గొట్టిముక్కల కమలాకర్ రచించిన అదో హాస్పిటల్ అనబడు చిత్రరాజం కథ ఇది…! ట్యాగ్ లైన్ :: తాళి అంటే మాంగల్యమే కాదురా.., పుస్తె కూడా..!
జనరల్ వార్డు క్షయ పేషెంటుకి రోగం కమ్మేసినట్టు దిగులుగా, స్పెషల్ వార్డు డబ్బున్నోడి షష్టిపూర్తి అవుతున్న ఫంక్షనుహాల్లా దర్జాగా ఉన్నాయి..!
ఆ హాస్పిటల్ ఎంట్రన్సులో వినాయకుడూ, ఏసుక్రీస్తూ, మసీదు బొమ్మా కలిపి ప్రింటేసిన ఓ ఫోటో ప్లాస్టిక్ ఫ్రేము కట్టించి భారతదేశపు సెక్యులరిజమంత అందంగా ఉంది. దాని ముందు పూలూ, అగరుబత్తీలూ, దీపాలూ ఉన్నాయి.
Ads
క్యాషు కౌంటరు వెనుక పెద్ద లక్ష్మీదేవి ఫోటో బంగారపు రంగు ఫ్రేములో ఉంది. దానికి ఓ మంచిగంధపు మాల వేసుంది.
కౌంటర్లో సారధి ఉన్నాడు. అతని అసిస్టెంట్ గా గిరిజ ఉంది. ఆమె పొట్టేసుకుని, నీలంరంగుపరికిణీ; గులాబీరంగు వోణీలో వచ్చింది. తలలో ఓ కనకాంబరం మాల పెట్టింది.
ఓ జ్యోతిలక్ష్మి హెడ్ నర్సువేషంలో హడావుడిగా తిరుగుతోంది. ఆమె తెల్ల ఫ్రాకు మోకాళ్లకు నాలుగున్నర ఇంచీల పైకి ఉంది. ఆమెతో ప్రేమలో పడడానికి కాంపౌండర్లు రాజబాబూ, నగేషూ పోటాపోటీగా ట్రయల్సేస్తున్నారు.
ఆ ఆసుపత్రి రావుగోపాలరావుది. ఆయన కొడుకు గిరిబాబు ఆ ఆస్పత్రిలో ఎక్కడో ఎవరో లేడీడాక్టర్ని బలాత్కారం చేయబోతున్నాడు.
ముక్కామల అక్కడ చీఫ్ డాక్టరు..! ఆయన వంటిమీద తెల్లకోటూ, మెడమీద స్టెత్తూ, భుజాలమీద బోలెడంత బరువు బాధ్యతలు వేసుకుని నీరసంగా తిరుగుతున్నాడు.
ఓ మంచం మీద అల్లు రామలింగయ్య పేషంట్లా పడుకొని ఉన్నాడు. అతను చొక్కా పంచే కట్టుకునే ఉన్నాడు. డాక్టర్లు అతనికి కిడ్నీ ఆపరేషన్ చేయబోయి టెస్టికిల్ తీసేసారు. అతను కామెడీగా ఏడుస్తుంటే వాళ్లావిడ ఛాయాదేవి “నోర్మూసుకోండం”టూ బుగ్గమీద పొడుస్తోంది..!
**
ఆ పక్క మంచం మీద మురళీమోహన్ పడుకుని ఉన్నాడు.
అతను నీట్ గా గెడ్డం గీసేసుకుని కాటుక మీసాలెట్టుకుని లిప్ స్టిక్ వేసుకున్నాడు. నొక్కులనొక్కుల విగ్గు పెట్టుకున్నాడు. లావుపాటి ఫ్రేము కళ్లద్దాలు పెట్టుకున్నాడు. ఆకుపచ్చ ప్యాంటు మీద ముదురొంకాయ రంగు చొక్కా వేసుకుని, ఇన్ షర్ట్ చేసుకుని, వడలిపోయిన ముదురు బెండకాయలా నిస్తేజంగా పడి ఉన్నాడు.
ఒక చేతికి సూది గుచ్చి రక్తం; మరో చేతికి ఇంకో సూది గుచ్చి సెలైనూ ఏకకాలంలో ఎక్కిస్తున్నారు. పక్కన పండరీబాయి కళ్లొత్తుకుంటూ పేద్ధగ్లాసులోకి నారింజ రసం తీస్తోంది. అతని మంచం చుట్టూ శ్రీహరికోట స్పేస్ సెంటర్లో ఉన్నన్ని మెషీన్లున్నాయి.
తను రాత్రి మూడులీటర్ల ఎండ్రిన్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. అతన్ని నాగేశ్వర్రావూ, శ్రీదేవీ వేంఠనే ఆసుపత్రిలో చేర్చి ప్రాణాపాయం లేదని తెలిసాక చెరో గాగుల్సెట్టుకుని “నా కళ్లు చెబుతున్నాయీ నిను ప్రేమించాననీ..” అని పాడుకోడానికి అన్నపూర్ణా సెవెన్ ఎకర్స్ కి వెళ్లారు.
విషయం తెలిసిన మోహన్ బాబు షిరిడీ సాయినాధునికి తీరుబడిగా కాకడా హారతులిచ్చి, ప్రసాదం తీసుకున్నాక హడావుడిగా వచ్చాడు. తను బాటా చెప్పులూ, టెరికాటన్
ప్యాంటు, పొట్టిచేతుల లాల్చీ వేసుకున్నాడు. తనది కూడా
నొక్కులనొక్కుల విగ్గు జుట్టే…!
“ప్రకాష్…! ఎందుకురా ఇంత పని చేశావ్…?” అంటూ గద్గద స్వరంతో గ్లిజరిన్ కళ్లతో బేస్ వాయిస్ లో మురళీమోహన్‌ని చూస్తూనే అడిగాడు మోహన్ బాబు.
పక్కనున్న పండరీబాయి పని మాని కళ్లొత్తుకుంది.
పక్క మంచం పేషెంట్ అల్లు రామలింగయ్య ఏడుపాపి వీళ్లకేసి ఉత్సుకతతో చూశాడు.
“రమేష్…! దేవి రాజేష్ ని పెళ్లిచేసుకుంటోందిరా..!” కొంచెం వణుకుతున్న గొంతుకతో చెప్పాడు మురళీమోహన్.
మోహన్ బాబు కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
“నేను దేవికి చెప్పాను రా…! ఆ రాజేష్ ఎంత తాగుబోతో, ఎంత తిరుగుబోతో చెప్పాను. అది నా మాట వినడం లేదు.పైగా “మోహన్ బాబు నాగేశ్వర్రావుని తక్కువ చేసి మాట్లాడితే, ఎవరూ నమ్మరు. ఆయన గనుక కౌంటరిస్తే ఫ్యూచర్లో వైరలవుతుంది..!” అంటూ తీసి పారేసింది అంటూ నిర్వేదపడ్డాడు మోహన్ బాబు.
పండరీబాయి నోట్లో సగానికి పైగా చీరని కుక్కేసుకుని ఊపిరందక అవస్త పడుతూ మౌనంగా ఏడవసాగింది.
“రమేష్…! దేవి రాజేష్ ని పెళ్లిచేసుకుంటోంది. అంటే దేవికి రాజేష్ తో పెళ్లికి ఒప్పుకున్నట్టే కదరా..!” ఇంకొంచెం వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
“అవున్నిజమేరా..!” అన్నాడు మోహన్ బాబు.
“రమేష్…! దేవి రాజేష్ తో పెళ్లికి ఒప్పుకుంది అంటే దేవికి రాజేష్ అంటే ప్రేమున్నట్టే కదరా..!” మరికొంచెం వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
“అవును యధార్థమేరా..!” అన్నాడు మోహన్ బాబు.
“రమేష్…! దేవికి రాజేష్ అంటే ప్రేముందీ అంటే దేవికి రాజేష్‌మీద ఇష్టమున్నట్టే కదరా..!” మరికొంచెం వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
“అవును వాస్తవమేరా..!” అన్నాడు మోహన్ బాబు.
“రమేష్…! దేవికి రాజేష్‌మీద ఇష్టముందీ అంటే నా మీద ఇష్టం లేనట్టే కదరా..!” మరికొంచెం వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
అల్లు రామలింగయ్యని పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ వీళ్ల మాటలువింటూ ఛాయాదేవి జబ్బ పట్టుకుని పరీక్షించబోయాడు. ఆమె డాక్టర్ గూబ పగలేసింది. అల్లు కోతిలా నవ్వి వెంటనే అబ్బా అంటూ బాధపడ్డాడు.
మోహన్ బాబు కళ్లద్దాలు తీసి జుబ్బాతో తుడుచుకుని మళ్లీ పెట్టుకున్నాడు.
“రమేష్…! దేవికి నా మీద ఇష్టం లేదంటే, నామీద ప్రేమలేనట్టే కదరా..!” మరికొంచెం వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
“అవును సత్యమేరా..!” అన్నాడు మోహన్ బాబు.
ఇంతలో పద్మనాభం, పొట్టి చలం, పొడుగు చలం, పలకరించడానికి కాలేజీ నుండి వచ్చారు. వాళ్లందరికీ నల్లకళ్లద్దాలున్నాయి. చేతుల్లో రంగురంగుల డైరీలున్నాయి. ఎవ్వడూ ఓ పండో బ్రెడ్డో తేలేదు. పైగా నర్సుల్ని ఆబగా చూడడం మొదలెట్టారు.
“రమేష్…! దేవికి నా మీద ప్రేమ లేదంటే, నాతో పెళ్లికి ఒప్పుకోదు కదరా..!” మరికొంచెం వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
పండరీబాయి భోరుమంది.
“అవును ఫ్యాక్టేరా…!” అన్నాడు మోహన్ బాబు.
“రమేష్…! దేవి నాతో పెళ్లికి ఒప్పుకోలేదంటే, దేవి నన్ను పెళ్లి చేసుకోదు కదరా..!” మరికొంచెం వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
“నన్నూ జయసుధ చేసుకోనందిరా…! ఐతే చచ్చిపోతామా…? ఆ షిరిడీ సాయినాధుని దయవల్ల నాకు కవిత దొరికింది. హ్యాపీగా డింగోడింగుడింగంటూ స్కూలు పెట్టి బతికేస్తున్నాను..!” అన్నాడు మోహన్ బాబు.
“రమేష్…! దేవి నన్ను పెళ్లి చేసుకోకపోతే, నేను బతికేంచేయాల్రా..!” నిస్తేజంగా వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురళీమోహన్.
అంతలో చీఫ్ డాక్టర్ ముక్కామల ముక్కు తుడుచుకుంటూ వచ్చాడు. కళ్లద్దాలు సర్దుకుని ఓసారి మురళీమోహన్ పల్సు చూశాడు. సెలైన్ ఫ్లో కొంచెం స్లో చేశాడు.
“ఏం ఖంగార్లేదు. అంతా సర్దుకుంటుంది…!” అన్నాడు ముక్కామల.
“నన్నెందుకు బతికించారు డాక్టర్…?” ఫ్రస్ట్రేషన్ తో అడిగాడు మురళీమోహన్.
పండరీబాయి పూర్తి చీర మింగేసింది.
“నేం ఫర్వాలేదని చెబుతోంది నీ ఆరోగ్యం గురించి కాదు. నీ పెళ్లి గురించే…!” అన్నాడు ముక్కామల.
మోహన్ బాబు కళ్లద్దాలు తీసి ఆశ్చర్యంగా చూశాడు. మురళీమోహన్ హాస్పిటల్ స్లాబులోంచి శూన్యంలోకి చూశాడు.
“నిన్న నాగేశ్వర్రావు పళ్లు తోముకుంటున్నప్పుడు వాష్ బేసిన్లో రక్తం కక్కాడయ్యా…! తనకి తెలియకుండా వాళ్ల నాన్న ప్రభాకర్ రెడ్డి ఆ బ్లడ్డిక్కడ టెస్టు చేయించాడు. ఆయనకి బ్లడ్ క్యాన్సరు. తను శ్రీదేవితో వెళ్లింది సెవెనెకర్స్ లో డ్యూయెట్ కోసం కాదు. ఫ్యాబిండియాలో శాలువా కొనుక్కోడానికి..! తను పోయాక శ్రీదేవి నిన్నే చేసుకుంటుంది. కంగారు పడకు..!” అన్నాడు ముక్కామల.
మోహన్‌బాబు కళ్లు ఆనందంతో మెరిసాయి.
మురళీమోహన్ నారింజ రసం తాగేశాడు. “హమ్మయ్య.., నేను రియలెస్టేటు చేసుకుని, సంపాదించేసి, శ్రీదేవిని సంతోషపెట్టి, సుఖపెట్టి, సౌకర్యాలిచ్చి, ఆనందపరిచి, తృప్తినిస్తాను..!” అనుకున్నాడు.
పండరీబాయి ఆనందభాష్పాలను వత్తేసుకుని చీర సరిగ్గా కట్టుకుంది.
అక్కడ నాగేశ్వర్రావు స్టెప్పులేస్తూ, వేస్తూ హఠాత్తుగా దగ్గడం మొదలెట్టాడు.
జయసుధ జడేసుకుంటూ ఎంట్రీ ఇచ్చింది.
దా…. #సరిలేరునీకెవ్వరూ
Share this Article