Jagan Rao…. హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 సందర్భంగా – నాకు నచ్చిన భారతీయ కవయిత్రి అమ్రుతా ప్రీతం గురించి..!
అమ్రుతా ప్రీతం రాసిన “స్టెంచ్ ఆఫ్ కిరోసిన్” అనే ఇంగ్లీష్ నాన్ డిటెయిల్ పాఠం (కిరోసిన్ వాసన) ఎవరికైనా గుర్తు ఉందా..? చంబ అనే ఊర్లో ఒక తల్లితండ్రుల గారాలపట్టి గుళేరి. వయస్సు వచ్చిన గుళేరికి మానక్ అనే వ్యక్తితో వివాహం జరిపిస్తారు. 7 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టరు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుళేరిని తల్లిదండ్రులని చూడటానికి పంపిస్తుంటారు మానక్ తల్లి.
దసరా పండగకి సంతోషంగా తల్లిదండ్రులని చూడటానికి వెళ్తుంది గుళేరి. ఆ సమయంలో మానక్ కి ఇష్టం లేకపోయినా రెండో పెండ్లి చేస్తుంది మానక్ తల్లి. ఈ విషయం తెలుసుకున్న గుళేరి కిరోసిన్ పొసుకొని నిప్పు అంటించుకొని చనిపోతుంది.
కొన్ని రోజులకి మానక్ రెండో భార్యకి పిలగాడు పుడతాడు. ఈ పిలగాడిని మానక్ కి చూపిస్తే “కిరోసిన్ వాసన వస్తుంది”, “కిరోసిన్ వాసన వస్తుంది దూరంగా తీసుకుపోండి” అని అరుస్తాడు.
మా స్కూల్ టైములో 10 వ తరగతి ఇంగ్లీష్ లో ఖచ్చితంగా “స్టెంచ్ ఆఫ్ కిరోసిన్” గానీ “గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్” అనే లియో టాల్ స్టాయ్ రాసింది కానీ వచ్చేది.
అమ్రుతా ప్రీతం పంజాబీ భాషలో మొదటి కవయిత్రి కమ్ నవలా రచయిత్రి, వ్యాసకర్త. ఆమె రాసిన సనెహాడ్ (సందేశాలు) అనే కవితకి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. అసలు భారతదేశంలో మొదటి సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మహిళ కూడా అమ్రుతా ప్రీతం గారే.
“కాగజ్ తె కాన్వాస్” రచనకు గాను అత్యున్నత భారతీయ జ్ఞానపీఠ్ అవార్డ్ కూడా వచ్చింది. 1969 లో పద్మశ్రీ వచ్చింది, 2004 లో పద్మవిభూషణ్ వచ్చింది. “ఇమ్మోర్టల్స్ ఆఫ్ లిటరేచర్” కి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ కూడా వచ్చింది, ఇది పొందిన మొదటి మహిళ కూడా నాకు తెలిసి అమ్రుతా ప్రీతం గారే. పంజాబ్ రత్న అందుకున్న మొదటి వ్యక్తీ అమ్రుతా ప్రీతం గారే. ఢిల్లీ యూనివర్శిటీతో సహా చాలా యూనివర్శిటీలు అమ్రుతా ప్రీతం గారిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి.
1919 ఆగష్ట్ 31 న జన్మించిన అమ్రుతా ప్రీతం గారు దేశ విభజన జరిగినప్పుడు జరిగిన అల్లర్లు, ఊచకోత గురించి కూడా చాలా రాశారు. అమ్రుతా ప్రీతం గారు దాదాపు 100 పుస్తకాలని రాశారు. 1950 లో అమ్రుతా ప్రీతం గారు పింజర్ (బోను) అనే నవలలో చిరస్మరణీయమైన తనకిష్టమైన ఫ్యూరో పాత్రని స్రుష్టించారు.
2003 లో ఆ నవల ఆధారంగా తీసిన పింజర్ సినెమా కూడా అవార్డ్ లని గెలుచుకుంది. స్త్రీల మీద జరిగిన జరుగుతున్న హింస గురించి ఎందరో రాశారు. అమ్రుతా ప్రీతం గారి రచనల్లో స్త్రీత్వానికి జరిగిన నష్టం గురించి ఉంటుంది. సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు అమ్రుతా ప్రీతంని 20 వ శతాబ్ధపు భారతీయ ప్రముఖ కవయిత్రి అంటారు. కానీ అయాన్ రాండ్, వర్జీనియా ఉల్ఫ్, అగతా క్రిస్టీ లాంటి వారి రచనలు అన్నీ కలిపినా అమ్రుతా ప్రీతం రాసిన స్టెంచ్ ఆఫ్ కిరోసిన్ ముందు దిగదుడుపే అంటాను నేను… చలం మైదానం, అమ్రుతా ప్రీతం పంజరం (పింజర్) నవలలు తెలుగు నవలా చరిత్రలో చిరస్మరణీయమైనవి… (ఇది రచయిత పూర్తి వ్యక్తిగత అభిప్రాయం…)
Share this Article