Gurram Seetaramulu…. తాతల నాటి తాలిపేరు నిలబడ్డది, మరి మన నయా మేడిగడ్డకు ఏమైంది ?
ఒక చిన్న గుడిసె కట్టుకున్నా సాయిల్ టెస్ట్ పునాది ఎంత ఉండాలి, పిల్లర్ ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఇంచుల స్లాబ్ ఉండాలి ? ఎంత స్టీల్ వాడాలి, వాటి నాణ్యత కోసం తపన ఉంటది. ఉండే ఇల్లు అయినా కట్టుకున్న ఇల్లు అయినా ఒక నమ్మకం, బాధ్యత గల మేస్త్రి చేతిలో పెడతాము. రెండు వందల ఏళ్ళ కింద కాటన్ అనే పరదేశీ ఇంజనీర్ పడావు బడ్డ భూముల్లో నీళ్ళు ఉంటే పంటలు బాగా పండి శిస్తు వసూలు ఎక్కువ చేయ వచ్చు అని బ్రిటిష్ వాళ్ళను ఒప్పించి మరీ చరిత్రలో నిలబడి పోయే కట్టడాన్ని నిర్మించాడు. అది ఒక బాధ్యతతో చేసిన పని.
ఆయన ధవళేశ్వరం కట్టే కాలంలో గోదావరి పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసే దాకా ఇంచు ఇంచు లెక్కలు కొలతలు వేశాడు. నది సముద్రంలో కలిసే చోట వంపులు తిరిగే చోట నీటి వడి ఎక్కువ ఉంటది.. అది సాధారణ సూత్రం. కాటన్ మొదట పోలవరం దగ్గర ఆనకట్ట కడదాం అనుకున్నాడట, నీళ్ల వడి ఎక్కువ అని ఆయన ఆనకట్ట విరమించుకుని ధవళేశ్వరం పాయింట్ చివరిగా ఎంచుకున్నాడు. మన చంద్రాలు జగనాలు లక్షలాది మందిని నిర్వాహసితులను చేసి వేల కోట్లు పెట్టి పోలవరం కడుతున్నారు, అది సేఫ్ కాదని ప్రపంచ జలవనరుల నిపుణులు తేల్చేశారు కూడా. ఏదో ఒకరోజు అది చేయబోయే నష్టం ఊహకే కష్టంగా ఉంది.
Ads
కనీసం వాగులో చేపలు పట్టేవాడు కూడా ఎక్కడ కట్ట వేయాలి, నీళ్లు ఎలా గుప్పాలో ఆలోచన చేస్తాడు. చిన్నప్పుడు నేను వాగుల్లో చేపలు పట్టేవాన్ని.
ఇక మన జాతిపిత లక్ష కోట్లు పెట్టి హడావుడి గా గోదారమ్మకు నడకలు నేర్పా అంటున్నాడు. మొన్న వరదలు గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చాయి, ఐనా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన తాలిపేరు కట్ట మునిగినా తట్టుకుని నిలబడ్డది.
మహేంజదారో మట్టిమనుషుల స్వేదంతో నిర్మించిన పురాతన జ్ఞాపకం. నది నాగరికత వికాసానికి మూలం. ఏ నది జీవం పోసిందో అదే నది తూడ్చిపెట్టిన పురా జ్ఞాపకం మహేంజదారో. మీకు తెలుసో లేదో మహేంజదారో నాగరికత తూడ్చి పెట్టక పోవడానికి కారణం అవగాహన లేకుండా నదికి ఆనకట్ట కట్టడం అని చరిత్ర నిరూపించింది. అది నీళ్లకు ఉన్న శక్తి. వానలు వరదలు లేని టైంలో ఆనకట్ట రెండు అడుగులు కుంగడం అంటే ప్రమాద తీవ్రత ఎక్కువనే .
చూడాలి మన జోకుడు ఇంజనీర్లు ఆనకట్ట కింద ఫిల్లింగ్ చేసి నిలబెడతాం అంటారేమో . ఎవరో అంటున్నారు
3 బ్యారేజీలు
15 రిజర్వాయర్లు
19 సబ్ స్టేషన్లు
21 పంప్ హౌజులు
203 కిలోమీటర్ల సొరంగాలు
1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్
98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ
530 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం
240 టిఎంసీల ఉపయోగం…
నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే పైన పేర్కొన్న అన్ని నిర్మాణాలకు మూలం ప్రధాన కట్టడం మేడిగడ్డ. దాని ద్వారానే మిగతా అన్ని దారులకు నీళ్ళు వెళ్ళాలి. అంటే మొత్తం ప్రాజెక్ట్ లో వెన్నెముక మేడిగడ్డ. అంత పెద్ద పిల్లర్లు నిట్ట నిలువుగా చీలిపోయాయి.
ఇదీ మన సన్నాసితనం, ఎన్ను పూస విరిగాక మిగతావి ఉంటె ఏమిటి లేకుంటే ఏమిటి ? ఈ ఘోర నిర్వాకాలకు జాతికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, ముక్కు నేలకు రాయాల్సింది పోయి… నన్నడిగితే సలహాలు ఇస్తా, అధికారం ఇస్తే రిపేర్ చేసి చూపిస్తా వంటి ఉల్టా మాటలు… ఈ ధోరణికి తెలుగులో సరైన పదం లేదు… 80 వేల పుస్తకాల్లోనూ కనిపించని పదం అది…
Share this Article