పెళ్లి కొడుకు ఉద్యోగం తీసిన ప్రీ వెడ్ షూట్… డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు.
పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్ ఫోనే రేడియో. సెల్ ఫోనే టీ వి. సెల్ ఫోనే మీటింగ్ వారధి. సెల్ ఫోనే మనిషిని నడిపే సారథి.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారికి తాము డిజిటల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. తమ మొహం అందంగా ఉండడం వల్ల లోకానికి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. లోపలనుండి తన్నుకొచ్చే జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూ ట్యూబుల్లో పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. వాటికి జనం పెట్టే కామెంట్లను పదే పదే చదవాలనిపిస్తూ ఉంటుంది. క్షణక్షణానికి అందగించే తమ ముఖారవిందాలను వెను వెంటనే డి పి లుగా పెట్టుకుని లోకాన్ని అనుగ్రహించాలనిపిస్తూ ఉంటుంది. లక్షల వ్యూస్, లైకులు, షేర్లు రావాలనిపిస్తూ ఉంటుంది.
Ads
వ్యక్తిగతం, దాపరికం ఏమీ లేదు. డిజిటల్లో అంతా ఓపెన్.
“ఇప్పుడే నిద్ర లేచి బాత్ రూమ్ వెళుతున్నా”
– ఒక అప్ డేట్.
“హ్యాపీ నేచర్ కాల్”
-దానికి రిప్లై.
పెళ్లి, శోభనం, చావు, ఇంటా బయటా ఏదయినా లోకానికి చెప్పాలి. ఒకరిని చూసి ఒకరు…నువ్ తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్లు డిజిటల్ కంటెంట్ లో పోటీలు పడుతున్నారు.
వ్యూస్ బాగా వస్తే ఆనందం; ఉత్సాహం; ఉక్కిరిబిక్కిరి.
రాకపోతే వైరాగ్యం; నిరుత్సాహం; నైరాశ్యం.
సంసారాల్లో డిజిటల్ చిచ్చు భగ్గున మండి…లైకులు, కామెంట్ల బూడిద మిగులుతోంది. మండే అగ్గిలోకి మరింత పెట్రోల్ పొసే ఫాలోయర్లకు కొదవలేదు.
ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలె గూడు.
జ్ఞానమొక వాట్సాప్ యూనివర్సిటీ.
జీవన దృశ్యమొక ఎడతెగని యూట్యూబ్.
మనిషి పేస్ ఒక ఫేస్ బుక్.
ఇష్టమొక ఇన్ స్టా గ్రామ్.
అభిప్రాయమొక పొట్టి ట్విట్టర్.
బలమయిన ఆహారం లైకులు.
అంతులేని ఆవేదన కామెంట్లు.
తరగని ఆస్తి సబ్ స్క్రిప్షన్.
జీవన సర్వస్వమొక సోషల్ మీడియా వ్యసనం.
…చివరకు మిగిలేది వర్చువల్ బూడిద!
అన్నట్లు-
కర్ణాటకలో ఒక ప్రభుత్వ వైద్యుడికి పెళ్లి కుదిరింది. పెళ్లికి ముందు నిశ్చితార్థం, లగ్నపత్రిక రాసుకోవడం లాంటి సంప్రదాయాలు ఉన్నా లేకున్నా…ప్రీ వెడ్ షూట్ అని ఇప్పుడొక నాట్యాభినయ నటనా ప్రహసనం తప్పనిసరి. అందులో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ ప్రతిభకు పదును పెడతారు. కాబోయే దంపతులు కూడా సిగ్గు విడిచి…తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. దానికి శక్తిని బట్టి లొకేషన్లు, పాటలకు కాబోయే వధూవరుల నటనా కౌశల ప్రదర్శనకు కొరియోగ్రాఫర్ల శిక్షణ, పెళ్లి మండపంలో తాళి కట్టడానికి ముందే…వధూవరులు హద్దులు చెరిపి ముద్దులు పెట్టుకునే రసవత్ దృశ్యాలు ఎల్ ఈ డి స్క్రీన్లలో ప్లే చేయకపోతే ఆ పెళ్లి పెళ్లే కాదు.
అలాంటి దృశ్యాలను చూస్తూ…తమ పెళ్లిలో ఇలా ప్రీ వెడ్ షూట్ జరగలేదని కొందరు పెద్దలు నైతిక బాధ్యతగా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. దాంతో మన కర్ణాటక డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్ షూట్ కు డ్యాన్సులు చేశాడు. వీడియో చాలా బాగా వచ్చి…వైరల్ అయ్యింది. ఉద్యోగం పోయింది. పోతే పోయింది. వెధవ ఉద్యోగం. ఇప్పుడు హాయిగా ఆసుపత్రుల బయట ఆఫ్టర్ వెడ్ షూట్ లు చేసుకుంటూ…నవ దంపతులు మూడు వీడియోలు, ఆరు లైకులుగా చిలకా గోరింకల్లా బతికేయవచ్చు!….. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article