Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తనపై సినీ డైలాగ్ ప్రేమికుల సద్భావనను తనే ‘మడతపెట్టి’… ఒక పతనం…

February 24, 2024 by M S R

త్రివిక్రమ్ మడతపెట్టిన కుర్చీ!

ఏనాడో పెద్దాయన పింగళి కంబళి-గింబళి; వీరతాళ్లు; దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ…ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్లం. తరువాత జంధ్యాల మాటలతో సినిమా తెర నవ్వి నవ్వి కొంతకాలం నోరు సొట్టలు పోయింది. తరువాత సినిమాలో హాస్యం ఎడారి అయిపోయింది. తెలుగుతనం ఎండమావి అయిపోయింది. హీరో తొడ కొడితే వెయ్యి మైళ్ల వేగంతో వెనక్కు వెళ్లే రైళ్ల దృశ్యాలతో అపహాస్యం రాజ్యమేలే వేళ…సునిశిత హాస్యం సిగ్గుతో తెర మరుగయ్యింది. మాటలో, పాటలో బూతు, పచ్చి బూతు, పరమ బూతు స్థాయీ భేదాలు స్థిరపడేసరికి హాస్యం ద్వంద్వార్థాలకే పరిమితమయ్యింది.

అలాంటి వేళ సైన్స్ చదివిన త్రివిక్రమ్ తెలుగు సాహిత్యం కూడా చదివి తెలుగు మాటల కోటలు కట్టేసరికి, హాస్యపు జల్లు చిలకరించేసరికి “మాటల మాంత్రికుడు” అని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని ఊరేగించారు. ఆయన చెప్పే ప్రతి మాటకు జేబుల్లో చేతులు పెట్టుకుని రోడ్లమీద వెళ్లిపోయారు. “అతడు” లాంటి సినిమాలు సంవత్సరంలో అయిదు వందల సార్లు ప్రసారం చేసినా…అయిదు వందల సార్లూ కనురెప్ప వేయకుండా చూశారు. విన్నారు. ఆ మాటల్లో దొర్లే ప్రాసలు, పంచుల్లో ఏదో గమ్మత్తు ఉందని వేనోళ్ల పొగిడారు. ఆయన ప్రవచనాలకు మురిసి…సినిమా వారు ఆయనకు “గురువు” బిరుదు కూడా ప్రదానం చేశారు.

Ads

అలాంటి సినీగురువు తెలుగు త్రివిక్రమ్ లో ఇప్పుడు తెలుగు వెతుక్కోవాల్సి వస్తోంది. యతులు, ప్రాసలు ఆయన్ను వదిలాయో! లేక ఆయనే ప్రయత్నపూర్వకంగా వదిలించుకున్నారో! తెలియదు.

ఇరవై, ముప్పయ్ ఏళ్లు అష్టకష్టాలు పడితే అత్త మనసు కరిగి దగ్గరయ్యే అల్లుడు అత్తారింటికి దారి వెతుక్కున్నా;
తారుమారైన బిడ్డలు తల్లిదండ్రుల పంచన చేరే అలవైకుంఠ పురాల దారి పట్టినా;
తల్లి వదిలించుకున్న కొడుకు తల్లిని చేరేందుకు గుంటూరు- హైదరాబాద్ మధ్య జీప్ వేసుకుని విసుగు విరామం లేకుండా గుంటూరు ఎండు మిరపల మీదుగా డ్రైవ్ చేసినా…
త్రివిక్రమ్ కథలో పేర్లు మారుతున్నాయి కానీ…అదే అజ్ఞాత వాసం. అదే అరణ్యరోదన. తిరిగి కలిసేందుకు విలన్లతో అదే పోరాటం. దర్శకుడిగా అది ఆయన ఇష్టం. మనకు ఇష్టముంటే చూస్తాం. లేకపోతే లేదు.

సంస్కారవంతమైన పదహారణాల తెలుగుకే త్రివిక్రమ్ కట్టుబడి ఉండాలని షరతు విధించే అధికారం కూడా ప్రేక్షకులుగా మనకు ఉండదు. ఉండాలని కోరుకోకూడదు కూడా.

కానీ…అన్ని ఆదర్శాలు చెప్పే త్రివిక్రమ్; విశ్వనాథ్, సిరివెన్నెల లాంటివారి దృశ్యాలు, మాటల మధ్య దాగిన మహోన్నత విలువలను పట్టి ఇచ్చే త్రివిక్రమ్ ఈమధ్య కుర్చీని మడతపెట్టి…ఇచ్చిన విలువను మాత్రం అదే త్రాసులో తూచలేకపోతున్నారు. కాపీ కొట్టడానికి లోకంలో ఇంకేమీ దొరకనట్లు సోషల్ మీడియాలో ఒక పరమ బూతుతో పాపులర్ అయినదానిని పాటకు వాడుకున్న త్రివిక్రమ్ ను పాత త్రివిక్రమ్ పక్కన పెట్టి ఎలా చూడాలో తెలియక ఆయన పంచ్ డైలాగుల అభిమానులు తికమకపడుతున్నారు.

“ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి
శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి
బయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె
కూలంకశ పెక్కుభంగుల్ వివేక భ్రష్టసంపాతముల్-

అంతటి గంగ-
ఆకాశం నుండి శివుడి తలమీద;
శివుడి తలమీద నుండి హిమాలయం మీద;
హిమాలయం నుండి సముద్రంలోకి;
సముద్రం కింద పాతాళంలోకి చేరింది. వివేకం కోల్పోతే ఎంతటివారికైనా పతనం ఇలాగే ఉంటుంది”
అని భర్తృహరి సంస్కృత శ్లోకంలో గుండెలు బాదుకుంటే…ఏనుగు లక్ష్మణకవి తెలుగు పద్యంలోకి అనువదించి గుండెలు బాదుకున్నాడు.

పాత త్రివిక్రమ్ ను అభిమానించే వారికి కొత్త త్రివిక్రమ్ మీద జాలిపడే అధికారం కూడా ఉంటుందని మాటల మాజీ మాంత్రికుడికి ఇంకొకరు చెప్పాల్సిన పనిలేదు. -పమిడికాల్వ మధుసూదన్  9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions