హీరో ప్రకటన! విలన్ అనువాదం!!
————————
ఒకప్పుడు జపాన్ హోండా తో జత కట్టిన హీరో ఆటోమొబైల్ కంపెనీ రెండు దశాబ్దాల తరువాత విడాకులు తీసుకుని వేరయ్యింది. ఇప్పుడు హోండా, హీరో దుకాణాలు ఎవరికి వారివి ప్రత్యేకం. పార్కింగ్ కు అంగుళం చోటు లేకపోయినా కార్లు కొనేవాళ్లు ఎంతగా పెరుగుతున్నా భారతదేశంలో ద్వి చక్ర వాహనాలు బైక్ లు, స్కూటర్లే ఎక్కువ. హీరో పది కోట్ల బైక్ లు అమ్మిన సందర్భంగా దేశమంతా ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల పత్రికల్లో మొదటి పేజీ రంగుల ప్రకటనలు ఇచ్చింది. నిజానికి ఈ ప్రకటన ఇంగ్లీషు స్క్రిప్ట్ కవితాత్మకంగా, భావ గర్భితంగా, అందంగా ఉంది. నమ్మకానికి ప్రతిరూపం:-
———————
“మీరు ఎంతగానో ప్రేమించే మీ కుటుంబ సభ్యుల కోసం;
మైళ్లకొద్దీ నవ్వుల ప్రయాణం కోసం;
కళ్లల్లో ఆనందం తొణకిసలాడ్డం కోసం;
కలల రెక్కలు కట్టుకుని ఎగరడం కోసం;
ఆగకుండా సాగిపోయే ప్రయాణాల కోసం-
తయారయినది.
పది కోట్ల మంది విజయగాథల నుండి
మేము మీకోసం తయారు చేసిన వాహనం.
మీ నమ్మకమే పునాదిగా మా ప్రయాణం”
Ads
ఇదీ దాదాపుగా ఇంగ్లీషు ప్రకటనకు తెలుగులో అర్థం. ఇంకా ప్రయత్నిస్తే ఇంతకంటే మంచి తెలుగులో కూడా రాయవచ్చు. ఇంగ్లీషులో చాలా పొయెటిక్ గా స్మైల్స్ మైల్స్, ఫ్లయ్ హై లాంటి పదాలు మనసుకు హత్తుకుంటాయి. అయితే దీని తెలుగు అనువాదం గుడ్డి గూగుల్ లాంటి యంత్రం అనువదించిందో, యంత్రంగా మారిన మనిషి అనువదించాడో తెలియదు కానీ- “100 మిలియన్ కథలకు ఆధారంగా తయారు చేయబడింది. నమ్మకంతో తయారు చేయబడింది. మేము 100 మిలియన్ యూనిట్ల సంచిత ఉత్పత్తి మైలు రాయిని దాటిన ఏకైక భారతీయ ఆటోమోటివ్ ఉత్పత్తిదారులం. మీ నమ్మకం వల్లే ఇది సాధ్యమయ్యింది. హీరోలు. మీకు ధన్యవాదాలు.” అని ఉంది. భావ కవిత లెవెల్లో అంత అందంగా ఇంగ్లీషులో రాసినవారికి ఈ అనువాదం తెలిస్తే సిగ్గుతో తలదించుకుంటారు. బాధ పడతారు. భయపడతారు. గుండె రాయి చేసుకోలేనివారైతే అపరాధభావంతో ఆత్మహత్య చేసుకుంటారు.
భారత దేశంలో సంఖ్యామానం ఎప్పుడయినా వందలు, వేలు, లక్షలు, కోట్లే. పాశ్చాత్య దేశాల్లో, ఇంగ్లీషులో మిలియన్లు, హండ్రెడ్ థౌజెండ్లు, థౌజెండ్ మిలియన్లు సహజం. 100 మిలియన్ అంటే ఎన్ని కోట్లో లెక్కవేయడానికే భారతదేశంలో చాలా యుగాలు పడుతుంది. సాధారణంగా సినిమాలకు కథలు తయారవుతుంటాయి. ఇక్కడ పది కోట్ల హీరో బైక్ లకు ఆధారంగా కథలు తయారయ్యాయని అనువాదకుడు మనకు చక్కగా వివరించాడు. లేదా పది కోట్ల కథల ప్లాట్ ఫామ్ ఆధారంగా సాంకేతికంగా హీరో బైక్ లు తయారయ్యాయని మనం అనుకున్నా అనువాదకుడు ఏమీ అనుకోకపోవచ్చు. అల్యూమినియం, ఐరన్ లోహాలతో బైక్ లు తయారవుతాయి. కానీ ఈ పది కోట్ల బైక్ లు నమ్మకం అనే సరికొత్త లోహంతో తయారయ్యాయి.
“పది కోట్ల యూనిట్ల సంచిత ఉత్పత్తి మైలు రాయి…” ఈ మాట రాసినందుకు ఈ అనువాదకుడి కాళ్లు ఎవరయినా పట్టిస్తే పాద నమస్కారం చేయాలని ఉంది నాకు. ఎంతటి సంచిత పుణ్యమో, సమంచిత పాపమో చేసి ఉంటే తప్ప ఇలాంటి మాటలు దొరకవు. తెలుగులో నేను వీక్. ఎవరయినా తెలుగు పండితులు “సంచిత ఉత్పత్తికి” వ్యుత్పత్తి అర్థం చెప్పి పుణ్యం కట్టుకోండి. పొద్దున్నే ఈ ప్రకటన ఎవరూ చూడరు. చూసినా చదవరు. చదివినా అర్థం కాదు కాబట్టి బతికిపోతారు. లేదంటే సంచిత అనువాద మహాపాపం వెంటపడి, చింతిత భాషా శిథిల పైత్యం ప్రకోపించి ఎటు చూసినా ఎర్రగడ్డలే కనిపిస్తాయి. నా దగ్గర మూడు సంచిత హీరో బైక్ లు ఉన్నాయి. అయినా ఈ అనువాదంతో నా మనోభావాలను దెబ్బతీసిన హీరో నుండి సంచిత నష్టాన్ని రాబట్టే వినియోగదారుల చట్టాలేమయినా ఉన్నాయా! ఉంటే అవి సంచిత కొనుగోలుకు వర్తిస్తాయా!!…………….. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article