జాతీయ పార్టీలను వదిలేస్తే… ప్రాంతీయ పార్టీల కోణంలో… కేవలం ఆయా పార్టీల అధినేతలు, కుటుంబాల అవసరాలను బట్టి సిద్ధాంతాలుంటయ్… రాజీలుంటయ్… కాళ్ల బేరాలుంటయ్… సాగిలబడటాలుంటయ్… ఏసీబీలు, ఈడీలు, సీబీఐలు కన్నెర్ర చేస్తే నడుంలు మరింత వంగిపోతయ్… పొత్తులకూ అంతే… ఎవరి అవసరం వాళ్లది… చివరకు జాతీయ పార్టీలు సైతం నంబర్లాటలో పైచేయి కోసం ప్రాంతీయ పార్టీలో ‘కుమ్మక్కు’ కావడం మన రాజకీయ విషాదం…
చంద్రబాబు వంటి అత్యంత విశ్వాసరహితుడితో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏమిటనేది తాజా ప్రశ్న… పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు జవాబు చెప్పడానికి..! అంతకుముందు ఇదే నరేంద్ర మోడీపై గుజరాత్ అల్లర్ల సమయంలో చంద్రబాబు విరుచుకుపడ్డాడు… ఎలాగూ తన అవసరం ఉంది కాబట్టి వీర సెక్యులర్ అనే ముద్ర కోసం మోడీని సీఎంగా దింపేస్తే తప్ప కూటమిలో ఉండనుపో అన్నాడు… సీన్ కట్ చేస్తే, అదే మోడీతో పొత్తు పెట్టుకున్నాడు… అప్పట్లో తెలుగుదేశం అవసరం మోడీకి ఉంది, వెంకయ్యనాయుడు దౌత్యం కుదిరింది…
సో, చంద్రబాబు-మోడీ దోస్తీ అవసరాన్ని బట్టి తెగదెంపులు, కొత్త పొత్తులు తరహాలో సాగుతూనే ఉంది… ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది అనుకున్నాడో చంద్రబాబు మోడీని ఇష్టమొచ్చినట్టుగా తూలనాడాడు… అది చంద్రబాబు నైజం… మళ్లీ అదే చంద్రబాబు అయిదేళ్లుగా మోడీ కరుణ కోసం వెంపర్లాడాడు… ఒక్క ముక్క కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు… ఎందుకు..?
Ads
జగన్ జేసీబీలు, సంకెళ్లు పట్టుకుని వెంటపడ్డాడు… గ్రామ స్థాయి వరకూ తెలుగుదేశం కేడర్‌పై కక్షసాధింపులు, కేసులు, దాడులు… తెలుగుదేశానికి సపోర్టింగ్ ఫైనాన్సియల్ పిల్లర్లను కూల్చే పనిలో పడ్డాడు… ఏవేవో కేసులు పెట్టి చివరకు చంద్రబాబును జైలులో కూడా పెట్టాడు, రామోజీని లిఫ్ట్ చేయడానికీ ఆలోచించాడు… సో, కనీసం కేంద్ర ప్రభుత్వం మద్దతయినా ఉంటే తప్ప మనుగడ కష్టమనే స్థితిలోకి జారిపోయాడు చంద్రబాబు… మళ్లీ జగన్ గెలిస్తే ఇక పరిస్థితి ఏమిటో ఊహించుకుని చంద్రబాబుకు వణుకు…
పార్టీ మనుగడే కష్టం… తనకు మళ్లీ జైలు తప్పదు… ఈసారి లోకేష్ జైలూ గ్యారంటీ… సో, మోడీ మద్దతు అత్యవసరం… మళ్లీ కేంద్రంలో బీజేపీదే అధికారం అనే సర్వేల నేపథ్యంలో… బీజేపీ ఏది చెప్పినా వినడానికి సై అన్నాడు… ఇది తన అవసరం… మరి బీజేపీకి..?
ఏపీలో తమకు వోట్లు లేవు… సీట్లూ రావు… ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా జనంలోకి దూకుడుగా వెళ్లి పార్టీని విస్తరించే నాయకుడు లేడు… అసలు ఏపీలో పార్టీ ఉనికే నామమాత్రం… ఈ స్థితిలో రెండుమూడు లోకసభ సీట్లు దొరికితే బెటరే కదా… అసెంబ్లీ సీట్ల మీద ఎప్పటిలాగే బీజేపీకి పెద్ద పట్టింపు లేదు, సొంతంగా ఎదిగే సీన్ లేనప్పుడు చంద్రబాబుతో రాజీపడి ఏవో కొన్ని సీట్లకు ఆశపడటమే బెటర్ అనుకుంది బీజేపీ… అంతే…
మరి జనసేన..? నిజానికి పవన్ కల్యాణ్ కాస్త తెలివిగా తన పార్టీని గనుక నడిపి ఉంటే తెలుగుదేశం, వైసీపీ నడుమ గ్యాప్‌లోకి దూరగలిగేది… కానీ ఈరోజుకూ పార్టీ నిర్మాణం లేదు, ఓ ఎజెండా లేదు, చంచలమైన భావాలు… కార్యకర్తలకూ అభిమానులకూ నడుమ తేడా ఈరోజుకూ తెలియదు… గత ఎన్నికల్లో అత్యంత చేదు అనుభవాలు… ఈ స్థితిలో తనను ఇన్నాళ్లు ఆర్థికంగా, హార్దికంగా మద్దతుగా నిలిచిన చంద్రబాబుతో కలిసి నడవాలని అనుకున్నాడు… సొంతంగా పోటీచేస్తే మళ్లీ ఏం జరుగుతుందో తనకు తెలుసు… ః
మరి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అవసరం ఏమిటీ అంటారా..? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు… ఎంతోకొంత తనకు కన్సాలిడేట్ కావాలి… అందుకే పవన్ కల్యాణ్ కావాలి, ఒక్కసారి అధికారం వచ్చిన తరువాత ఏ ఆటలు ఆడినా నడుస్తుంది… వీలైతే పవన్ కల్యాణ్‌ను లోకసభకు పంపే దిశలో ఒత్తిడి తెస్తాడు… అంతెందుకు..? పవన్‌కు ఇచ్చిన సీట్లలో టీడీపీ రెబల్స్ రంగంలో ఉన్నా ఆశ్చర్యపోవద్దు…
30 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు బీజేపీ ప్లస్ జనసేనకు ఇస్తున్నట్టు చంద్రబాబు తన కోటరీకి చెబుతున్నాడు… అంటే అందులో 5 ఎంపీ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లు బీజేపీకి అట… ఆల్‌రెడీ 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు జనసేనకు అట… ఈ 24 + 3 రేషియో ఆల్రెడీ తెలిసిందే కదా… సో, ఏపీ పొత్తులు జస్ట్, అవసరార్థం దోస్తీలు… ఇవేవీ కాలపరీక్షకు నిలిచే దృఢమైన స్నేహాలేమీ కావు… ఆ విషయం ఆ మూడు పార్టీల ముఖ్యులకూ తెలుసు… ప్రజలకూ తెలుసు..! ఇదే చంద్రబాబు నాలుగురోజులకు మోడీ మీద మళ్లీ నోరుపారేసుకోవచ్చు… బీజేపీ తుడుచుకుని మళ్లీ బాబును హత్తుకోవచ్చు…!
చివరగా… ఇన్నేళ్లూ జగన్ బేషరతుగా మోడీకి మద్దతు ఇస్తుండగా, మోడీ తనకు ద్రోహం చేశాడని బెంగాలీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఓ ట్వీట్‌లో విమర్శించింది… స్థూలంగా చూస్తే అందరికీ అలాగే అనిపించవచ్చు… కానీ జగన్ ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చాడు..? బీజేపీ సిద్ధాంతాల కోసం కాదు, తన అవసరం కోసం… తనపై వేలాడుతున్న కత్తిని చూసి… మరి ఇన్నేళ్లూ మోడీ కాపాడుకుంటూనే వచ్చాడు కదా..!! చివరగా… ఈ పొత్తులు పొడిచింది కేవలం ఏపీ రాజకీయాల కోసం మాత్రమే సుమా… తెలంగాణకు సంబంధం లేదట… ఇవేం పొత్తులో..!!
Share this Article