ఒక వార్త… గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ కీడాకోలా అనే సినిమా నిర్మాతకు నోటీసులు పంపించాడు… ఎందుకయ్యా అంటే..? తండ్రి గొంతును కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) ఒక పాటకు వాడుకున్నందుకు..!
గుడ్… సరైన చర్య అనిపించింది స్థూలంగా చదవగానే… కానీ అదే వార్తలో చివరలో ఓ ట్విస్టు నచ్చలేదు… తండ్రి గొంతును ఈ కొత్త టెక్నాలజీతో వాడుకున్నందుకు కాదట, తన నోటీసులు ఎందుకంటే, తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకట… అక్కడ చరణ్ ఆలోచనాధోరణి నచ్చలేదు…
ఒక కోణం చూద్దాం… బాలు ఆస్తులకు చరణ్ వారసుడు కావచ్చుగాక, కానీ బాలు గొంతుకు కాదు, తన గాన మాధుర్యానికి కాదు… ఒక్క ముక్కలో చెప్పాలంటే బాలు గొంతు ప్రజలది… ఆ గొంతును వాడుకుంటే చరణ్‌కు అభ్యంతరం ఉండకూడదు, మళ్లీ దానిపై పేటెంట్స్, రైట్స్, అగ్రిమెంట్స్, డబ్బులు, రాయల్టీలు అనే ప్రస్తావనే రావొద్దు… కేవలం వాటి కోసమే చరణ్ అభ్యంతరం చెప్పడమే అభ్యంతరకరం… అదెలా అంటే..?
Ads
బాలు గొంతు యూనిక్… ఏ ఉద్వేగానికైనా సూటయ్యేది, మధురమైనది, కొన్ని వేల పాటలతో అది జాతీయం అయిపోయినట్టే… ఇక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తిరిగి తిరిగి ఆ గొంతును వాడుకోవాలనే ఆలోచనే కరెక్టు కాదనేది ఇక్కడ పాయింట్… వింటేజ్ ఈజ్ వింటేజ్… దానికి డూప్లికేట్స్ వద్దు… మొన్నామధ్య ఏఆర్ రెహమాన్ కూడా బాలు గొంతును ఏదో పాటకు వాడుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఓ వార్త చదివినట్టు గుర్తు…
ఇక్కడ ఓ ప్రశ్న… బాలు గొంతు, బాలు పాట ఎందుకు పాపులరైంది..? ఏ నటుడికి ఎలా పాడాలో తనకు బాగా తెలుసు కాబట్టి… అది ప్రజలకు నచ్చింది కాబట్టి, అందులో వైవిధ్యం కనిపించింది కాబట్టి…! గొంతు ఫిజికల్ కేరక్టర్, కానీ పాడే తీరు తన బ్రెయిన్, ఒక ఆర్ట్… ఇప్పుడు గొంతును వాడుకోవడం, దాన్ని ప్రజెంట్ సంగీత దర్శకులు తమ ఇష్టానుసారం పాడించడం ఒకరకంగా బాలు లెగసీని, విశిష్టతను పొల్యూట్ చేయడమే అవుతుంది… ఆ ఆర్ట్‌కు అనుకరణ అవుతుంది, తనది కాని సృష్టి, అంటే ఒకరకంగా తనను అవమానించడమే… మరి దీనికి చరణ్ ఎందుకు అంగీకరిస్తున్నట్టు..?
ఏ గొంతైనా సరే కొన్నాళ్లు వినీ వినీ మొనాటనీ వస్తుంది… కానీ బాలు కొన్ని దశాబ్దాలపాటు అనేక భాషల్లో పాడీ పాడీ పరవశింపచేశాడు, ఐనాసరే ఒక దశ వచ్చేసరికి ఇక వైవిధ్యాన్ని కోరుకునే సంగీతదర్శకులు తనను పిలవడం మానేశారు… ఈటీవీ ప్రోగ్రామ్స్ లేకపోతే తన పేరు ఇన్నాళ్లు వినిపించేది కూడా కాదు… మరి కొత్త నీరు వస్తున్నప్పుడు, రావల్సి ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఆ పాత బాలు గొంతే మళ్లీ మళ్లీ వినిపించడం దేనికి..?
రేప్పొద్దున పాత యంగ్ ఎన్టీయార్, యమగోల నాటి జయప్రద, పదహారేళ్ల వయస్సు నాటి శ్రీదేవిలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో పునఃసృష్టి చేసి, ఓ సినిమా నిర్మించేసి, అందులో నాటి ఎస్వీఆర్‌ను కూడా పెట్టేస్తే… వోకేనా..? (ఆల్ రెడీ ఇంగ్లిషులో ఒరిజినల్ నటులను పోలే గ్రాఫిక్ నటులతో సినిమాలు తీశారు, కానీ ఒరిజినల్ ఒరిజినలే, అందుకే ప్రేక్షకులు వాటిని తిరస్కరించారు…)
సో, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కొత్త కొత్త టెక్నాలజీలకు కూడా పరిమితులు ఉంటాయి, ఉండాలి, ఉంచాలి… కొన్ని వింటేజ్ అంశాలు మెమొరీస్, అంతే… అనుకరించి, అలాగే పునఃసృజించి, కొనసాగించి, కృతక ప్రయోగాలు చేసి వాటిని చెడగొట్టకూడదు… చరణ్‌కు ఇది అర్థమవుతుందని కూడా నేను అనుకోవడం లేదు..! లెగసీ కంటిన్యూ చేయడం అంటే పాడతా తీయగా ప్రోగ్రాం కంటిన్యూ చేసినట్టు కాదు చరణ్..!!
Share this Article