింది భారతీయ సినీ సమాజం మాత్రమే! భారతీయ సమాజం ఇంకా చాలా విషయాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటూ పైకి మాత్రం అభివృద్ధి మేకప్ వేసుకుని కనబడుతోంది. మన సమాజాన్ని అప్పటికీ ఇప్పటికీ సినిమాలే గట్టిగా ప్రభావితం చేస్తున్నాయి. ఏ సమూహాన్ని ఎలా గౌరవించాలో, ఏ ప్రాంతాన్ని ఎలా చూపించాలో, ఏ కులం తోకను టైటిల్‌లో ఎక్కడ పెట్టాలో సినిమాలే మనకు చూపించాయి, నేర్పించాయి. LGBT వర్గాన్ని కొన్ని దశాబ్దాల పాటు కామెడీకి, క్రూరత్వానికి చిహ్నంగా చూపిన సినిమాలు, ఆర్టికల్ 377ను నేరంగా పరిగణించడం మానేశాక ఆ పద్ధతిని కొంచెం ఆపేశాయి. అంతకుముందే ‘ఫైర్’ భారతీయ సమాజానికి బలమైన గొంతుక వినిపిస్తే, 27 ఏళ్ల తర్వాత వచ్చిన ‘కాతల్’ అదే ఫైర్‌లోని రెండో వైపును చూపించింది. ఇదొక Progressive Journey అనుకోవచ్చు.
Ads
‘The Great Indian Kitchen’ సినిమా ద్వారా భారతదేశపు దృష్టిని తనవైపు తిప్పుకొన్న జియో బేబీ ఈ సినిమా దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపూ నాకొకటే సందేహం! 72 ఏళ్ల మమ్ముట్టి గారికి, 45 ఏళ్ల జ్యోతిక గారికి ఈ సినిమా కథను దర్శకుడు ఎలా నెరేట్ చేసి ఉంటారు? ఏం చెప్పి ఒప్పించి ఉంటారు? ఒక ‘గే’, అతని వల్ల శారీరక సుఖం పొందని భార్య.. బహుశా భారతీయ సమాజం చర్చించేందుకు ఏమాత్రం ఇష్టపడని ఈ రెండు పాత్రలను చేసేందుకు వారిని ఎలా ఒప్పించి ఉంటారు? ఈ ఒక్క విషయంలోనే ఆయనకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు! పైగా సినిమాలో ఈ కేసు వాదించే ఇరుపక్షాల లాయర్లనూ స్త్రీలుగా చూపించారు. విడాకుల కేసు కాబట్టి రొటీన్‌గా ఆడ లాయర్లనే పెట్టారని అనిపించినా, ఒక విలక్షణమైన అంశాన్ని చర్చించే క్రమంలో స్త్రీల పాత్ర ముఖ్యం అనే విషయాన్ని దర్శకుడు సూచించడం బాగుంది. ఆ ఇద్దరు లాయర్ల పాత్రల్లో ముత్తు మణి, చిన్ను చాందిని చాలా బాగా నటించారు.
జన్మతః మలయాళీ అయిన మమ్ముట్టి తన పరిధి మేరకు పాత్రను బాగా చేయడం సబబే! అయితే ఆ భాష మనిషి కాని జ్యోతిక ఓమన పాత్రలో ఒదిగిపోయారు. నిశితమైన ఎక్స్‌ప్రెషన్, తీక్షణమైన చూపు, కళ్లతో పలికించే భావాలు.. అన్నీ కలిసి ఆ పాత్రకు నిండుతనం తెచ్చాయి. ఇలాంటి పాత్రలు దొరకడమే అరుదు, అదీ ప్రతిభ గల నటికి దొరికితే ఇంక చెప్పేదేముంది? సినిమా కొంత స్లోగా ఉంది కాబట్టి (మన తెలుగు వాళ్ల దృష్టిలో) కాస్త Fast Forward చేసి చూసినా నష్టమేమీ లేదు. కానీ పూర్తిగా చూస్తే ఫీల్ బాగుంటుంది. సినిమా చివర్లో గాయని చిత్ర గారు పాడిన పాట చాలా బాగుంది.
‘ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు’ అనే ప్రశ్న నేను వేస్తే మీరు నా కామెంట్ బాక్స్ మొత్తం నిండిపోయేలా సమాధానాలు చెప్తారు. Anyway, నేను ఆ ప్రశ్న అడగబోవడం లేదు. ‘Society gets what it deserves’ అంటుంది అయన్‌రాండ్. మనకూ అంతే కావొచ్చు! ‘ఇరువురు భామల కౌగిలిలో.. ఇరుకున పడి నీవు నలిగితివా’ అనే పాట గొప్ప ఆధ్యాత్మిక కీర్తనగా చలామణీ అయిన నేల మనది! చారెడేసి కళ్ల శోభన, తళుకుమనే నగ్మా కలిసి కండల వీరుడు సుమన్‌ని అల్లుకుపోయి, పిల్లల్ని కనిచ్చే ‘రెండిళ్ల పూజారి’ని హిట్ చేసిన చరిత్ర మనది! కొడుకు ముందే రెండో భార్యతో రొమాన్స్ చేసే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ని గొప్ప కుటుంబ కథా చిత్రం చేసిన జాతి మనది! హీరోకు ముగ్గురు, వీలైతే నలుగురు, ఇంకా మాట్లాడితే పంచ పాండవుల కాన్సెప్ట్‌లాగా ఐదుగురు భార్యలుంటే మనకు నచ్చుతుంది కానీ, హీరో ‘గే’ అంటే ఎలా? తెలుగు జాతి పునాదులు కదిలిపోవూ!
‘Every Male is a G-y, Every Female is a Le-bian’ అనేది కొందరి అభిప్రాయం! ఇష్టం, ఆసక్తి, అవకాశం, హార్మోన్లు వంటి వివిధ కారణాలతో అందరిలోనూ కొందరు మాత్రం స్వలింగ/ద్విలింగ సంపర్కులు (G-y/Le-bian/Bise-ual)గా ఉంటారు. మన దేశ జనాభాలో 17 శాతానికి పైగా G-ys & Les-ians, 9 శాతం మంది Bise-uals ఉన్నారని అంచనా. 2022లో IPSOS సర్వే ప్రకారం దేశంలోని ప్రతి వంద మందిలో 30 మంది LGBTలో ఏదో ఒక వర్గానికి చెందినవారే ఉన్నారని తెలిసింది. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. స్వలింగ సంపర్కుల మౌనం కారణంగా వారి జీవిత భాగస్వాములు పడే ఇబ్బందుల గురించి ఈ సినిమాలో కొంతమేరకు చర్చించారు. ఇంకా బోలెడంత చర్చించాలి. ఇది మొదలు మాత్రమే! – విశీ
Share this Article