మహి వి రాఘవ … యాత్ర-2 దర్శకుడు… యాత్ర ఫస్ట్ పార్ట్‌ను అందరికీ కనెక్టయ్యేలా, ఎమోషన్స్ కూడా సరిగ్గా చిత్రిక పట్టగలిగి… తీరా యాత్ర సీక్వెల్‌కు వచ్చేసరికి… తనలోని క్రియేటివ్ దర్శకుడిని కోల్పోయాడు అనే విమర్శను ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు… జగన్ వ్యతిరేక శిబిరం ఎలాగూ సినిమా మీద ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తుంది, అది సహజం… ఇది సాదాసీదా ఓ మసాలా మూవీ కాదు గనుక, వర్తమాన రాజకీయాలతో అల్లబడిన కథ గనుక… ఒక నాయకుడిని బాగా ఎలివేట్ చేస్తూ, హీరోదాత్తంగా చూపించి, తన ప్రత్యర్థులను నెగెటివ్ షేడ్స్‌లో చూపించింది గనుక…
మహి రాఘవలో నచ్చిన గుణం ఏమిటంటే… కూల్‌గా, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మీడియాకు జవాబులిస్తాడు… తను చెప్పేది అతక్కపోయినా సరే, తన వాదన ఏదో స్పష్టంగా చెబుతాడు… అంతేకాదు, ఈ సినిమా అందరికీ నచ్చాలనేమీ లేదు అని కూడా నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యక్తీకరించాడు ఎక్కడో… నిజానికి సినిమాలో జగన్ ప్రత్యర్థుల పాత్రల్లో మరీ విషాన్ని, ద్వేషాన్ని ఏమీ నింపినట్టు అనిపించలేదు… పొలిటికల్ డెవలప్‌మెంట్స్ చెబుతూ, జగన్‌ను పైకెత్తుతూ, జగన్ కోరుకున్న ఇమేజీని బిల్డప్ చేసే క్రమంలో… ఆ కథను జగన్ కోరుకున్న కోణంలో మాత్రమే చెప్పడం అనేది మామూలు టాస్క్ కాదు… అవును, ఉన్నంతలో మహి రాఘవ సినిమాను బాగానే ప్రజెంట్ చేశాడని చెప్పుకోవచ్చు…
ఉన్నంతలో… అంటే, తనకు నిర్దేశించబడిన పరిమితుల్లో… తనకు అనుమతించబడిన స్వేచ్ఛలో… నిజంగానే యాత్రకు యాత్ర-2కూ నడుమ చాలా తేడా ఉంది… యాత్ర తండ్రిది… యాత్ర-2 కొడుకుది… మొదటి కథలో ఎమోషన్స్‌కు కొంత చాన్సుంది, తెర మీదకు దాన్ని బలంగా తీసుకొచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు… కానీ రెండో కథలో అంత బలమైన ఎమోషన్స్‌కు పెద్దగా చాన్స్ లేదు… యాత్ర ఫస్ట్ పార్ట్‌లోని వైెస్ పాదయాత్ర కథ ఒకప్పటి ఈనాడు టైటిల్ ప్రకారం చెప్పాలంటే… ఒక నాయకుడి నడత మార్చిన నడక అది… వైఎస్ తన మీద జనంలో ఉన్న ఓ నెగెటివ్ ముద్రను ఆ పాదయాత్ర ద్వారా పోగొట్టుకుని, రియల్ లీడర్‌గా తనను తాను చెక్కుకున్నాడు… రెండో యాత్ర అధికారం కోసం సాగిన యాత్ర… జగన్‌ను జనం లీడర్‌గా యాక్సెప్ట్ చేస్తున్నప్పటి దశ ఇది…
Ads
ఉన్నంతలో అని ఎందుకన్నానంటే… దర్శకుడి చుట్టూ అనేక పరిమితులు… ఆ బౌండరీలోనే ఆడాలి… పరుగు తీయాలి… కష్టమే… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా నలుగుతున్న చర్చ ఏమిటంటే… బయోపిక్ అంటే సదరు వ్యక్తిని మాత్రమే బలంగా, పాజిటివ్‌గా ఎలివేట్ చేసేది మాత్రమే అనుకున్నా సరే, ఆ వ్యక్తి ప్రస్థానంలో కీలకపాత్ర పోషించిన షర్మిల పాత్రను పూర్తిగా ఎత్తేయడం ఏమిటి అనేది… ఈ పాత్ర మొత్తమే లేకుండా చేయడం దర్శకత్వానికి మరక అనలేం… అంతకుమించి తనేమీ చేయలేడు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప…
కాకపోతే ఏదో క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం ఓసారి చేశాడు… కానీ నప్పలేదు… https://www.youtube.com/watch?v=m-bo81Juvx8&ab_channel=NTVEntertainment….
షర్మిల పాత్ర లేకపోవడం కూడా సినిమాకు నెగెటివ్ పాయింట్ అయిపోయింది… సారుకు ఇష్టం లేదు కాబట్టి చూపించలేం అనుకున్నా సరే, ప్రస్తావనామాత్రంగానైనా ఆమె పాత్ర ఉండి ఉండాలి… ఆమె లేకుండా జగన్ ప్రస్థానం ఎక్కడుంది..? కీలకమైన కష్టదశలో పార్టీని కాపాడింది ఆమే… అసలు షర్మిల అనే వ్యక్తే లేనట్టుగా కథ నడపడం చాలామందికి నచ్చలేదు… ఇది సినిమాకు కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయి, జనంలో చర్చ జరుగుతూ… జగన్ ఏదయితే వద్దనుకున్నాడో అదే సానుభూతి ఇప్పుడు షర్మిలకు వస్తున్నట్టుంది… జగన్ కుటుంబబంధాల్ని కూడా వదిలేసి, అసలు షర్మిల పాత్రనే తన కథ నుంచి డిలిట్ చేయించాడనే నెగెటివ్ సంకేతాల్ని పంపించినట్టయింది… సినిమా చూసే మామూలు జనానికి కూడా ఇందులో షర్మిల ఎక్కడుందనే ప్రశ్నను దర్శకుడు తనంతటతనే లేవనెత్తినట్టయింది…
ఎస్… వైఎస్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో… సొంత పార్టీ పెట్టి మొండిగా జనంలోకి వెళ్లి, జనం యాక్సెప్టెన్సీ పొందడంలో… ఢిల్లీకి తలవంచకుండా, జైలుకు వెళ్తానని తెలిసీ, ఆ సవాళ్లకు ఎదురీదడానికి సిద్ధపడటంలో… జగన్ సక్సెస్… ఇదంతా పొలిటికల్ కోణం… సాక్షి టీవీలో జగన్ యాత్ర సీన్లను మళ్లీ మళ్లీ చూస్తున్నట్టు అనిపించిందే తప్ప… ఓ క్రియేటివ్, హ్యూమన్ ఫీల్ కలిగేలా కథను మరింత కనెక్టింగుగా రాసుకోవడంలో మహి రాఘవ తడబాటు ఉంది… కథలో ఉదాత్తత కత్తిరించబడటంలో నిజానికి తన తప్పేమీ లేదు… ముందే చెప్పుకున్నాం కదా… ‘ఉన్నంతలో’ ఏదో కష్టపడ్డాడు అని… అదే నిజం… సోషల్ మీడియా చర్చల సారాంశం కూడా అదే… అవునూ, తన పాత్రను జగన్ జీవితం నుంచే డిలిట్ చేయడంపై షర్మిల ఎక్కడైనా స్పందించిందా..?! చివరగా… ఆసక్తి ఉంటే ఈ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఓసారి చదవండి…
Share this Article