రేవంత్ మంచి స్ట్రాటజిస్టు..! వేదిక మీద మోడీకి అభివాదం చేసి, తన ప్రసంగంలో కూడా నాలుగు సానుకూల వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద సోషల్ మీడియాలో కనిపించిన ఓ వ్యాఖ్య ఇది…
‘మోడీతో సత్సంబంధాలు’ అనే కోణంలో రేవంత్‌రెడ్డి ధోరణి ఏమిటనే ప్రశ్నకు ఎవరి బాష్యాలు వారికి ఉండవచ్చుగాక… కానీ ఒక్కసారి స్థూలంగా పరిశీలిద్దాం… రేవంత్‌రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి… నరేంద్రమోడీ ఈ దేశానికి ప్రధాని… ప్రధానిని ముఖ్యమంత్రులు కలవాలి, అడగాలి, సాధించాలి,.. కేంద్రం- రాష్ట్రాల నడుమ ప్రొటోకాల్ అధికారిక సత్సంబంధాలు అవసరం… ఉండాలి… అది రాజనీతిజ్ఞత… విజ్ఞత…
ఉదాహరణకు… ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్… తనకు రాష్ట్రంలో ప్రధాన వైరిపక్షం బీజేపీయే… ఐనాసరే, ఎప్పుడూ ప్రధాని మోడీతో గిల్లికజ్జాలు పెట్టుకోలేదు… మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు అమర్యాదగా వ్యవహరించలేదు… రాజకీయాలు వేరు- అధికారిక సంబంధాలు నెరపడం వేరు… వాటి మధ్య సరైన రేఖను గుర్తించేవాడే అసలైన నాయకుడు…
Ads
కేంద్రం అంటే మోడీ కాదు… కేంద్రం అంటే ప్రధాని, కేంద్ర మంత్రివర్గం… అక్కడ మోడీ స్థానంలో ఇంకెవరైనా ఉండొచ్చు… మోడీని రాజకీయంగా గౌరవించాల్సిన పనేమీ లేదు, వ్యతిరేకించినా ప్రజాస్వామిక వ్యవస్థలో ఇబ్బందీ లేదు… నిజానికి కొన్ని విషయాల్లో వ్యతిరేకించినా తప్పు లేదు… కానీ ప్రధానిని గౌరవించాలి… ఇదే మోడీ ప్రధాని హోదాలో తమిళనాడుకు వచ్చినా, కేరళకు వచ్చినా అక్కడి ముఖ్యమంత్రులు తనను కించపరిచేలా మాట్లాడరు, వ్యవహరించరు…
కానీ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండేది..? కేంద్రం అంటే అదేదో వేరే శత్రుదేశం అన్నట్టుగా వ్యవహరించేవాడు కేసీయార్… అంతేకాదు, గతంలో చంద్రబాబు కూడా అలాగే… తను ప్రధాని మోడీ మీద వ్యక్తిగత నీచ వ్యాఖ్యలు కూడా చేశాడు, అనుభవించాడు… మళ్లీ అదే మోడీ ప్రాపకం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా దేబిరించాడు… సరే, అది వేరే సంగతి…
ఎవరో ఒక ఎమ్మెల్సీ నియామకాన్ని ఆపేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై మీద కక్షకట్టాడు కేసీయార్… కలవడు, మాట్లాడడు, ఎవరినీ ఆమె దగ్గరకు పోనివ్వడు, మర్యాద లేదు, మన్నన లేదు, పైగా ఆమె మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవాళ్లు ఆ పార్టీ నాయకులు.,. ఆమెను ఎంతసేపూ బీజేపీ ప్రతినిధిగా చూశాడు తప్ప కేంద్రం ప్రతినిధిగా చూడలేదు… ఒక లేడీ గవర్నర్‌ను ఇన్నిరకాల అవమానించిన సీఎం బహుశా కేసీయార్ ఒక్కడేనేమో…
మోడీ వచ్చినా, కేంద్రం నుంచి ఇంకెవరు వచ్చినా… జస్ట్, అలా తలసానిని పంపించేవాడు… ఓ బొకే ఇచ్చి స్వాగతం పలికేవాడు ఆ మంత్రి… అంతే… ఎవరో బీజేపీ నాయకుడు వస్తున్నాడనే తరహాలోనే చూసేవాడు… సరే, బీజేపీపై రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు, బీజేపీ పెద్ద నేతల్ని బజారుకు లాగడానికి ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ డ్రామాతో చేసిన ప్రయత్నాలు మళ్లీ మళ్లీ చెప్పుకోవడం అనవసరం… మళ్లీ ఇప్పుడు బీజేపీయే కావాలి, పొత్తు కోసం ఢిల్లీతో రాయబేరాలు కావాలి…
ఈ ప్రహసనాలు, ఈ వైఫల్య అధ్యాయాలు గాకుండా… రేవంత్‌రెడ్డి స్ట్రెయిట్‌గానే ఉన్నాడు… కేంద్రంతో మాకు సత్సంబంధాలు కావాలి అంటున్నాడు… కేంద్రంతో ఘర్షణ అవసరం లేదంటున్నాడు… గవర్నర్ తన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది… ఎస్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ బద్ద వైరి పక్షాలు… సో వాట్..? అది రాజకీయం… లోకసభ ఎన్నికల ప్రచారానికి వస్తే రేవంత్‌రెడ్డి మోడీ మీద విమర్శలు చేస్తాడు, అదే మోడీ ఎన్నికల ప్రచారానికి వస్తే కాంగ్రెస్‌నూ ఆడిపోసుకుంటాడు… కానీ సీఎంగా రేవంత్, పీఎంగా మోడీ నడుమ ఆ దూరం అక్కర్లేదు..! అలా చేస్తే ఇక రేవంత్‌కూ కేసీయార్‌కూ తేడా ఏముంటుంది..?
అబ్బే, రేప్పొద్దున కాంగ్రెస్ తనను ఎన్నాళ్లు సీఎంగా ఉంచుతుంది…? సీనియర్ల నుంచి ఎప్పుడూ ముప్పు వేలాడుతూనే ఉంటుంది… అందుకని ఎందుకైనా మంచిదని మోడీతో బాగుంటున్నాడు అనే వ్యాఖ్య కూడా వినిపిస్తోంది… ఐనాసరే, సో వాట్..? రేవంత్‌రెడ్డి కూడా రాజకీయ నాయకుడే కదా..!!
కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, బంధుప్రీతి అని మోడీ విమర్శిస్తే…, వెంటనే మంత్రి జూపల్లి ఆ వ్యాఖ్యల్ని ఖండించాడు… దేని లెక్క దానికే…!!
Share this Article