John Kora…. మరో వారం, పది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మరో మూడేళ్ల పదవీ కాలం ఉండగానే.. కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు.
ఆయన రాజీనామా చేస్తే వచ్చే నష్టమేంటి అని అందరూ అనుకోవచ్చు. నేను కాస్త వివరించడానికి ప్రయత్నిస్తాను.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్ద, స్వతంత్ర సంస్థ. అది దేశంలో ఎన్నికలను నిష్పక్షిపాతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈసీఐని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)తో పాటు ఇద్దరు కమిషనర్లు నడిపిస్తారు. సీఈసీతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను నియమించే అధికారం కేవలం ఒక కమిటీకి ఉంటుంది. ఇందులో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఈ కమిటీ ఏకాభిప్రాయంతో సీఈసీతో పాటు కమిషనర్లను నియమిస్తారు.
Ads
అయితే గతేడాది ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన కమిటీలో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి.. ఆ స్థానంలో కేంద్ర మంత్రిని రిప్లేస్ చేయడానికి ఒక బిల్‌ను ప్రవేశ పెట్టారు. ఆ బిల్లు అనేక వివాదాల నడుమ ఆమోదం పొందింది. దీంతో కొత్త చట్టం ప్రకారం ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉండే కమిటీ సీఈసీతో పాటు కమిషనర్లను నియమిస్తారు. అంటే అధికార పార్టీ తమ ఇష్టానుసారం సీఈసీ, కమిషనర్లను నియమించుకునే అధికారం ఉంది.
కట్ చేస్తే.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ ఉన్నారు. దీనికి మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉండాలి. కాగా ఎలక్షన్ కమిషనర్ అనుప్ పాండే గత నెలలోనే పదవీ విరమణ చేశారు. తాజాగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కేవలం సీఈవో రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. కొత్తగా ఇద్దరు కమిషనర్లను నియమించుకోవడానికి ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశం ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లోపే తమకు అనుకూలమైన కమిషనర్లను మోడీ ప్రభుత్వం నియమించుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడు అంగీకరించకపోయినా.. ప్రధాని, కేంద్ర మంత్రి ఓట్లతో కమిషనర్ల నియామకం జరిగిపోవచ్చు.
ఒక వేళ ఇద్దరు కమిషనర్లను నియమించకపోతే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల భారం మొత్తం సీఈసీ రాజీవ్ కుమార్ మీద మాత్రమే ఉన్నది.
అంటే.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముగ్గురి సారథ్యంలో నడవాలి. సీఈసీ అంటే పెద్ద తోపేం కాదు. ముగ్గురు కమిషనర్లకు దాదాపు ఒకే రకమైన అధికారాలు ఉంటాయి. కాకపోతే ఆయన ఒక కెప్టెన్ అనుకోవాలి.
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. ఒక్కరి చేతిలోకి వెళ్లిపోయింది. మిగిలిన ఇద్దరు కమిషనర్లను వెంటనే నియమించే అవకాశం లేదు. ఒక వేళ ఉన్నా.. ఆ రెండు పొజిషన్లలోకి ఎవరు వస్తారో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ రాజీనామా ఎవరి ప్రయోజనాల కోసం జరిగిందో తెలుసుకోవాలి? అది తెలుసుకునేలోపే ఎన్నికలు కూడా అయిపోవచ్చు… #భాయ్‌జాన్
Share this Article