పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించాడు… నాటో సహకారంతో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది… ఈజీ అనుకున్న ఆక్రమణ కాస్తా రష్యన్లకు అసాధ్యం అయిపోతోంది… ఇదింకా కొనసాగుతూనే ఉంది… ఈ యుద్దంలో ఫ్రంట్ లైన్‌లో 2022 నవంబరులో మరణించిన ఓ జవాను పేరు విటాలీ… తను యుద్ద ప్రారంభానికి కొన్నాళ్ల ముందే ఆర్మీలో జాయినయ్యాడు…
ఆయన భార్య పేరు నటాలియా… భర్త మరణించినప్పుడు ఆమె 13 వారాల గర్భిణి… కానీ అది నిలవలేదు… ఆమె ఏం చేసింది..? భద్రపరిచిన భర్త వీర్యంతో మళ్లీ కృత్రిమ గర్భధారణ ప్రయత్నించింది… ఓ బిడ్డ పుట్టింది… ఆ బిడ్డను భర్త ఫోటోకు చూపిస్తూ కన్నీటి పర్యంతమైంది… అదే ఈ ఫోటో… ఈ ఉద్వేగం స్థాయిని వర్ణించగలమా..?
ఆమె ఏమంటోందంటే..? ‘నా బిడ్డ నాకు సర్వస్వం ఇప్పుడు… నా బిడ్డ బాగోగులు చూసుకుంటున్నానంటే నా భర్త బాగోగులు చూసుకోవడానికి కొనసాగింపు… ఈ కొనసాగింపు మా బంధం కొనసాగింపు… ఒకేసారి నాకు జీవితాంతం తోడు ఉంటాడనుకున్న భర్త, కడుపులో పెరిగే బిడ్డ ఇద్దరినీ కోల్పోయాను… కానీ తన జ్ఞాపకాల్ని కొనసాగిస్తాను..
Ads
’నిజానికి భర్త లిఖిత పూర్వక అనుమతి లేకుండా తన వీర్యాన్ని ఎవరూ వాడటానికి వీల్లేదు, ఆమె కూడా… కానీ ఉక్రెయిన్ పార్లమెంటు ఓ చట్టం తెచ్చింది… దాని ప్రకారం యుద్ధంలో మరణించిన జవాన్ల వీర్యాన్ని లేదా అండాలను వాళ్ల భార్యలు లేదా భర్తలు తమకు పిల్లలు పుట్టుకోవడానికి వాడుకోవచ్చు…
అంతేకాదు, యుద్ధంలో గాయపడిన జవాన్లు కూడా తమ అండాల్ని, వీర్యాన్ని ఫలదీకరించుకోవడానికి ఆ చట్టం అవకాశం కల్పిస్తుంది… ఇలా జవాన్లు తమ వీర్యం లేదా అండాల్ని భద్రపరుచుకోవడానికి ప్రభుత్వమే సాయం చేస్తోంది… ఎంకరేజ్ చేస్తోంది… పిల్లలకు బయోలాజికల్ పేరెంట్‌గా అమరులైన జవాన్ల పేర్లను బర్త్ సర్టిఫికెట్లలో రాయడానికీ చాన్స్ ఇచ్చింది…
ఉక్రెయిన్ సామాజిక, కుటుంబ జీవనమే విచ్ఛిన్నమైంది ఈ యుద్దంతో… జరిగిన విధ్వంసం నుంచి ఉక్రెయిన్ ఇప్పట్లో తేరుకోదు… రష్యా వదలదు… అమెరికా అధికారుల అంచనా మేరకు 70 వేల మంది జవాన్లు మరణించారు, రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు… మరణించిన వారి అండాలు, వీర్యం ద్వారా సంతానాన్ని పొందాలని ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేస్తుందనేదానికి ప్రభుత్వానికీ ఓ జస్టిఫికేషన్ ఉంది… కానీ స్పష్టత లేకుండా…
గాయపడిన జవాన్ల తదుపరి వీర్యం సంతానసాఫల్యానికి సరిపోయే నాణ్యతతో ఉండకపోవచ్చు, అదేవిధంగా మహిళలకు కూడా.,. అందుకని యుద్ధానికి వెళ్లే జవాన్లు తమ వీర్యాన్ని, అండాల్ని ఫ్రీజ్ చేసి నిల్వ చేసుకునే అవకాశం ఆయా కుటుంబాలకు బోలెడంత బాసట అంటోంది ప్రభుత్వం… పుట్టే పిల్లలు కూడా ఈ జవాన్ల సాహసాలకు, త్యాగాలకు వారసులు, జాతికి కూడా ధైర్యం, అందుకే ఈ సంతానసాఫల్య వెసులుబాట్లు, భర్తో భార్యో యుద్ధంలో మరణిస్తే వాళ్ల పిల్లలు వాళ్ల జ్ఞాపకాలుగా ఆయా కుటుంబాల్లో పెరుగుతారు అనేది ప్రభుత్వ నిర్ణయాల అసలు సంకల్పం…
ఒక భార్య మరీ ఎమోషనల్ కామెంట్ ఎలా చేసిందంటే… ‘దేశాన్ని కాపాడటానికి నేలకొరిగిన జవాన్ల జ్ఞాపకాలే కాదు, వాళ్లకు నివాళ్లు ఈ పిల్లలు, ఎస్, ఆ జవాన్లకు మరణానంతరం కూడా పిల్లల్ని పొందే హక్కు ఉంది, అది వాళ్లకు గౌరవం కూడా…’
సరే, ఇదంతా ఒక కోణం… ఖండించలేం, భర్తో భార్యో మరణించిన తమ జీవిత భాగస్వాముల మీద ప్రేమను చంపుకోలేక, వాళ్ల జ్ఞాపకంగా పిల్లలు కనడం వాళ్ల ఇష్టం, ఎవరూ బలవంతపెట్టడం లేదు… అయితే..?
కొందరికి నచ్చకపోయినా సరే, నచ్చినా సరే, మరో వాదన కూడా ఉంది… ఒక జవాను మరణిస్తే ఆ త్యాగం, ఆ సాహసం ఒక జ్ఞాపకం, అంతే… కానీ వాళ్ల భార్యలో భర్తలో ఆ జ్ఞాపకాల్ని జీవితాంతం మోయడానికి వాళ్ల పిల్లల్ని కనాలా..? సో వాట్, కొత్త భాగస్వాములతో కొత్త జీవితాల్ని ఆరంభించే అవకాశాలను ఎందుకు కాదనాలి..?
కొత్త జీవిత భాగస్వాములు వాళ్ల పాత జ్ఞాపకాల్ని ఆహ్వానించకపోవచ్చు కదా… పైగా మరణించిన ఆ జవాన్ల గుణాలే ఈ పిల్లలకు రావాలనేమీ లేదు, సంపన్నమైన జాతికి ఇది నిర్వచనమూ కాదు, అభిలషణీయమూ కాదు… జ్ఞాపకాల్ని జ్ఞాపకాలుగానే మిగలనివ్వాలి… అవి వాళ్ల ఒళ్లోకి చేరి జీవితాంతమూ భౌతికంగా పెరగాల్సిన పనిలేదు…
చేదుగా ఉన్నాసరే కొన్ని జ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ అవసరం… కొత్త జీవితాలు కొత్త ఆశలతో ప్రారంభింపబడాలి… అది కాలసహజం… కానీ ఈ మరణానంతర సంతానాల కథ దీనికి భిన్నంగా ఉంది… లోతుగా ఆలోచిస్తే కొందరికి కరెక్టే అనిపించవచ్చు, కొందరికి సరికదా అనీ అనిపించవచ్చు..!!
Share this Article