ఆంధ్రా మీడియాకు తెలంగాణ భాష, సంస్కృతి, పండుగలు, చివరకు తిండి మీద కూడా చిన్నచూపే, వివక్షే… పదే పదే దాన్ని గురించి చెప్పుకునే పనిలేదు… కోట్లసార్లు చెప్పుకున్నదే, బాధపడిందే, తిరగబడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నదే… అలాంటి ఆంధ్రా మీడియాకు కోట్లాది ఆదివాసీ మూలవాసుల మీద ప్రేమ ఎందుకుంటుంది..? వాళ్ల మనోభావాల్ని ఎందుకు గౌరవిస్తుంది..?
సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం దగ్గర నుంచీ సమ్మక్క తిరిగి వనప్రవేశం చేసేవరకు… వనం జనం అవుతుంది… అది మన కుంభమేళా… అధికారిక లెక్కల ప్రకారమే 1.3 కోట్ల మంది హాజరయ్యారు… ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆ మేడారం పరిసర రాష్ట్రాల నుంచి సైతం, ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరులు పిల్లాజెల్లాతో తరలివచ్చి జరుపుకునే ఆధ్యాత్మిక సంబురం… కానీ ఆంధ్రా టీవీల్లో ఆ సందడి కనిపించదు…
Ads
పొద్దున్నే కావాలని ఏపీ ఎడిషన్లలో వెతుకుతుంటే… ఈనాడు, ఆంద్రజ్యోతి, సాక్షి… ఇవే కదా ప్రధాన ఆంధ్రా పత్రికలు… ఆ మూడింట్లోనూ ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ చివరి ఆర్టికల్ దాకా దిక్కుమాలిన పొలిటికల్ దుర్వాసన తప్ప మరేమీ లేదు… ఎజెండా బేస్డ్… టీడీపీ మీద సాక్షి, వైసీపీ మీద జ్యోతి, ఈనాడు… కానీ ఫస్ట్ పేజీలో స్థానం సంపాదించాల్సిన సమ్మక్క మాటేమిటి..? జీరో…
ఈనాడులో ఎక్కడో 10 వ పేజీలో ఓ చిన్న వార్త… కనీకనిపించనట్టుగా మొక్కుబడిగా, మరీ వదిలేస్తే బాగుండదని కవర్ చేశారు… నా కళ్లే మోసం చేశాయో, వాళ్ల కళ్లే మూసుకుపోయాయో గానీ ఆంధ్రజ్యోతి, సాక్షిల్లో అదీ కనిపించలేదు… తెలంగాణలో జాతర స్థలం ఉంది కాబట్టి అది తెలంగాణ వార్త కాబట్టి ఆంధ్రా ఎడిషన్లలో అవసరం లేదనుకున్నారేమో… దీన్ని పాత్రికేయం అంటారా..? సిగ్గుపడాలి…
ఎవరో సెలబ్రిటీ తిరుమలకు వస్తే ఫోటోతో సహా వార్త వేస్తారు, తెలంగాణ, హైాదరాబాద్ ఎడిషన్లలో..! అక్కడికి స్వామివారి మీద వాళ్లే దయతలిచి సందర్శించినట్టు..!! ఏం..? అలాంటి పైత్యపు కవరేజీకన్నా సమ్మక్క వార్త తీసిపోయిందా..? మేడారం జాతర అంటేనే సగటు ఆదివాసీ కుటుంబానికి తప్పనిసరి ఆధ్యాత్మిక తంతు… పుట్టువెంట్రుకలు, ఒడిబియ్యం, కోరికల నివేదన అన్నీ ఆ అమ్మతోనే… మరి జాతర ఈ అంధులకు ఎందుకు ఏదో సాదాసీదా తెలంగాణ వార్తలా మాత్రమే కనిపిస్తున్నది..? ఈ క్లిప్పింగ్ చూడండి…
తెలంగాణ ముఖ్యమంత్రి జాతరకు హాజరైన ఫోటో ప్లస్ జాతరలో తల్లులకు ప్రణమిల్లుతున్న భక్త జనం ఫోటో… సాక్షి ఫస్ట్ పేజీ బ్యానర్… మరి ఆ వివేచన, విజ్ఞత, విచక్షణ ఏపీ ఎడిషన్‌కు వచ్చేసరికి ఎందుకు లోపించింది..? ఆంధ్రజ్యోతి నిండా ఆ రాజకీయ మురికి తప్ప ఇంకేమీ కనిపించలేదు… ప్రతి పేజీ నుంచీ అదే దుర్వాసన…
20-22 ఏళ్ల క్రితం… వరంగల్ ఈనాడు డెస్క్, రిపోర్టర్లతో రామోజీరావు భేటీ… అప్పట్లో ఆయన ప్రతి ఎడిషన్ సెంటర్ తిరిగీ, జిల్లాల వారీగా ప్రతి 3 నెలలకోసారి సమగ్రంగా సమీక్షించేవాడు… ఎవరో సబ్ ఎడిటర్ మేడారం జాతర గిరిజనానికి ఎందుకు విశేషమో సంక్షిప్తంగా చెప్పాడు ఆయనకు… అన్నీ విన్న ఆయన సింపుల్‌గా ఈసారి ఫుల్ కవరేజీ ఇద్దాం, ఏర్పాట్లు చేసుకొండి అన్నాడు… ఒక్క ఘడియ కూడా సందేహించలేదు, ఆలోచించలేదు…
వెంటనే తనే అంతగా జనం వస్తారంటున్నారు కదా, హెలికాప్టర్ నుంచి ఫోటో తీయిద్దామా అనడిగాడు… దటీజ్ రామోజీరావు… ఒక్క జాతర ఫోటో కోసం హెలికాప్టర్ ఎంగేజ్ చేద్దామా అన్నాడంటే అప్పట్లో ఈనాడు స్టాండర్డ్ అర్థం చేసుకోవాలి… తరువాత ప్రతి రెండేళ్లకు ఈనాడు మేడారం జాతర కవరేజీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది… జాతర పాపులారిటీ పెరగడంలో ఈనాడు పాత్ర కూడా తక్కువేమీ కాదు… మరి ఆనాటి ఈనాడు ఇప్పుడు ఎందుకిలా భ్రష్టుపట్టింది..? (ఆనాటి భేటీలో నేనున్నాను కాబట్టే సాధికారంగా రాస్తున్నాను…) సమ్మక్క ఆ రాధాకృష్ణను, ఆ రామోజీరావును, ఆ జగన్‌ను, ఆంధ్రా చానెళ్ల యజమానులను క్షమించుగాక…)
Share this Article