లేడీ జర్నలిస్టులపై పిచ్చి కూతలు కూసిన ఓ బీజేపీ నాయకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది… ముందుగా ఈ వార్త చదవండి… ‘‘మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఎస్వీ శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అప్పట్లో ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆ పోస్టులో ఆరోపించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. దీనితో ఆగ్రహించిన చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జర్నలిస్టుల సంఘం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా.., చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) ఐపీసీలోని వివిధ సెక్షన్లు, తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయన మాజీ ఎమ్మెల్యే కావడంతో కేసు చెన్నైలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. విచారణలో మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు తేలింది. అయితే దీనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎస్వీ శేఖర్ క్షమాపణలు తెలిపారు.
Ads
అయితే కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శేఖర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ ముందు విచారణకు వచ్చింది. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు వెలువరించారు.
తరఫు న్యాయవాది అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు రెండు నుంచి నాలుగు వారాలలోపు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చని చెబుతూ, శిక్షను తాత్కాలికంగా నిలిపేసింది. కాగా 2023లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌పై పలు క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఈ వాచాలుడు ఎవరంటే…? ముందుగా ఏఐఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు… తర్వాత కాంగ్రెస్‌లోకి మారాడు. ఆ తర్వాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నాడు… అసలు వివాదానికి దారితీసిన ఆ సంఘటన ఏమిటంటే..?
2018లో… అప్పటి తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఓ మహిళా జర్నలిస్టు చెంపపై తట్టాడు… దురుద్దేశంతో కాకపోవచ్చు, కానీ అభ్యంతరకరమే… దీనిపై కొద్దిరోజుల తర్వాత ఎస్వీ శేఖర్ ఫేస్‌బుక్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. లేడీ జర్నలిస్టు చెంపను తాకినందుకు గవర్నర్ తన చేతుల్ని ఫినాయిల్‌తో కడుక్కోవాలని వ్యాఖ్యానించాడు… తరువాత పోస్ట్ డిలిట్ చేశాడు… మరో పోస్టులో మహిళా జర్నలిస్టులు నిరక్షరాస్యులు, తెలివిలేనివారు, అగ్లీ అన్నాడు…
సరే, కోర్టు సరైన శిక్షే వేసింది… అబ్బే, తను ఎవరినీ అవమానించలేదనీ, సరిగ్గా వెరిఫై చేసుకోకుండానే పోస్ట్ పెట్టాననీ కోర్టుకు ఏవో కథలు చెప్పాడు… కానీ న్యాయమూర్తి తోసిపుచ్చాడు… ప్రజాజీవనంలో ఉన్నవాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలని పేర్కొంటూ జైలుశిక్ష ఖరారు చేశారు… నిజానికి ఆ శిక్ష తక్కువే… ఇప్పుడిక అప్పీలుకు వెళ్లి తన నిర్వాకాన్ని సమర్థించుకునేందుకు నానాపాట్లూ పడతాడు… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? తమిళనాడులో బీజేపీకి ఇంకెవరూ దొరకడం లేదా..? ఇలాంటివాళ్లనా చేర్చుకునేది..? తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇంకా ఏమీ వ్యాఖ్యానించినట్టు లేదు… సస్పెండ్ ఎందుకు చేయడం లేదు..?
ఇదంతా వోకే… నిజంగా మహిళా రాజకీయ నాయకులపై మరీ నీచంగా దిగజారిపోయి పోస్టులు పెడుతున్న ఏపీలో ఇలాంటి కేసులు నమోదైతే, తమిళనాడు తీర్పే రిపీట్ అయితే ఎందరికి జైలు శిక్ష పడుతుందో..!! తమను కించపరిచిన శేఖర్ విషయంలో పట్టువదలకుండా జైలుశిక్ష పడేదాకా పోరాడిన తమిళనాడు లేడీ జర్నలిస్టులకు ‘ముచ్చట’ అభినందనలు…
Share this Article