ఒకటి మాత్రం నిజం… దేశభక్తి, యుద్ధం, సరిహద్దులు గట్రా అనగానే మన సినిమాలు ఆర్మీ సాహసాల గురించే చూపిస్తుంది, మాట్లాడుతుంది… కానీ దేశరక్షణ అంటే కేవలం ఆర్మీ మాత్రమే కాదు… నేవీ, ఎయిర్‌ఫోర్స్ కూడా… ఇప్పుడు వాటితోపాటు సైబర్ అటాక్స్, ట్రేడ్ వార్, విదేశాంగ వ్యవహారాల యుద్ధం కూడా… అంతేనా..? రాబోయే రోజుల్లో స్టార్ వార్స్, వెదర్ వార్, ఇంటర్నేషనల్ నదీప్రవాహాల వార్, బయో వెపన్స్ వార్… ఎస్, యుద్ధం ఇకపై బహుముఖం, సంక్లిష్టం…
సరే, ఆ చర్చ వద్దులెండి గానీ… అప్పుడప్పుడు మాత్రమే ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ సాహసాలు, కమిట్మెంట్, ఆపరేషన్స్ గుర్తొస్తాయి మనకు… ఏ అభినందనో పట్టుబడినప్పుడు..! లేదా బాలాకోట్ స్ట్రయిక్స్ వంటి తీవ్ర ప్రతీకార చర్యలు చోటుచేసుకున్నప్పుడు… ఎస్, వరుణ్ తేజ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ కూడా ఇలాంటిదే… జవాన్లను బలిగొన్న పుల్వామా ఉగ్ర ఘాతుకం నేపథ్యంలో మన ఎయిర్ ఫోర్స్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేది స్టోరీ పాయింట్…
స్థూలంగా చూస్తే సూపర్ స్టోరీ లైన్… పైగా ఇప్పుడు బాలీవుడ్‌లో పాట్రియాటిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది… మొన్నామధ్య హృతిక్ రోషన్ కూడా ఎయిర్ వార్ నేపథ్యంలోనే ఫైటర్ సినిమా చేశాడు… తెలుగులో ఇలాంటిది ఇదే తొలిసారి… ఎయిర్ వార్ మాత్రమే కాదు, టాలీవుడ్ అసలు ఎప్పుడూ ఇలాంటి సబ్జెక్టుల జోలికి పోదు… ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రల్ని చేయడానికి ఇష్టపడే, భిన్న కథానాయకుడు వరుణ్ తేజకు ఈ దిశలో అభినందనలు…
Ads
తన ఆకారం కూడా భలే సూటయింది ఓ వింగ్ కమాండర్ పాత్రకు… ప్రపంచస్థాయి అందగత్తె మానుషి చిల్లర్‌కు హీరోయిన్‌గా రాడార్ ఆఫీసర్‌గా మంచి ప్రాధాన్యమున్న పాత్ర ఇచ్చారు… బాగుంది, బాగానే చేసింది… చాలా తక్కువ ఖర్చుతోనే కాస్త బెటర్ ఔట్‌పుట్ తీసుకోగలిగారు… జెట్ ఫైటర్స్ విన్యాసాలను తీయడం కష్టం… అందుకే మన సినిమా వాళ్లు ఆర్మీ కథలకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప ఎయిర్, నేవీ వార్స్ మీద దృష్టి పెట్టరు… వ్యయం, ప్రయాస అధికం కాబట్టి…
ఇక ఆపరేషన్ వాలంటైన్ విషయానికి వస్తే… సినిమా అన్నాక ఓ హీరో ఉండాలి, ఓ హీరోయిన్ ఉండాలి, ఆ లవ్ స్టోరీ ఉండాలి అనే ఫిక్స్‌డ్ అభిప్రాయం బలంగా ఉన్నట్టుంది… దాంతో ఫస్టాఫ్ కథనం పెద్ద గ్రిప్పింగ్‌గా ఉండదు, పైగా వరుణ్ తేజ, మానుషి మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా పండలేదు… దానికి కారణం కథాకథనలోపాలే… ఆ ప్రేమకథలో గాఢత లేదు, ఘర్షణ కూడా లేదు… నిజానికి ఇలాంటి సినిమాల స్టోరీ లైన్‌ను బట్టి నేరుగా పుల్వామా, ఎయిర్ స్ట్రైక్స్, స్ట్రాటజీస్ పైనే ఉంటే బాగుండేదేమో… సినిమాలో కామెడీ ట్రాక్ కూడా ఏమంత బాగా లేదు…
దర్శకుడు శక్తిప్రతాప్ వీలైనంతవరకు సినిమా కథను బాగానే నడిపించడానికి ప్రయత్నించాడు గానీ, పెద్దగా ఎమోషనల్ సీన్లు లేవు… మిక్కీ జే మేయర్ నేపథ్యసంగీతం కొంతవరకు మాత్రమే బాగుంది, అది ఎఫెక్టివ్‌గా ఉండి ఉంటే సీన్లు మరింత ఎలివేటయ్యేవి… అవునూ, హీరో అన్నాక తప్పకుండా సీనియర్ల ఆదేశాలను ధిక్కరిస్తూ, తన మానాన తాను పనిచేసుకుంటూ పోవాలా..? కీలకమైన ఆపరేషన్లకు మళ్లీ తనే దిక్కుగా కనిపించాలా..? దర్శకుడు గనుక కథ మీద, ఎమోషనల్ సీన్ల మీద మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా మరో రేంజ్‌లో ఉండేదేమో…
మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నా సరే… ఈ సినిమా వరుణ్ తేజ రేంజ్‌ను తప్పకుండా పెంచేదే… తనను బాలీవుడ్‌కు పరిచయం చేసింది… గుడ్ స్టార్ట్… సినిమా కథ నేపథ్యం కూడా భిన్నమైంది… ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా సహకరించడంతో ఆ టర్మినాలజీ, ఆ లోకేషన్లు కూడా బాగా వచ్చాయి సినిమాలో… మనం చూస్తున్నది రొటీన్ రొడ్డకొట్టుడు తెలుగు సినిమా కాదు అనే ఫీల్ కూడా సినిమా నడుస్తున్నంతసేపూ ఉంటుంది… అదే ఈ సినిమా ప్లస్ పాయింట్… సరైన హిట్ కోసం చాన్నాళ్లుగా వేచిచూస్తున్న వరుణ్ తేజకు ఈ సినిమా కలిసొచ్చినట్టేనా..? జవాబు కష్టమైన ప్రశ్న ఇది..!!
Share this Article