దర్శకుడు కుమారస్వామి (అక్షర) అభిరుచి కలిగినోడు… కొత్తతరం దర్శకుడు… మన సినిమాల పాత వెగటుతనాన్ని అంటనీయకుండా కొత్త బాటల సాహస పథికుడు… తను తీసిన సినిమా షరతులు వర్తిస్తాయి త్వరలో రిలీజ్ కాబోతోంది. అందులో ఒక పాట గురించి మనం ఆమధ్య ముచ్చటించుకున్నాం… అది పన్నెండు గుంజాల పాట… తెలంగాణలో పెళ్లి తంతును చిత్రీకరించిన పాట…
ఆ పాటను ప్రముఖ తెలంగాణ కథకుడు పెద్దింటి అశోక్‌కుమార్‌తో రాయించుకున్న దర్శకుడు ఈసారి పాట గోరటి వెంకన్నతో రాయించుకున్నాడు… ఇదేమో కాస్త తత్వం బాటలో సాగుతుంది… కాసుల కట్టల ఆశరా ఇది, కాటికి పోయిన ఇడవదు ఒడువదు, దోసిలికందదు దప్పిక తీరదు, ఎండమావిరా అని ఏదో ఫిలాసఫీ బోధిస్తుంది…
పాడింది రామ్ మిరియాల కాబట్టి ఆ ‘కాలం సూపుల’ పాటకు కొంత గాంభీర్యం కూడా తోడైంది… సరైన గాయకుడి ఎంపిక… సినిమా కూడా గత తెలంగాణ సినిమాల్లాగా తాగుడును తెలంగాణ కల్చర్‌గా నీచంగా ఫోకస్ చేయకుండా, బలమైన ఎమోషనల్ అంశాలతో సాగుతుందని విన్నాను… గుడ్…
Ads
అయితే మనం ఇక్కడ ఆ పాట కంటెంటులోకి పోవడం లేదు… జస్ట్, కొన్ని సరదా సంగతులు ప్రస్తావించుకుందాం… ఓచోట లోపల ఆకలి దీపంతోనే లోకం వెలుగుతోందిరా అంటాడు గీత రచయిత గోరటి వెంకన్న… ఎందుకలా అన్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడో వదిలేస్తే.,. ఈ లిరికల్ వీడియోలో ‘లోపల ఆకలి దీపం’ పదాల దగ్గర కుమారి ఆంటీ బొమ్మను చూపించడం కాస్త చిరునవ్వు తెప్పించింది పెదాల మీదకు…
వావ్, ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ కుమారీ ఆంటీ చివరకు సినిమా పాటల్లోకి ఎక్కడమే కాదు, ఆకలి- తిండి పదాలు గుర్తుకురాగానే ఆమె ఫుడ్ గుర్తుకురావడం ఒకింత అబ్బురమే అనిపించింది… అఫ్‌కోర్స్, సినిమాలో ఆ చరణాలు వచ్చినప్పుడు ఏ సీన్ ఉంటుందో, ఏ సందర్భమో తెలియదు కాబట్టి ఆ అబ్బురానికి ఇక్కడే అడ్డుకట్ట వేసుకుందాం…
మరోచోట ఫేస్ బుక్ మిత్రుడు చేగొండి చంద్రశేఖర్ బొమ్మ… ఇంట్రస్టింగు… తను తరచూ సినిమాల్లో కూడా నటిస్తుంటాడు కదా… తనతోపాటు పాటలో ఒకరిద్దరు జబర్దస్త్ కమెడియన్ మిత్రుల మొహాలూ కనిపించాయి…
చెప్పనే లేదు కదూ… పాట సాగుతున్నప్పుడు కరీంనగర్ కమాన్‌తోపాటు కొందరి జాతినాయకుల విగ్రహాలు కనిపిస్తాయి… ఒక చేతిలో బతుకమ్మ పట్టుకున్న తెలంగాణ తల్లితో పాటు మరోచోట కొత్తపల్లి జయశంకర్, ఇంకోచోట అంబేడ్కర్ తదితరులూ కనిపిస్తారు… నచ్చింది ఏమిటంటే… సోకాల్డ్ తెలంగాణ జాతిపితలు, బాపుల బొమ్మ చూపించడం పట్ల అనురక్తి చూపించకపోవడం…! తనే కాదు, ఏ రాజకీయ నాయకుడి / నాయకురాలి విగ్రహాన్నీ తెలంగాణతనానికి ఐకన్‌గా చూపించకపోవడం..!!
Share this Article