చిలకమర్తి ఎక్కడో రాసినట్టు గుర్తు… కొన్ని వందల కణితులను తొలగించిన ఓ వైద్యుడికే ఓ కణితి మొలిచింది… ఇంకెవరో డాక్టర్ వచ్చాడు, తీశాడు… అప్పుడన్నాడట, కణితి తీసేటప్పుడు ఇంత నొప్పి ఉంటుందా అని..!
మొన్న రేవంత్ రెడ్డి రండ అనే పదాన్ని వాడటం దుర్మార్గం, సంస్కారరాహిత్యం అని నానా విమర్శలూ చేశారు, రచ్చ చేశారు కదా… అవును, అదే మాటను అదే కేసీయార్ ఓ కేంద్ర మంత్రిని ఉద్దేశించి వాడలేదా..? ఆ పదంతో నొప్పి ఇంతగా ఉంటుందని తనకు ఇప్పుడే కదా అర్థమైంది…
ఆ పదం వాడటం తప్పకుండా అభ్యంతరకరమే… కానీ తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి భాష, తిట్ల ప్రయోగాలకు ఆద్యుడు ఎవరు..? పీకడానికి, తోకమట్ట, బొందలగడ్డ, సన్నాసి వంటి పదాల్ని అలవోకగా వల్లెవేసింది ఎవరు..? హేమిటయ్యా ఈ భాష, ఆయనేదో అలా మాట్లాడితే నువ్వు కూడా అది కొనసాగించాలా అని రేవంత్ రెడ్డిని అడిగి చూడండి, అదే భాషలో బదులిస్తే తప్ప ఆయనకు అర్థం కాదు అంటాడు గడుసుగా… రాజకీయాల్లో ఎవరు తక్కువ మరి…
Ads
సరే, ఏదో సంస్కారం, హుందాతనం వంటి పదాలు చర్చకు వస్తున్నాయి కదా… రెండు అంశాలు బాగనిపించాయి… గవర్నర్ తమిళిసైని బీఆర్ఎస్ బ్యాచ్ వెకిలి వ్యాఖ్యలతో నానారకాలుగా అవమానించింది కదా… బహుశా ఒక పార్టీ ఒక లేడీ గవర్నర్‌ను ఇన్నిరకాలుగా అవమానించడం దేశచరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు… కానీ ఆమె ఏం చేసింది..? ఇదే కేసీయార్‌కు జన్మదిన శుభాకాంక్షల్ని పంపించింది… అదీ ఏదో ప్రెస్‌నోట్ పంపించడం కాదు, గవర్నర్ కార్యాలయం నుంచి ఓ ప్రతినిధి వెళ్లి మరీ తెలంగాణ భవన్‌లో అందచేశాడని వార్త… గుడ్…
గట్టిగా తిట్టడంలో దూకుడుగా ఉన్న రేవంత్ సైతం కేసీయార్‌కు జన్మదిన శుభాకాంక్షల్ని సభలోనే తెలిపాడు… తన మీద పెట్టిన కేసులు, వాడిన తిట్లు, వేధింపులు మనసులో అలాగే ఉండి ఉంటాయి, కానీ రండ అనే పదం వాడినందుకు ఇలా సంస్కారయుత విరుగుడు ప్రయోగించాడు… కేసీయార్ నుంచి ఈ ధోరణి ఎన్నడూ చూడలేదు… అఫ్ కోర్స్, ప్రతిపక్ష నేతగా వ్యవహరించు అని ఓ మెలిక చురక కూడా ఉంది రేవంత్ శుభాకాంక్షల్లో… అది వేరే సంగతి…
రాజకీయాల్లో సంస్కారం అంటుంటే నిజంగానే ఓ విషయం గుర్తొస్తుంది… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును ఆమోదిస్తున్నాను అని ఈరోజుకూ ఒక్క మాట కేసీయార్ నోటి వెంట వెలువడిందా..? తను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఓ కాగితాన్ని రాజ్‌భవన్ మొహాన పడేశాడు తప్ప ఆమెను కలిసి సమర్పించాడా..? ప్రజలు గెలిపించిన పార్టీకి అభినందనలు చెప్పాడా..? ముఖ్యమంత్రికి కనీసం మర్యాద కోసమైనా శుభాకాంక్షలు చెప్పాడా..?
ఈరోజుకూ ‘రెట్టింపు వేగంతో వస్తా’ అంటాడు తప్ప, బరాబర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్తా అని మాత్రం అనడు… నువ్వు వద్దు మహాప్రభో అని తెలంగాణ ప్రజలు అంత ఖండితంగా చెప్పాక కూడా… ఇంకా వదిలేదు లేదన్నట్టు మాట్లాడితే ఎట్లా సారూ… ఇదే సందర్భంగా ఇంకొక విషయం…
ఎదుటి పార్టీల ప్రజాప్రతినిధులను మందలుమందలుగా చేర్చుకున్న కేసీయార్‌కు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లుతున్న తన పార్టీ నేతలను ఒక్క మాట కూడా అనడం లేదు… తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడినవాళ్లను సైతం నెత్తిన మోసిన కేసీయార్‌కు తత్వం బోధపడిన ఓ నిశ్చేష్టత… అఫ్ కోర్స్, తనకు తెలియదని కాదు… అబ్బే, ఈ చేరికలన్నీ రాజకీయ శక్తుల పునరేకీకరణ అంటూ అప్పట్లో ఓ వింత సూత్రీకరణకు పాల్పడిన తనకు ఎవరినీ ఏమీ అనే నైతికార్హత కూడా లేకుండా పోయింది… సర్లెండి, ఇవన్నీ చెప్పుకునేకొద్దీ ఒడవవు, తెగవు…
తన అధికార సుస్థిరత కోసం కేసీయార్ వేసిన ట్రాపులో కాంగ్రెస్, ఇతర పార్టీలు పడిపోయాయి… ఒక రాజకీయ నాయకుడిగా అందులో కేసీయార్‌ను తప్పుపట్టలేమేమో… కానీ ఏ అధికారం యావతో తను ఇతర పార్టీల నేతల్ని లాగేసుకున్నాడో, ఇప్పుడు అదే అధికారం యావతో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ నేతలు గాంధీభవన్ దగ్గర క్యూలు కట్టారు…
అధికారాంతమున చూడవలె అయ్యగారి ప్రభ అన్నట్టు… కేసీయార్ జన్మదినాన్ని ఒక దశలో ధూంధాంగా నిర్వహించిన హైదరాబాద్ ‘పాత సమైక్య నేతలు’… కేసీయార్ నెత్తిన పెట్టుకున్న నేతలు… ఇప్పుడు మొహాలు కూడా చాటేస్తున్నారు… ఎస్, పాలిటిక్సులో విధేయత, నైతికత అధికారానికి లింకై ఉంటుంది ఎప్పుడూ… అఫ్‌కోర్స్, రాజకీయాలు అంటేనే అలా ఉంటాయి కదా…!
Share this Article