Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

NTR, SVR, జానకి… అందరివీ అవి తొలి అడుగులే… నో సీనియర్స్…

February 25, 2024 by M S R

Jayanthi Puranapanda …..  మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు ప్రధానంగా ఉన్న సినిమాలే తీస్తారు. అడపాదడపా కథానాయికల చుట్టూ కథలు అల్లుతుంటారు.

అలాగే అవార్డులు కూడా ఎక్కువ భాగం మగవారికే వస్తాయి…
వారు బాగా నటించినా, నటించకపోయినా కూడా.
దాదా సాహెబ్‌ ఫాల్కే, భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య…
ఇత్యాదులు.


ఇక –
మన బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల నాటి నుంచి నేటి వరకు పరిశీలిస్తే…
వాస్తవానికి కథానాయకుల కంటె కథానాయికలే చాలా సహజంగా, అందంగా నటించారు.
ఇది గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి.
కాని వాళ్లకి ఏనాడూ ప్రాధాన్యత దక్కలేదు.
దక్కగపోగా ఆ కథానాయకుడి పక్కన ఈ కథానాయిక వేసింది… అంటూ ఈవిడను తక్కువ చేయటం కూడా చూస్తూనే ఉన్నాం.

Ads


ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు వచ్చిందంటే…
ఇటీవల కొన్ని రోజులుగా “షావుకారు” సినిమాకు సంబంధించిన ఒక పోస్టరు చక్కర్లు కొడుతోంది.
‘‘1950 సం.లో చందమామ కథల పుస్తకంలో వచ్చిన ‘షావుకారు’ సినిమా ప్రకటనలో జానకి గారు. ఆమెకు మొదటి సినిమా అయినప్పటికీ, అప్పటి సినిమా ప్రకటనలో, సీనియర్‌ నటులను కాదని, కేవలం జానకి గారి చిత్రం మాత్రమే ముద్రించారు దర్శకులు ఎల్‌. వి. ప్రసాద్‌గారు’’………
ఇదీ ఆ పోస్టర్‌ మీద రాసిన మాటలు.
ఇది ఎవరు రాశారో తెలీదు కానీ…
రాసినవారిది అజ్ఞానమో…
రాసినవారికి షావుకారు జానకి మీద అసూయాద్వేషాలో…
రాసినవారికి గాసిప్స్‌ అంటే ఇష్టమో…
కారణం ఏమిటో తెలీదు కానీ…
ఇందులో ఎంత అవాస్తవం ఉందో ఒకసారి పరిశీలిద్దాం.


ఈ చిత్రానికి ముందర ఎన్‌. టి. ఆర్‌. ‘మనదేశం’ అనే ఒకే ఒక్క సినిమాలో అతి చిన్న పోలీసు పాత్ర పోషించారు. అలాగే ఎస్‌. వి. రంగారావు ‘వరూధిని’ చిత్రంలో నటించి, ఆ సినిమా అపజయం పాలు కావడంతో, ధవళేశ్వరం వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు.
అదిగో సరిగ్గా ఆ సమయంలో విజయావారి బ్యానర్‌ మీద ఈ సినిమా తయారయింది.
కొత్త తారాగణంతో ఈ సినిమా రూపొందించారు.
ఎన్‌. టి. ఆర్‌ హీరోగా నటించిన మొదటి సినిమా షావుకారు.
జానకి కథానాయికగా నటించిన తొలి చిత్రం షావుకారు.
కొద్దిగా పెద్ద పాత్ర, గుర్తింపు కలిగే పాత్రలో ఎస్‌. వి. రంగారావు కనిపించిన తొలి సినిమా షావుకారు.
అంటే…
జానకి సరసన తొట్టతొలి కథానాయకుడు ఎన్‌.టి.ఆర్‌
అలాగే
ఎన్‌.టి.ఆర్‌ సరసన మొట్టమొదటి కథానాయిక జానకి.
ఇప్పుడు చెప్పండి…
ఇందులో సీనియర్‌ నటులు ఎవరు?
ఎన్‌.టి.ఆర్‌., ఎస్‌.వి.ఆర్‌. జానకి
ముగ్గురూ కొత్తగా అడుగుపెట్టినవారే.
ఇందులో సీనియర్, జూనియర్‌ అనే ప్రసక్తే లేదు.
అందరూ సమానులే.
కానీ


ఈ చిత్రం తరువాత ‘శంకరమంచి’ జానకి పేరు, ‘షావుకారు’ జానకిగా స్థిరపడిపోయింది.
కంచుకంఠంతో, అమాయకత్వంతో ఎంతో హృద్యంగా నటించారు షావుకారు జానకి.
ఈ సినిమా పోస్టరు మీద –
విజయా వారి షావుకారు (ఇరుగుపొరుగుల కథ)
నిర్వాహకులు: నాగిరెడ్డి, చక్రపాణి
దర్శకత్వం: ప్రసాద్‌
అని ఉంది.
ఎవ్వరి పేర్లు లేవు.
ఆనాటి చిత్రాలన్నీ దర్శకుని చిత్రాలు, నిర్మాతల చిత్రాలే.
ఇటువంటి పోస్టర్లు విడుదలైనప్పుడు
సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్టులు కాస్తంత స్పందించి, ఈ విధంగా రాసిన వారికి చురకలు వేయకపోతే..
ఇంకా ఈ చిత్రాలు కథానాయకుల వల్లే విజయవంతమయ్యాయి అని స్థిరపడిపోతుంది.
కథానాయికలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, హాస్య పాత్రలు…
ఇంతమంది సహకారం లేనిదే కథానాయకుడు ఒంటరిగా గొప్పవాడు కాదు.


ఇక్కడ అసందర్భమైనప్పటికీ… ఒక విషయం ప్రస్తావించక తప్పదు…
శ్రీమతి భానుమతి…
మంచి గాయని, మంచి నర్తకి, మంచి నటి, మంచి రచయిత్రి, మంచి నిర్మాత, మంచి దర్శకురాలు, మంచి స్డూడియో అధినేత…
ఇన్నిరకాలుగా బహుముఖ ప్రజ్ఞ ఉన్న భానుమతిని అతి కష్టం మీద పద్మశ్రీతో సత్కరించుకున్నాం.
ఆమెకు సాటి రాగలవారు ఒక్కరైనా ఉన్నారా?
ఒక్కరు కూడా లేరు…
ఎటువంటి బహుముఖీనత లేని కథానాయకులంతా..
దాదాసాహెబ్, భారత రత్న వంటి పెద్ద పెద్ద అవార్డులు అందుకుంటున్నారు.
ఒక్కసారి ఆలోచించండి.
ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.
ఒక్కసారి మనసుకి పట్టిన మసిని తుడిచి, స్వచ్ఛమైన మనసుతో చూడండి.
ఇది ఎవరినో నొప్పించడానికో, మెప్పించడానికో రాసినది కాదు.
ఒక సినిమా ప్రేక్షకురాలిగా ఇది నా ఆవేదన…. డా. పురాణపండ వైజయంతి 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions