85 సంవత్సరాల వయస్సులో ధనిరాం మిట్టల్ చనిపోయాడు… ఏడాదిగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించాడని అంత్యక్రియల అనంతరం కొడుకు పోలీసులకు చెప్పాడు… సో వాట్ అంటారా..? ఏవరో కోన్ కిస్కా అంటారా..? నో… ప్రపంచం విస్తుపోయే రేంజ్ దొంగ… మన ఇండియనే… (మనం మొన్నటి ఫిబ్రవరిలోనే తన గురించి ఓ ప్రత్యేక కథనం ముచ్చటించుకున్నాం… అది మరోసారి…, సదరు బుర్రకు నివాళ్లు అర్పిస్తూ…)
అరవై నాల్గు కళల్లో చోరకళ కూడా ఒకటి అని తెలిసినా.. దాన్నొప్పుకునే వారేరీ..? కానీ, ఆ దొంగ మాత్రం ఒప్పుకునేలా చేశాడు. చోరీ కూడా ఓ కళ అని.. అందులో తాను ఆరితేరిన కళాకారుడినని కూడా తన వివిధ ప్రక్రియలతో నిరూపించాడు. ఇంతకీ ఎవరా సూపర్ థీఫ్..?
సూపర్ నట్వర్ లాల్.. ఇండియన్ ఛార్లెస్ శోభారాజ్ గా అభివర్ణించబడ్డ ఆ దొంగ పేరు ధని రామ్ మిట్టల్. అంతా కేసులు వాదించేందుకో.. న్యాయాన్ని కాపాడేందుకో.. అన్యాయమైనవారికి న్యాయం చేయడానికో.. లేక సంపాదన కోసం వృత్తిగా ఎంచుకునేందుకో లా చదువుతారు. కానీ, ఎన్ని దొంగ వేషాలు వేసినా దొరక్కుండా ఉండేందుకు లా చదివిన దొంగ.. ధని రామ్ మిట్టల్.
Ads
అవునూ, ఏకంగా వెయ్యి కార్లను దొంగిలించిన దొంగ. అంతేనా.. లా చదివి లాయర్ అయ్యీ.. న్యాయవాద వృత్తినీ తన దొంగతనాలు, మోసాలకు వాడుకున్న ఘనుడు ధని రామ్ మిట్టల్. అలా ఏకంగా ఓ రెండు నెలల పాటు దేశ న్యాయవ్యవస్థనే బురిడీ కొట్టించి న్యాయమూర్తే అయ్యాడంటే నమ్ముతారా..? న్యాయమూర్తి పీఠంపై కూర్చుని ఏకంగా 2 వేల మంది నేరస్థులు జైల్లోంచి విడుదలయ్యేందుకు కారకుడంటే ఊహించడానికి కూడా అవకాశం ఉండదేమో..? కానీ, ఇవన్నీ చేశాడు గనుకే ధని రామ్ మిట్టల్ ను.. భారత, వియత్నాం మూలాలున్న ఛార్లెస్ శోభరాజ్ తో పోల్చేది.
అద్భుతమైన చేతిరాత కల్గిన ధని రామ్.. తన తలరాతను మాత్రం మంచి నడవడిక వైపు రాసుకోలేదు సరికదా.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేందుకు చోరకళనెంచుకుని.. తనకున్న ప్రతిభా, సామర్థ్యాలను దొంగతనానికి ఉపయోగించిన టాప్ మోస్ట్ థీఫ్.
ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధని రామ్ మిట్టల్ అంటే హడల్. ఒక ఆరు దశాబ్దాల పాటు అంటే.. ఒక మనిషి సగటు జీవితకాలం దొంగతనాలతో బెంబేలెత్తించాడు. తెల్లార్లేస్తే పోలీసులకు తన వేటే పని అన్నట్టుగా కొరకరాని కొయ్యగా మారాడు. ఔటర్ ఢిల్లీ నరేలా ప్రాంతంలో చాలాకాలం తన కుటుంబంతో నివసించాడు. మొట్టమొదట 1961 నుంచి తన 25 ఏళ్ల వయస్సులో దొంగవతారమెత్తిన మిట్టల్.. ఆ తర్వాత 1968 నుంచి 74 వరకూ తప్పుడు ధృవపత్రాలతో ఆరేళ్లపాటు స్టేషన్ మాస్టర్ గా పనిచేశాడు. ఓసారి పోలీసులు ఇంటరాగేషన్ చేసినప్పుడు.. తన కేసులకు లాయర్ ఎవ్వరూ అక్కర్లేదని.. తన కేసులు తానే వాదించుకుంటాననీ సమాధానమిచ్చాడు.. 1970లోనే రాజస్థాన్ లో లా పూర్తి చేసిన అ’న్యాయవాది’ ధని రామ్.
పఠియాలా హౌజ్ కోర్టుతో పాటు.. రోహ్ తక్, ఢిల్లీ వంటి స్థానిక కోర్టుల్లో లాయర్ గా న్యాయవాద వృత్తినీ ప్రాక్టీస్ చేసిన ధని రామ్.. హర్యానాలోని జజ్జర్ జిల్లా కోర్టును తప్పుదోవ పట్టించి రెండు నెలల పాటు జిల్లా జడ్జ్ గా కుర్చీలో కూర్చుని తీర్పులివ్వడం.. సంచలనం రేకెత్తించిన వార్త. అలా నేరస్థులకు శిక్షలు ఖరారు చేసే కోర్టునే.. తప్పుదోవ పట్టించిన దొంగగా రికార్డ్ సృష్టించిన మిట్టల్ కు.. బయట కంటే జైళ్లల్లోనే దోస్తులెక్కువ. తన సహచర దొంగలకు ఎలాంటి న్యాయ సలహాలు, సమీక్షలు కావాలన్నా ధని రామే వారికి పెద్ద దిక్కు.
ధని రామ్ పైన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్, ఆర్మ్స్ యాక్ట్, గ్యాంబ్లింగ్ యాక్ట్, ఎక్సైజ్ యాక్టుల కింద మొత్తం 127 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కొత్త కార్లనెలా కొట్టేయాలి, వాటి డాక్యుమెంట్స్ ను ఎలా ఫోర్జరీ చేయాలి, వాటిని సెకండ్ హ్యాండ్ కింద డీలర్స్ కు ఎలా అమ్మేయాలి, ఎలా కేసుల నుంచి తప్పించుకోవచ్చు, ఎలా జైళ్ల నుంచి ఎస్కేప్ కావచ్చు.. ఇలా, చోరకళలో, మోసాల్లో ధని రామ్ మిట్టల్ మిగిలిన దొంగలకు ఓ రోల్ మాడల్.
ఒకసారి జడ్జి స్థానంలో కూర్చుని తన నేరంపై తానే నిర్దోషిగా తీర్పు చెప్పుకున్న ఉదాహరణ ప్రపంచంలో మరొకటి దొరకదు… ఓ దొంగ జడ్జ్ గా కూడా ధని రామ్ మిట్టల్ పేరు దేశంలో ఓ సంచలనం. ఇప్పుడెందుకీ దొంగ గురించంటే… మొన్నామధ్యే మళ్లీ ఢిల్లీ పశ్చిమ్ విహార్ లో ఓ ఎస్టీమ్ కారు దొంగిలించి పట్టుబడ్డాడు గనుక… నెగటివిటీకి మీడియాలోనూ గిరాకీ బాగున్న నేటికాలంలో.. ఎవరైనా ప్రయత్నిస్తే ధని రామ్ మిట్టల్ కథ ఓ సూపర్ హిట్ సినిమా అవ్వడం మాత్రం ఖాయం… (By… కొంటికర్ల రమణ)…
Share this Article