తండ్రీకొడుకులిద్దరూ భలే యాక్టర్స్… మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి… ఇద్దరూ ఏక్‌సేఏక్ నటించగలరు… సీఎంగా ఉన్నప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ అప్పుడప్పుడూ కన్నీళ్లు పెట్టుకునేవాడు కుమారస్వామి… అనవసరంగా బీజేపీని విడిచిపెట్టి తప్పు చేశాను, లేకపోతే నేనే మళ్లీ సీఎం అయ్యేవాడిని అంటూ ఆమధ్య కూడా బోరుమన్నాడు కూడా..! ఇప్పుడు తాజాగా ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు దేవెగౌడ… 87 సంవత్సరాల ఈ వయస్సులో కూడా తన జేడీఎస్ పార్టీ వ్యవహారాల్ని తనే స్వయంగా చూసుకుంటాడు… త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో మేం పోటీచేయబోవడం లేదు అని ప్రకటించాడు… దానికి తను చెప్పిన కారణమే ఓ విశేషం… ‘ఈ ఉపఎన్నికల్లో పోటీచేయడానికి తగిన డబ్బు మాదగ్గర లేదు, 2023 ఎన్నికల కోసం ఎలాగోలా రెడీ అవుతాం, కానీ ఇప్పుడు మాత్రం మా గల్లాపెట్టె ఖాళీ’ అంటున్నాడు తను…
బెల్గాం లోకసభ స్థానంతోపాటు బసవకల్యాణ్, సిందగి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది… బెల్గాం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సురేష్ అంగడీ, బసవకళ్యాణ్ ఎమ్మెల్యే బి నారాయణ రావు పోయిన ఏడాది సెప్టెంబర్‌లో కోవిడ్ కారణంగా మరణించారు… మస్కి ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లడంతో అనర్హతకు గురయ్యాడు… సిందగి ఎమ్మెల్యే, జేడీఎస్ సీనియర్ నేత మనగులి అనారోగ్య సమస్యలతో ఈమధ్యే మరణించాడు… ఎలాగూ నాలుగైదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించబోతోంది కదా, ఈ స్థానాలకూ ఉపఎన్నికలను ప్రకటిస్తుంది… కర్నాటకలో అన్ని ప్రాంతాల్లోనూ బలం లేకపోయినా సరే, కొన్ని ఏరియాల్లో జేడీఎస్ ప్రధాన పార్టీ… అలాంటి పార్టీ డబ్బు లేదంటూ ఎన్నికలకు దూరంగా ఉంటామనడమే ఓ వార్త…
Ads
అసలు పోయిన ఎన్నికల్లోనే దేవెగౌడకు కేసీయార్, చంద్రబాబు కొంత ఆర్థికసాయం చేశారనే ప్రచారం ఉన్నదే… ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, అవసరమైతే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే చాన్స్ దొరికితే, దేవెగౌడ పార్టీ కూడా తనతో కలిసి వస్తుందిలే అనేది కేసీయార్ ఆలోచన కావచ్చు… ఇక మొన్నటి ఎన్నికల ముందు చంద్రబాబు ఓ యాంటీ-మోడీ బ్యానర్ కింద బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకం చేసిన సంగతి తెలుసు కదా… కాంగ్రెస్‌తోపాటు జేడీఎస్‌కు కూడా కొంత డబ్బుసాయం చేశాడనే ప్రచారం ఉంది… మొన్నటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి డబ్బు తీసుకుని బీజేపీకి వర్క్ చేసినట్టు మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించినట్టు వార్తలొచ్చాయి… మరి ఇప్పుడూ, ఈ ఉపఎన్నికలకూ ఎవరొచ్చి సాయం చేయాలి..? అసలు ఇంతకీ వాళ్లు సంపాదించిన డబ్బంతా ఏమైంది..? వన్ ప్లస్ త్రీ ఉపఎన్నికల్ని ఎదుర్కునే ఆర్థిక సత్తా లేదా..? ఎహె, అది కాదు, అసలు కారణం వేరే ఉంటుంది, ఈ కన్నడ భీష్ముడు బయటికి చెప్పే కారణాలు వేరు, ఇంతకీ ఆ కారణాలేమై ఉంటాయబ్బా అనే ఊహాగానాలు అప్పుడే స్టార్టయ్యాయి… డబ్బుతో లింక్ లేకుండా ఏదీ నడవదు… ఈ పోటీ తిరస్కరణకూ అలాంటి కారణాలేమైనా ఉన్నాయా..?! జేడీఎస్ సత్తా చూపే సీట్లయితే, ఉల్టా డబ్బులిచ్చి టికెట్లు తీసుకునే ఔత్సాహికులు కూడా దొరుకుతారు కదా… రాజకీయాల్లో సహజమే కదా… మరి ఇదేమిటి ఇలా..?!
Share this Article