Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదుగో… ఈ మగానుభావులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు…

March 8, 2024 by M S R

Sai Vamshi ….   ఈ మహానుభావులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…

“ఆడాళ్లు ఏం రాసి పుస్తకాలు వేసినా అందరూ ఎగబడి కొంటారు. మగాళ్లు రాస్తే ఎవరు కొంటారు?” అని మనసారా నమ్మి, దాన్నే ప్రచారం చేసే కొందరు మగ రచయితలకీ..

Feminism గురించి ఏమీ తెలియకపోయినా, ఫెమినిస్టులను ద్వేషించడమే మొగతనం అని నమ్మే అమాయకపు విద్యావంతులకు..

Ads

“హీరోలకు, ప్రొడ్యూసర్‌లకు ‘ఆ పని’ చేయకుండా హీరోయిన్లు ఆ స్థాయికి వెళ్లరు. ఈ స్టార్ హీరోయిన్లంతా ఇంతేనెహే!” అని తీర్మానించే సినీ మహా ప్రేక్షకులకు.

“I love my Mummy” అని వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి, కర్చీఫ్ నుంచి కడ్రాయర్ దాకా ఉతికించుకునే పుత్రరత్నాలకు..

“అమ్మ తర్వాత అమ్మలాంటిది మా అక్క” అంటూనే ఆదివారం వండాల్సిన చికెన్ బిర్యానీ గురించి శుక్రవారం నాడే ఆర్డర్ ఇచ్చే ప్రియమైన తమ్ముళ్లకీ..

“నా భార్యను ఎంతదాకానైనా చదివిస్తాను” అంటూనే కాళ్లకు మెట్టెలు, మెళ్లో తాళి కాలేజీలో అందరికీ కనబడేలా వేసుకో అని హెచ్చరించే భర్తా మాణిక్యాలకు..

“కాలం మారింది. ఇప్పుడు ఆడాళ్లూ ఉద్యోగం చేయాలి” అంటూనే భార్య ఏటీఎం కార్డును తన వద్దే ఉంచుకునే పతిదేవుళ్లకీ..

“ఇంటి పనుల్లో మా వైఫ్‌కి చాలా హెల్ప్ చేస్తాను” అంటూ ఏడాదికోసారి బెడ్రూం బూజు దులిపే పెనిమిటులకీ..

“I am so Modern” అంటూనే భార్య ఆధార్ కార్డులో ఆమె పేరు ముందు తన ఇంటిపేరు ఎక్కించే వంశోద్ధారకులకీ..

“నా వంశాంకురం అని కొడుకును ముద్దాడుతూ, వాడు సుస్సూ‌ పోయగానే భార్య వంక చూసి డైపర్ మార్చమనే” ఉత్తమ తండ్రులకీ..

‘అన్నాచెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం’ అని పాటలు పాడుతూనే అక్కాచెల్లెళ్ళకు ఆస్తి పంచివ్వక కోర్టుల చుట్టూ తిరిగే అన్నలకు..

“నా కూతుర్ని మగాడిలా పెంచాను” అని ఊరంతా చెప్పుకుంటూనే కూతుళ్ల మొబైల్ ఫోన్ల మీద కన్నేసి ఉంచే పితామహులకీ..

“ఆడపిల్లల్ని మరింత ఎదగనివ్వాలి” అని ఫ్రెండ్స్ దగ్గర గప్పాలు కొడుతూ, కొడుకును ప్రైవేటు, కూతుర్ని గవర్నమెంట్ కాలేజీల్లో చేర్చే తండ్రులకీ..

రోజంతా గంటలకొద్దీ ఊరంతా తిరిగినా సరే, అమ్మమ్మ/ నాన్నమ్మలను బ్యాంకు దాకా తీసికెళ్లడానికి మాత్రం టైం లేని ముద్దుల మనవళ్లకీ..

“పోయి పోయి ఆడదాని కింద పని చేయాలా? అబ్బబ్బా” అని అల్లాడిపోయే మగ ఉద్యోగులకీ..

“మా ఆఫీసులో ఆడామగా కలిసి పనిచేస్తారు” అంటూనే ఆడవాళ్ల శక్తి సామర్థ్యాల మీద అడ్డమైన జోకులు వేసి ఆనందించే పురుషోద్యోగులకీ..

“ఆడ ఉద్యోగులతో జాగ్రత్త! మనం మగాళ్లం ఏమీ అనకపోయినా సరే, మీద పడి ఏదో చేశారని కంప్లైంట్ ఇస్తారు” అని ఉద్యోగులకు హితబోధ చేసే బాస్ పుంగవులకీ..

“ఆడాళ్ళకు రోజంతా ఇంట్లో ఏం పని ఉంటుందండీ? తినడం, ఆ సీరియళ్లు చూడటం” అని ఉల్లాసంగా కొలీగ్స్ ముందు పళ్లు ఇకిలించే మగమహారాజులకీ..

“సంస్కృతి సంప్రదాయాలు మన విలువలు” అని ప్రవచనాలు వింటూ కొడుకు పెళ్లికి ఆడపెళ్లి వాళ్ల నుంచి ఎంత కట్నం గుంజాలా అని యోచించే మహారాజశ్రీ మామగార్లకీ..

మగవాడి చెయ్యి పట్టుకుని అమ్మాయి రోడ్డు మీద నడవగానే ‘కాలం చాలా చెడిపోయింది. ఛ’ అని లోలోపల కుమిలిపోయే వయోవృద్ధులకీ..

సెల్‌ఫోన్ ఎక్కువగా మాట్లాడే అమ్మాయి తిరుగుబోతు అని, ముఖానికి స్కార్ఫ్ కట్టుకునే అమ్మాయి మోసగత్తె అని నమ్మే కాలేజీ కుర్రోళ్లకీ..

“ఆడవాళ్ల వల్లనే లవ్ ఫెయిల్యూర్స్” అని ప్రచారం చేసే లవ్ గురూలకు..

“నా లవర్ వల్లే నా జీవితం సంకనాకిపోయింది” అని తన మందు అలవాటుకు కారణం వెతికే అభగ్న ప్రేమికులకు..

“ఇద్దరాడవాళ్లు పెళ్లి చేసుకోవడం ఏమిటీ? కలికాలం కాకపోతే” అని బాహాటంగా ఫేస్బుక్ కామెంట్లు కొరుక్కునే అసామాన్య సంప్రదాయవేత్తలకు, “పెళ్లి మీరు చేస్కోండి. శోభనం నేనొచ్చి చేసి పెడతా” అని నీచాతినీచంగా మాట్లాడే ముసుగు వీరులకి..

భాష, రాష్ట్రం తేడా లేకుండా.. తనకు నచ్చిన బట్టలు వేసుకునే ఆడవాళ్లను ఘోరంగా కామెంట్ చేసే దేశద్రోహులకీ, వాళ్లని వారించకుండా తప్పు చేసే వాళ్ల మిత్రులకీ, వీళ్లని నిరోధించలేని వాళ్ల పెద్దలకీ..

ప్రపంచంలో ప్రతి మహిళా 36-24-36 కొలతల్లో, తళతళలాడే రంగులో ఉండాలని భావించి, ప్రతిచోటా బాడీ షేమింగ్‌కు పాల్పడే అధ్వాన జీవులకీ..

“ఆడవాళ్ల వస్త్రధారణ‌ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాల వల్ల అవి తగ్గుతాయి. భర్తకు వండిపెట్టని భార్య వచ్చే జన్మలో కుక్కలా పుడుతుంది” లాంటి చెత్త వాగుడు వాగే గౌరవనీయులకీ..

“ఆడ, మగ కలిసి ఒక రిలేషన్‌లో ఉండటం వాళ్ల వ్యక్తిగత విషయం” అని ఆలోచించక, వాళ్ల మానాన వారిని వదిలేయక, వాళ్ల జీవితాల గురించి తీర్పులు తీర్చే జనానికి, ఆ తీర్పులకు మద్దతు తెలిపే ప్రజానీకానికి..

“ఆడది తిరిగి చెడుతుంది. మగాడు తిరక్క చెడతాడు, ఆడదానికి ఆడదే శత్రువు..” లాంటి దిక్కుమాలిన సామెతల్ని నిషేధించాలని డిమాండ్ చేయని భాషావేత్తలకీ..

“ఆడవాళ్లు నైటీలు వేసుకోవాలా, వద్దా” అనే అంశంపై వీడియోలు చేసి లక్షల వ్యూస్ తెచ్చుకుంటున్న యూట్యూబ్ ఛానెళ్లకీ..

“జనాన్ని నవ్విస్తున్నాం” అనే ముసుగులో ఆడవాళ్ల మీద దారుణమైన కామెంట్లు చేసే కొన్ని కామెడీ ప్రొగ్రాంలకీ..

“ఆడదై ఉండి సరోగసీ విధానంలో బిడ్డల్ని కనడం ఏమిటి? పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉండగా ఈ వయసులో మరో పెళ్లి ఏమిటి? పెళ్లయినా కూడా ఇంకా తండ్రి ఇంటిపేరు ఉండటం ఏమిటని” చెత్త చెత్త ప్రశ్నలు వేసి లేనిపోని దీర్ఘాలు చేసి నెటిజన్లకీ.. వీళ్లందరికీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. – విశీ (వి.సాయివంశీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions