Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంజలిని ముద్దాడాలంటే ఏదో ఇబ్బంది… దర్శకుడు కొట్టేవాడు అప్పుడప్పుడూ…

February 4, 2024 by M S R

‘షాపింగ్ మాల్’ హీరో ఏడీ? ఏమయ్యాడు? (షాపింగ్ మాల్ (తమిళంలో ‘అంగాడి తెరు’) సినిమాలో అంజలితో కలిసి నటించిన హీరో మహేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 14 సినిమాలు చేసినా అవేవీ విజయం సాధించలేదు. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు ఇవి..)

* మాది తమిళనాడులోని దిండుగల్. నేను వాలీబాల్ క్రీడాకారుణ్ని. జాతీయ స్థాయిలో కూడా ఆడాను. ఒకసారి టోర్నమెంట్ ఆడి వస్తూ రోడ్డు దాటుతున్న టైంలో కొందరు నన్ను ఆపి, సినిమాలో నటిస్తావా అని అడిగారు. వాళ్లు దర్శకుడు వసంతబాలన్ అసిస్టెంట్లు. ఆయన తీయబోయే సినిమాలో హీరో కోసం పల్లెలకొచ్చి వెతుకున్నారు. నేను వారికి కనిపించాను.

* తమిళనాడు తరఫున వాలీబాల్ ఆడటానికి నేను మధ్యప్రదేశ్ వెళ్లాను. ఆ టైంలో కూడా వసంతబాలన్ సార్ అసిస్టెంట్లు నాకు అక్కడికి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కొన్నాళ్లకు ఈ విషయం మా కోచ్‌కు తెలిసింది. అదే టైంలో నా కాలికి గాయమైంది. “ఈ గాయంతో ఎక్కువకాలం నువ్వు ఆడలేవు. సినిమా అవకాశం అందరికీ రాదు. కాబట్టి వెళ్లి ఓసారి ప్రయత్నించు. నచ్చకపోతే తిరిగి వచ్చేయ్” అని మా కోచ్ సలహా ఇచ్చారు. దాంతో వసంతబాలన్ దగ్గరికి వెళ్లాను. అలా ‘అంగాడి తెరు’తో నా ప్రయాణం మొదలైంది.

Ads

* ‘అంగాడి తెరు’ సినిమా చేసేనాటికి నాకు 18 ఏళ్లు. అప్పుడే ఇంటర్ పూర్తి చేసి వచ్చాను. ఆ వయసులో ఉండే యువత ఎలా ఉంటుందో నేనూ అలాగే ఉన్నాను. సినిమా రంగం గురించి ఏమీ తెలియదు. అలాంటి నన్ను తొలి సినిమాతోనే హీరోగా చేయడం వసంతబాలన్ గారి గొప్పతనం. ఆయనే నా గురువు. ఆ సినిమా షూటింగ్ దాదాపు 180 రోజులు చేశాం. మొత్తం స్క్రిప్ట్ ముందే నాకు ఇచ్చేవారు. దాన్ని బాగా చదువుకొని లొకేషన్‌లో నటించేవాణ్ని.

* షూటింగ్‌‌లో నాకు కష్టమైన విషయం అంటే, అంజలితో రొమాన్స్ చేయడం. తను నాకన్నా నాలుగేళ్లు పెద్ద. పైగా సినిమాల్లో సీనియర్. అప్పటిదాకా నేను ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్‌గా లేను. ఉన్నట్టుండి అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒక సన్నివేశంలో నేను అంజలిని ముద్దు పెట్టుకోవాలి. అప్పుడైతే మా అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేశాను.

* ‘అంగాడి తెరు’ షూటింగ్ అంతా నిజమైన షాపింగ్ మాల్‌లోనే జరిగింది. రాత్రిపూట జనం తక్కువగా ఉంటారు కాబట్టి అప్పుడే ఎక్కువగా షూట్ చేసేవారు. ఒక్కసారి ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు మొదలుపెడితే, రేపు సాయంత్రం ఆరు గంటల దాకా తీస్తూనే ఉండేవారు. చెన్నై నగరంలో రోడ్డు మీద షూటింగ్ అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు! జనానికి తెలియకుండా జనం మధ్యలో కెమెరా పెట్టి షూట్ చేసేవారు.

* షూటింగ్‌లో ఏదైనా సన్నివేశం సరిగా చేయకపోతే వసంత బాలన్ కోప్పడేవారు. కొన్నిసార్లు కొట్టేవారు కూడా! ఆయన తపన అంతా సినిమా బాగా రావాలనే. అంజలితోపాటు తోటి నటీనటులు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఫ్రేమ్ అంటే ఏమిటి, లైటింగ్ ఎలా తీసుకోవాలి, ఓవర్‌ల్యాప్ కాకుండా ఎలా చూసుకోవాలి.. ఇలాంటి అంశాలన్నీ నేర్పించారు. సినిమాలో నేను బాగా నటించానంటే అదంతా అందరూ నాకు అందించిన సహకారమే!

* ‘అంగాడి తెరు’ సినిమా విడుదలై చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మరికొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పటికి నా వయసు 20. నాకు ఎలాంటి సరిపోతాయో ఆలోచించే పరిపక్వత లేదు. మంచి కథ అనుకొని కొన్ని కథలు ఒప్పుకొని ముందుకు వెళ్లాను. కానీ అవి హిట్ కాలేదు. కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది.

* సినిమా రంగంలో నేను అడుగు పెట్టేనాటికి నాకు ఏమీ తెలియదు. తొలి సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతా సాఫీగా గడిచిపోయింది. కానీ రెండో సినిమా, మూడో సినిమా ఫ్లాప్ అవుతున్న కొద్దీ నాకు ఈ రంగం గురించి అవగాహన వచ్చింది. ఇక్కడ హిట్టే ముఖ్యం. సక్సెస్ ఉంటేనే ఎవరైనా మన వెంట ఉంటారు.

* వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాక, నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. కొంతకాలం మద్యానికి అలవాటయ్యాను. ఆ తర్వాత నాలో ఆలోచన మొదలైంది. ‘నేనొక క్రీడాకారుణ్ని. నాకు జయాలు, పరాజయాలు మామూలే! ఒకసారి ఓడిపోతే మళ్లీ మళ్లీ పోరాడాలి’ అనే ఆలోచనతో ఆ మందు అలవాటు నుంచి బయటకు వచ్చాను.

* కొన్నిసార్లు మంచి సినిమాలు మన దాకా వచ్చినా మనం చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. సీను రామసామి దర్శకత్వంలో వచ్చిన ‘తెన్‌మేర్కు పరువకాట్రు’ సినిమా నేను చేయాల్సింది. ముందుగా నాకే కథ చెప్పారు. అప్పటికి ఆయనకు నిర్మాత లేరు. ఆ తర్వాత నేను మరో షూటింగ్‌లో ఉన్నాను. ఆ పాత్ర విజయ్ సేతుపతి చేశారు. ఆయన కెరీర్లో అది బెంచ్ మార్క్ సినిమాగా మిగిలింది. అలాగే ఎం.శరవణన్ తీసిన ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్'(తెలుగులో ‘జర్నీ’) సినిమాలో కూడా శర్వానంద్ పాత్ర నేను చేయాల్సింది. అది కూడా మిస్సయింది.

* సినిమాల్లోకి రాకపోయి ఉంటే నేను పోలీసు శాఖలోనో, ఆర్మీలోనే ఉద్యోగం చేసేవాణ్ణి. నా ఫ్రెండ్స్ కొందరు క్రీడా కోటాలో మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయ్యారు. నేను క్రీడల మీదే దృష్టి పెట్టి ఉంటే అలా ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాణ్ణి. ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాల కోసం చూస్తున్నాను. హీరోగానే కాకుండా, నాకు తగ్గ మంచి పాత్ర ఏదైనా చేస్తాను.

* 23 ఏళ్ల వయసులోనే ఇల్లు కట్టి, మా చెల్లెలికి పెళ్లి చేశాను. ఆ విషయంలో మా అమ్మానాన్న సంతృప్తిగా ఉన్నారు. కానీ నేనే ఇంకా సెటిల్ కాలేదని వాళ్ల బాధ. పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. సినిమాలో కొంచెం నిలుదొక్కుకున్నాక ఆ వైపు ఆలోచిస్తాను.

* నా జీవితంలో నేను తొలిసారి ఎక్కువ కాలం స్నేహంగా ఉన్న అమ్మాయి అంజలి. ఆ వయసులో తన మీద క్రష్ ఉండేది. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. ఇప్పటికీ తనతో మాట్లాడుతూ ఉంటాను. అంతకుమించి సినీరంగంలో నాకెవరూ స్నేహితులు లేరు… – విశీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions