Nancharaiah Merugumala…… నారీమన్ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం!
………………………………….
‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ఉన్న ఈ ప్రఖ్యాత అడ్వొకేట్ నిజంగా అన్ని పత్రికల్లో మంచి కవరేజీ ఇవ్వాల్సిన పెద్ద మనిషే.
Ads
సుప్రీంకోర్టులో లాయర్లుగా ప్రాక్టీసు చేస్తూ నేరుగా అదే కోర్డులో జడ్జీలుగా నియమితులైన కొద్ది మంది వకీళ్లలో ఫాలీ శామ్ నారీమన్ కొడుకు రోహింగ్టన్ నారిమన్ ఒకరు. పదవీ విరమణ వయసు 65కు చేరిన తర్వాత రెండేళ్ల క్రితం రోహింగ్టన్ రిటైరయ్యారు. ఇలా సుప్రీంకోర్టు జడ్జీగా తన కొడుకు రిటైర్ కావడం చూసిన తండ్రి బహుశా ఫాలీ శామ్ నారీమన్ ఒక్కరేనేమో. ఇంతకీ ఈనాడులో ఈ మషూర్ ఫార్సీ వకీలుకు అంచనాకు మించి కవరేజీ ఇవ్వడానికి కారణం ఉందనిపిస్తోంది.
‘ దేరీజే మెదడ్ ఇన్ హిజ్ మాడ్నెస్’ ( అతని పిచ్చికీ ఓ పద్ధతి ఉంటది) అనే ఇంగ్లిష్ వాక్యం నూటికి నూరు పాళ్లు వర్తించే తెలుగు మీడియా వ్యాపార దిగ్గజం చెరుకూరి రామోజీ రావు గారు. ఆయన ఏ ప్రముఖుడికీ ఊరికినే ప్రచారం ఇవ్వరు. అంటే ఈనాడులో వార్త భారీ సైజులో రాయడానికి ఆయనేమీ ఫీజు వసూలు చేస్తారని కాదు. కాకపోతే ఆయన తనకు గతంలో కీలక సేవలందించిన వారి గురించి తన పత్రికలో విశేష కథనాలను వారు ఎన్నికల్లో పోటీచేసినప్పుడో లేదా పెద్ద పదవులు చేపట్టినప్పుడో లేదా వారు కన్నుమూసినప్పుడో ప్రచురించడం గత 40 ఏళ్లుగా జరుగుతున్నదే.
‘కౌన్సిల్ కేసు’లో రామోజీ అరెస్టును అడ్డుకోవడానికి సుప్రీంలో నారీమన్ వాదనలు
…………………………………………
1983 జనవరిలో టీడీపీ మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాక సహజంగానే ఏపీ శాసనమండలిలో పాలకపక్షానికి తక్కువ మంది సభ్యులుండేవారు. మెజారిటీతోపాటు మండలి చైర్మన్ సయ్యద్ ముఖాసిర్ షా సాబ్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. ఒకరోజు సభలో గొడవ జరగడంతో ఈనాడులో ‘పెద్దల సభలో గలభా’ అనే శీర్షికతో కథనం వచ్చింది. ఈ శీర్షిక కౌన్సిల్ సభ్యుల విశేష హక్కులకు భంగం కలిగిస్తోందని, ఈనాడు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని పాలకపక్షమైన తెలుగుదేశం మినహా అన్ని ప్రతిపక్షాలూ విరుచుకుపడ్డాయి.
ఈ కేసులో రామోజీ రావును అరెస్టు చేసి సభ ముందు నిలబెట్టాలని విధాన పరిషత్ తీర్మానించింది. ఈనాడు చీఫ్ ఎడిటర్ అరెస్టుకు ఏపీ కౌన్సిల్ జారీచేసిన సమన్లు పట్టుకుని 1984 మార్చి 28న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.విజయరామారావు సోమాజిగూడలోని ఈనాడు ఆఫీసుకు వెళ్లారు. అప్పట్లో రామోజీ కంపెనీ ఒకటి తయారు చేసి అమ్మే ‘సోమా’ అనే సాఫ్ట్ డ్రింక్ ను నగర పెద్ద పోలీసు అయిన కేవీఆర్ కు ఈనాడు అధిపతి అందించారట.
‘ రాష్ట్ర చట్టసభ ఆదేశాల మేరుకు నేను మిమ్మల్ని శాసన మండలికి తీసుకెళడానికివచ్చాను,’ అని సీపీ చెప్పగానే తనను అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆరోజే జారీచేసిన ఉత్తర్వును రామోజీరావు పోలీసు ఉన్నతాధికారికి చూపించారు. దాంతో, ‘‘అయినా మీరు సభ ముందుకు రావాలనుకుంటే– మీకు స్వాగతం. నేనే స్వయంగా కౌన్సిల్ కు మిమ్మల్ని తీసుకెళతాను. మీరు రాకూడదని భావిస్తే మిమ్మల్ని నేను అరెస్టు చేయను,’ అని మర్యాదగా చెప్పి పోలీసు కమిషనర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
‘పెద్దలసభలో గలభా’ కేసులో రామోజీ తరఫున సుప్రీంకోర్టులో ఆరోజు వాదించిన ఫాలీ ఎస్ నారీమన్ ఆయన అరెస్టుపై స్టే ఉత్తర్వును ఆగమేఘాల మీద వచ్చేలా చూశారు. అప్పటికి 48 సంవత్సరాల వయసున్న రామోజీరావు నాటికి కొద్ది నెలల ముందే ‘న్యూజ్ టైమ్’అనే ఇంగ్లిష్ దినపత్రికను హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. ఇప్పటిలా ఆయనకు మీడియా ముఘల్ అనే పేర్లేదు. అనాజ్ పూర్ గుట్టపై కోటంత ఇల్లూ ఆయనకు లేదు. బేగంపేట చీకోటి గార్డెన్స్ లో రామోజీ తాను మొదట కట్టుకున్న భవనంలో అప్పుడు నివసిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ అప్రజాస్వామిక ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రసిద్ధ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ తో రామోజీకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ కేసులో పెద్దల సభకు సారీ చెప్పకుండా బయటపడగలిగారు. అది ఎలాగంటే…
ఈనాడులో అరెస్టయి కౌన్సిల్ లో సారీ చెప్పకుండా రామోజీని కాపాడిన ఫార్సీ వకీల్
………………………………………………………………………………………
ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టులో గట్టిగా వాదించే మంచి లాయర్‌ను చూడాలని న్యూఢిల్లీలో ఉండే నయ్యర్ ను రామోజీ కోరగా, ఈ పంజాబీ జర్నలిస్టు అప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఫార్సీ వకీలు ఫాలీ నారీమన్ కు రామోజీ కేసు అప్పగించారు. అలా పెద్దల సభలో గలభా అనే శీర్షిక కారణంగా తాను శాసనమండలికి పోయి క్షమాపణ చెప్పకుండా తప్పించుకోగలిగారు పెదపారుపూడి రైతుబిడ్డ రామోజీ.
నారీమన్ వంటి పెద్ద లాయరును పెట్టుకోవాల్సిన గొప్ప కేసులేవీ అప్పట్లో రామోజీని చుట్టుముట్టలేదు. అప్పటికి ఆయన అంత ‘బిగ్ షాట్’ కూడా కాదు. కాని పై వ్యవహారం చట్టసభతో ఘర్షణ, సభా హక్కుల ఉల్లంఘన వరకూ రావడంతో నారీమన్ స్థాయి లాయర్ ఈ కేసులో అవసరమని ఉమ్మడి పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏపీ రెండో గవర్నర్ భీంసేన్ సచ్చర్ అల్లుడైన కుల్దీప్ నయ్యర్ తో మాట్లాడాక రామోజీరావు గారికి అర్ధమైంది.
ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తే బావుంటుంది. 1931లో ఇంగ్లండ్ లో ఆయన న్యాయశాస్త్రం చదువుతుండగా లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రసిద్ధ లాయర్, ముస్లింలీగ్ నేత మహ్మదలీ జిన్నా సాహబ్ వచ్చారు. తాను లా కోర్సు చేస్తున్న లీడ్స్ నగరంలో కూడా జిన్నా పర్యటించారు. అక్కడ ఎంఏ జిన్నాను ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన జగన్మోహనరెడ్డి కలిశారు.
అప్పుడు యువ లాయర్లకు జిన్నా సాహబ్ ఇచ్చే మంచి సలహా ఏమిటని పింగళి రెడ్డి గారు అడిగారు. ‘‘రెడ్డీ, నువ్వు తలనొప్పి, కడుపునొప్పి లేదా మరే ఇతర ఆరోగ్య సమస్య ఉన్నా– ఏ వైద్యశాస్త్ర విద్యార్థి అయినా సూచించే మందు ఏదైనా వేసుకుంటావు. ఆ ఔషధం వల్ల ఎలాంటి ఇబ్బంది వస్తుందోననే దిగులు నీకుండదు. ఇక ఆస్తికి సంబంధించిన లేదా మానసిక క్షోభకు కారణమైన కోర్టు కేసులో నువ్వు ఇరుక్కుని ఉంటే–అత్యుత్తమ లాయర్ ను నీ కేసు వాదించడానికి పెట్టుకుంటావు.
దావా గెలిపించే మంచి లాయర్ కోసం నీ భార్య చివరి ఆభరణాలు సైతం అమ్మి ఫీజు చెల్లించడానికి సిద్ధపడతావు. నీవు అలాంటి బెస్ట్ అడ్వొకేట్ గా ఎదిగితేనే న్యాయవాద వృత్తిలో రాణిస్తావు,’ అని జిన్నా సాహబ్ జవాబిచ్చారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ‘ద జ్యుడీషియరీ ఐ సర్వడ్’ అనే తన జ్ఞాపకాల పుస్తకంలో వెల్లడించారు. 1975లో సుప్రీంకోర్టు జడ్జీగా రిటైరైన మరుసటి రోజునే జస్టిస్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఉస్మానియా వర్సిటీ వైస్ చాన్సలర్ గా నియమించారు. అప్పటికి చెడ్డపేరు మూటగట్టుకున్న ఉస్మానియాను జస్టిస్ పింగళి గాడిన పెట్టారు. 1974 ఆగస్టులో ఈనాడు పత్రికను ప్రారంభించినప్పుడు వెంగళరావుతో రామోజీకి సన్నిహిత సంబంధాలుండేవనే విషయం అందరికీ తెలిసిన విషయమే.
Share this Article