సినిమాది డివైడ్ టాకే అయినా.. తాప్సీ నటనకు మాత్రం ప్రశంసలు! …. By రమణ కొంటికర్ల
తాప్సీ.. ఓ గ్లామర్ గర్ల్ గా హీరోయిన్ పాత్రలతో మాత్రమే ఎంటరై.. ఎలాంటి పాత్రైనా పండించగల స్థాయికెదిగిన ఓ ఉత్తమనటి. ఈ మధ్య విడుదలై మిక్స్ డ్ టాక్ వినిపించిన డంకీలో హీరో షారుక్ ఖాన్ తో కలిసి నటించడం ఓ కలలా భావించిన తాప్సీ.. షారుక్ ఖాన్ నూ మింగేసే స్థాయిలో నటించి విమర్శకుల ప్రశంసలందుకోవడమే విశేషం. (తాప్సీ అనగానే ఆమధ్య రాఘవేంద్రరావు బొడ్డు పిచ్చి మీద కామెంట్స్ చేసి తెలుగు సినిమా ప్రేమికుల తిట్లు తిన్న సంగతి గుర్తొస్తుంది…)
రాజు హిరానీ వంటి సామాజిక ఇతివృత్తాలతో సందేశాలను సున్నితంగా ఇవ్వాలనుకునే ఓ దర్శకుడు ఇచ్చిన ఆఫర్.. పైగా షారుక్ ఖాన్ హీరో.. ఇంతకన్నా మంచి తరుణం రాదనుకుందట సినిమా ఆఫర్ వచ్చిన తరుణంలో తాప్సీ. అంతేకాదు.. తనకిష్టమైన నటుడు షారుక్ తో ఇదే మొదటి సినిమా.. ఆఖరి సినిమా కూడా కావచ్చనే ఒకింత భావోద్వేగంతో వీలైనంత ఎక్కువగా సెట్స్ లోనూ… సెట్స్ బయటా ఆయన్నుంచి అనుభవాలను నేర్చుకునే యత్నం చేసినట్టు ఆమె పింక్ విల్లా అనే ఓ యూట్యూబ్ డిజిటల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Ads
కలలకైనా, ఆశలకైనా హద్దులుండాలని భావించిన తనకు డంకీ అవకాశం.. తానే నమ్మలేకపోయానన్న తాప్సీ.. షారుక్ తో రెండేళ్లపాటు కలిసి డంకీ కోసం సెట్స్ లో ఉండటం తన అదృష్టమంటారు. అయితే, అంతగా ఆరాధించే షారుక్ కంటే కూడా.. తాప్సీ పన్ను క్యారెక్టరే డంకీ సినిమాకు జీవం పోసిందంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. షారుక్ 35 ఏళ్ల నట జీవితంలోని అనుభవాలను.. డంకీ సెట్స్ లోనే ఆయన్నుంచి నేర్చుకుని తాప్సీ.. అదే సినిమాలో తన నటనతో తన గురువైన షారుక్ కు తను విన్న పాఠాలను భలే అప్పజెప్పేసింది.
డంకీలో మను రంధావా పాత్రలో తాప్సీ పాత్రే అసలు లీడ్ రోల్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరో ఇద్దరు మిత్రులతో కలిసి లండన్ వెళ్లాలన్న తన కసి, పట్టుదలలో భాగంగా మను పడే కష్టాలు.. తాను పని చేసే చోట ఎదుర్కొనే సవాళ్లు.. స్నేహితుల కొరకు చూపే ప్రేమ.. లండన్ వెళ్లాలన్న తాపత్రయం వెరసి.. సినిమా ప్రారంభమైన ఆసుపత్రి సీన్ లో సిగరెట్ వెలిగించే వంకతో తప్పించి పారిపోవడం నుంచి.. చివరాఖరకు 25 ఏళ్ల తర్వాత కలిసి.. తనలాగే ఒంటరిగా తన కొరకు వేచి చూస్తున్న హార్డీ (షారుక్)తో అనుభూతులను పంచుకుంటూనే అలా కుర్చీలో ఒదిగి శాశ్వతంగా వెళ్లిపోయే వరకూ మను పాత్రలో తాప్సీ నటనే డంకీలో హైలెట్.
బ్లర్, తప్పడ్, అమితాబ్ తో బద్లా, పింక్ తో పాటు.. రష్మీ రాకెట్, నీతిశాస్త్ర వంటి ఎన్నో సినిమాల్లో ఓ ప్రతిభావంతురాలైన యాక్ట్రెస్ గా తాప్సీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఇప్పుడు సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకున్నా.. తన నటన వరకూ మాత్రం డంకీలో తాప్సీ మంచి మార్కులే కొట్టేసి.. క్రియేటివ్ డైరెక్టర్స్ తననెందుకు ఎంచుకుంటారో తెలియజెప్పింది…
Share this Article