కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే! తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్‌లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది.
సినిమాలో నటి అర్చన దాసి కమ్లిగా నటించగా, దొరగా భూపాల్‌రెడ్డి, దొరసానిగా రూపాదేవి నటించారు. దొర గడీలో ఉండే దాసీల్లో ఒకరు కమ్లి. దొర ఆమె మీద జరిపిన అత్యాచారం కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. ఈ విషయం దొరసాని అడిగినప్పుడు ఆమె చెప్తుంది. మొదట నరసింగరావు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఉన్న సన్నివేశం ఇదే!
ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందించింది ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎ.కె.మీర్. ఆయనతో ఈ సన్నివేశం గురించి నర్సింగరావు మాట్లాడుతున్నప్పుడు మొత్తం సంభాషణల మీదే ఆధారపడి ఆ సన్నివేశం జరుగుతున్నట్టు గమనించారాయన. దానికంటే ముందు మరేదైనా సన్నివేశం ఉండాలని, అందులో దాసి కమ్లి గర్భవతి అనే విషయం దృశ్యరూపంలో చూపిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
Ads
సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు సన్నివేశాలు మార్చడం, కొత్తవి రాయడం మామూలే అయినా, అప్పటికప్పుడు ఆ సన్నివేశం రాయడం నరసింగరావుకు సవాలుగా మారింది. వెంటనే ఆలోచించి ఒక సన్నివేశానికి రూపకల్పన చేశారు.
షూటింగ్ జరుగుతున్న చోటికి వచ్చి నటి అర్చనను పిలిచారు. కొత్తగా ఒక సన్నివేశం రాశానని, నేను చెప్పినట్టు చేయాలని అన్నారు. ఆమె సరేనన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. దాసి చేతిలో పాన్‌దాన్ (తాంబూలం పెట్టె) పట్టుకొని దొర గదికి వెళ్లే మెట్లు ఎక్కుతూ ఉంటుంది. రెండు మెట్లు ఎక్కగానే కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. అలాగే ఓర్చుకొని, మరో నాలుగు మెట్లు ఎక్కుతుంది. నొప్పి భరించలేక, చేతిలో పాన్‌దాన్ పక్కన పెట్టి, కడుపు పట్టుకొని గోడ చివరకు వస్తుంది. కడుపులో వికారంగా అనిపించి, వాంతి చేసుకుంటుంది. ఇంత సన్నివేశం చేయడం అర్చన లాంటి నటికి ఇబ్బంది కాదు. కానీ వాంతి చేసుకోవడం ఎలా? ఏడుపు, నవ్వు లాంటి భావాలైతే వస్తాయి కానీ, వాంతి ఎలా వస్తుంది? కష్టం కదా!
దానికి నరసింగరావు ఒక మార్గం చూపించారు. చుట్టూ ఉన్న వేపచెట్ల నుంచి కొన్ని ఆకులు తీసుకొచ్చి, ముద్దగా నూరి పెరుగులో ముంచి అర్చన నాలుక కింద పెట్టుకోమని చెప్పారు. ఆ ముద్ద నోట్లో పెట్టుకొంటే తప్పకుండా వాంతి వస్తుందని ఆయన నమ్మకం. ఆయన ఆలోచనే నిజమై, ఆ సన్నివేశం మొత్తం చేసిన అర్చన చివర్లో వాంతి చేసుకున్నారు. సినిమాలో ఆ సన్నివేశం అద్భుతంగా పండింది. ఆ ఏడాది జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకునేందుకు ఈ సన్నివేశం కూడా ఒక బలమైన కారణంగా మారింది.
ఒక్కోసారి సినిమాలో కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే! వాటి బలం వల్ల నటీనటుల ప్రతిభ తెలుస్తుంది. కథ ప్రేక్షకులకు మరింత ప్రభావవంతంగా చేరుతుంది… – విశీ
Share this Article