Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Short , Sharp and Beautiful….. ‘మూగవాని పిల్లనగ్రోవి’ పిలుస్తోంది…

March 11, 2024 by M S R

………………………………………….

BALLAD OF ONTILLU by KESHAVA REDDY

మార్చి10, ఈ రోజు రచయిత కేశవరెడ్డి గారి
78వ పుట్టినరోజు. శుభాకాంక్షలు చెప్పడానికీ,
కలిసి సిగిరెట్ వెలిగించి కబుర్లు కొట్టడానికి ఆయనిపుడు లేరు.2015 ఫిబ్రవరి 9 గానీ,
పదో తేదీ గానీ కావొచ్చు. హైదరాబాద్ కిమ్స్ లో
వున్న కేశవరెడ్డిని చూడ్డానికి గోరేటి వెంకన్న,
మోహన్, నేను వెళ్ళాము.
స్ట్రెచర్ మీదున్న కేశవరెడ్డి, మమ్మల్ని చూసిన ఉద్వేగంలో, మోహన్ చేతులు పట్టుకుని,
“నేనిక ఎన్నో రోజులు బతకను” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. వలవలా ఏడ్చారు.
కేశవరెడ్డి లాంటి సాహసి, తలవొంచని మనిషి,
లెక్క లేకుండా బతికిన రచయిత, కదిలి కదిలి కంపించిపోతూ కన్నీళ్ళతో దీనంగా చూస్తున్నాడు. ఒక గొప్ప వాగ్గేయకారుడు, ఒక అరుదైన ఆర్టిస్టు,
మరో అద్భుతమైన రచయిత …మాటలు కరువైన నిశ్శబ్దంలో తడబడుతున్న క్షణాల విషాద రాగాన్ని వింటూ నిర్లిప్తంగా నేను.
సుక్క పందినీ, బక్కి రెడ్డినీ,పిల్లన గ్రోవినీ, బైరాగినీ, చివరి గుడిసెని విడిచి, ఫిబ్రవరి 13 న కేశవరెడ్డి
ఎటో వెళ్ళిపోయారు.
ఆయన ‘మూగవాని పిల్లనగ్రోవి’నవలికను
ఆక్స్ ఫర్డ్ వాళ్ళు పబ్లిష్ చేశారు.Ballad of Ontillu పేరుతో దాన్ని కేశవరెడ్డి గారే ఇంగ్లీషులో అనువదించారు. కవర్ మీద వెనుక పేజీలో-

Ads

Bakkireddy lay on his back, his palms beneath his head, staring at the wall-niche and the rolled up document in it. He found himself muttering, ‘This morning, selling my land at auction, I buried my father a second time.’He half rose from the cot on his elbow with the intention of getting up and retrieving the scroll. But at that moment he heard a familiar sound in the loft of the cattle shed.’

ఆక్స్ ఫర్డ్ బుక్ వచ్చినప్పుడు, కేశవరెడ్డి అనే పాత మిత్రుణ్ణి తలుచుకుంటూ, ఎన్నో ఏళ్ళ క్రితం ఆరిస్ట్ మోహన్ రాసిన వ్యాసం ఇది. మీ కోసం, మరిచిపోలేని మనిషి కేశవరెడ్డిగారి కోసం కూడా!
* * *




మీట్‌ మిస్టర్‌ ఆక్స్‌ఫర్డ్‌ రెడ్డి
……………………………….. By Mohan

రెండు కాళ్లూ చాపి, రెండు బూట్లూ టేబుల్‌ మీద పెట్టి బుగ్గల బూరి మొహం, జుట్టు విరబోసుకుని జనాన్ని బెదరేస్తున్న ఈ జుట్టుపోలి సినిమా విలన్‌గాడి ఫొటో నవల వెనక అట్ట మీద ఏం బావుంటుందీ అనుకుంటూ మొహం చిట్లించారు పి.సి. జోషి. ఈయన విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ బాస్‌. చేతిలో ఉన్నది ‘స్మశానం దున్నేరు’ నవల ప్రూఫ్‌. రాసింది కేశవరెడ్డి. ఇదంతా 1979 నాటి మాట.

పబ్లిషింగ్‌ హౌస్‌ పోటీల్లో ప్రైజ్‌ వచ్చిన మూడు నవలల్లో ఇదొకటి.కవర్‌లోంచి మరో ఫొటో తీసిచ్చా. మళ్లీ మొహం మాడ్చాడాయన. ఇది క్లోజప్‌.
అగ్గిపుల్ల వెలిగించి. సిగరెట్‌ ముట్టించి గుప్పుగుప్పు పొగలొదుల్తున్న కేశవరెడ్డి. అగ్గి వెలుతురు ఒక బుగ్గమీదా, అవతల అంతా నీడ.
‘చార్మినార్‌ తాగండి. మీలో మగాడ్నిచూడండి’ అనే యాడ్‌లాగా వెరీ వెరీ ఇన్‌జూరియస్‌ టు లిటరరీ హెల్త్‌. సరే ఆ దుష్ట దుర్మార్గ విలన్‌ లాంగ్‌షాట్‌కంటే ఈ ఇంజురియస్‌ స్మోకింగే బెటర్‌ లెమ్మన్నట్ట ఇదే వేద్దాం అన్నాడాయన. ఆ విలన్‌ ఫొటో నలభై ఏళ్లుగా నా దగ్గర భద్రంగా ఉ౦డబట్టే ‘వార్నీ ఇదా అసలు రంగూ’ అని తమరీరోజుఅనుకోగలుగుతున్నారు.

పబ్లిషింగ్‌ హౌస్‌ బహుమతి ప్రదాన సభలన్నీ పండగల్లా భారీగా జరిగేవి. జర్నలిస్టులు, రచయితలు, కవులు, గొప్ప రాజకీయ నాయకులంతా వచ్చేవారు. ఈసారి సభకి శ్రీశ్రీ వన్తున్నాడు. అప్పటికి విరసం వచ్చింది. అరసాన్ని దుమ్మెత్తిపోస్తోంది. అయినా విశాలాంధ్రతో శ్రీశ్రీ అనుబంధం అలాంటిది. చండ్ర రాజేశ్వరరావు, బొల్లిముంత శివరామకృష్ణ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, విశాలాంధ్ర ఎడిటర్‌ రాఘవాచారి లాంటి సూపర్‌స్టార్స్‌ ఎంతో మంది వచ్చారు. ఈ నవలల ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జ్‌ కె.రాజేశ్వరరావు, నేనూ కలసి ‘స్మశానం దున్నేరు’ ప్రూఫ్‌ బుక్‌ని బ్లాక్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తే హిట్టయింది. ఊళ్ల నుంచి బళ్లు కట్టుకొచ్చిన కవులూ కళాకారులూ రచయితలంతా కొత్త సెన్సేషన్‌ కేశవరెడ్డి కోసం వెతుకుతున్నారు. మూడు నవలలకీ కవర్‌ డిజైన్‌లు గీసిన చంద్ర, టీవీ, నేను కూడా ఎదురు చూస్తున్నాం. చివరికి కేశవరెడ్డి గారు బంక్‌ కొట్టారని తెలిసి డల్‌ అయిపోయాం.చాలా కాలం తర్వాత తెలిసింది. ఆయన ఒక మహిళ మోజులోపడి పెళ్లి చేసుకోడానికి ఉండి పోయాడట. సభ రోజే ఊళ్లో ఆయన పెళ్లట. ఎవరి ప్రయారిటీస్‌ వాళ్లవి.

మనమేదో సాహిత్యం కళా అంటూ ఉద్రేకపడిపోతే అవతలోడు అట్ల ఉండకపోతే ఏంచేస్తాం. అలాగే కిక్కురుమనకుండా నోరు మూసుకున్నాం. తర్వాత ఆయన నవలలు వరుసగా వస్తూనే ఉన్నాయి.కొన్ని సీరియల్స్‌గా. ‘ఇంక్రెడిబుల్‌ గాడెస్‌, సిటీ బ్యూటిఫుల్‌ లాంటివి.1980ల్లో “అతడు అడివిని జయించాడు. మూగవాని పిల్లనగ్రోవి,రాముడుండాడు _ రాజ్యముండాది, ఈమధ్యన ఆమధ్యనా, మునెమ్మ మీద కొల్లేటి చాంతాడంత వాద వివాదాలు సాక్షిలోనే ఎక్కువపెరిగాయి. ఇవన్నీ తెలుగు పాఠకులకి నలభై ఏళ్లుగా తెలిసినవే. కొత్తేం లేదు.

ఈ మధ్యో వింత జరిగింది. మూగవాని పిల్లనగ్రోవి కేశవరెడ్డి తనే ఇంగ్లీషులోకి అనువదించారు. తెలుగు టైటిల్‌ని అలాగే ఉంచి ‘బలాడ్ ఆఫ్ ఒంటిల్లు’ అనే టాగ్ ఇచ్చారు. ఈ నవలని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌వారు అచ్చువేశారు. బుక్‌ షాపులకి చేరి ఇంకా నెలయిందో లేదో…. ‘ఆక్స్‌ఫర్డ్‌ నావెల్లా’ అనే సీరిస్‌లో భారతీయ భాషల్లో నవలలూ కథలూ పాత కొత్త రచయితల గొంతుల్ని వినిపించడం దీని ఉద్దేశం. ఇప్పటికి తమిళ, మలయాళ మరాఠీ, బెంగాలీ రచయితలవి ప్రచురించారు. మామూలుగా ఇలాంటి వాటిని ఎవరో ఇంగ్లీషోచ్చిన వాళ్లు అనువాదం చేస్తారు. ఆమధ్య మహీధర రామమోహనరావు గారి నవలని ఇలాగే వేగుంట మోహనప్రసాద్‌ చేశారు. ఆక్స్‌పర్డ్‌ వాళ్లకే.

రచయితే సొంతంగా అనువాదంచేయడం అరుదు. ప్రఖ్యాత మలయాళ కార్టూనిస్టు, రచయిత ఒ.వి. విజయన్‌ తన ‘కథకింతే ఇతిహాసం’ ను ‘సాగా ఆఫ్‌ ధర్మపురి’ తనే అనువదించుకున్నారు. ఆయన పురాణ గాధల నంకలనాన్ని కూడా ఆయనే ఇంగ్లీషులోకి రాయగా ‘పెంగ్విన్‌’ వారు అచ్చేశారు. అయితే ఆయన ఇంగ్లీషు లెక్చరర్ కనక పెద్ద విశేషమేం కాదు. వృత్తిరీత్యా డాక్టరైన కేశవరెడ్డి తన నవలని ఇంగ్లీషులో సాఫీగా హాయిగా చదువుకునేట్టు రాయడం చాలా చాలా విశేషం.

‘త్రీ ఛీర్స్‌ టు మాన్‌’ అని శ్రీశ్రీ తన కవితలు అనువదించినపుడు బొత్తిగా మహా ప్రస్థానం స్పిరిట్‌ రాలేదేంటని బెంగపడ్డాం కదా. శ్రీశ్రీకి ఇంగ్లీషు, ఫ్రెంచి దర్జాగా వచ్చుగా. ఏంటో వచనానికీ , కవిత్వానికీ తర్జుమాలో తేడా ఉంటుందేమో మనకేం తెలుసు. లింగ్విస్టిక్స్‌ అంటూ భద్రిరాజు, బూదరాజు, చేరా లాగా చదువుకు ఛస్తామా ఏంటి!

బక్కిరెడ్డి పొలం అమ్ముకోవడం, ఆ దస్తావేజుని చూసి చూసి మంచాన పడడం ,మూగవాని పిల్లనగ్రోవిలో చిత్తూరు జిల్లా నేటివిటీతో యాసతో ఎంత విషాదం నింపుతుందో, భూమికీ బక్కిరెడ్డికీ ఉన్న పేగుబంధాన్ని గడ్డిపోచలతో తాళ్లు అల్లి ఎంత గాఢంగా చెప్తుందో , ఇంగ్లీషులోనూ అంతే బలంగా చెప్తాడు రచయిత. ఒంటిల్లు ఊరవతల చెరువు కట్ట అదే పనిగా తెగిపోతుంటే ఓ కన్య సజీవ సమాధి అయి త్యాగం చేసేగాధ కూడాఅంతే సునాయాసంగా రాస్తాడీయన. ఇలాంటి మెలోడ్రమెటిక్‌ ఫోక్‌లోర్‌ని చెప్పేటపుడు ఇంగ్లీషులో విపరీతమైన విక్టోరియన్‌, బిబ్లికల్‌ పదబంధాలు దొర్లించి పాఠకుడ్ని అదరగొట్టాలనే ఆత్రం ఇంగ్లీషు వచ్చిన మానవ మాత్రుడికెవడికన్నా ఉంటుంది. బాంబాస్టిక్‌ పదాల్లో వెర్రి పాఠక మొహాన్ని బొంబార్డ్ చేద్దామని ఏకవికుండదు? ఏరచయితకుండదు?

కానీ ఇలాంటి రంభ, ఊర్వశి డాన్స్‌ల ఆకర్షణకి కేశవరెడ్డి మహర్షి లొంగినట్టు లేదు. తెలుగులో లాగే వాళ్లు ఎవరెవరో పాత్రలు, ఎవడిదో భూమి, ఎందుకో ఈ ఘటనలు నాకేంటి సంబంధం లాగా రాసే రచయిత ఇంగ్లీషులో కూడా అంతే దూరంగా డిటాచ్డ్ గా ఉండే అతి మామూలు ఇంగ్లీషు పదాలే వాడారు.

అది ఎఫెక్ట్ ను ఎంతో పెంచింది.అమాయక పాఠక చక్రవర్తి ఇంకా చూడని చదవని ఒకానొక ఇంగ్లీషు అనువాదం గురించి, కేశవరెడ్డి కళ్లు చారెడేసి అనే చిలవలు పలవులేసి చెప్పడం సాహితీ ఖతం కార్యక్రమం కిందికొన్తుందని, వ్యక్తి హింసనీ ఇప్పుడే వెలిగింది. లేకపోతే రెండు పుస్తకాలూ తమరి ముందు తెరిచి పేరాలకు పేరాలు అటూఇటూ చదివి వినిపించి ‘అకటా ఎంత దయలేని వాడు ఈ కేశవయ్య’ అని ఇంగ్లీషులో నిరూపించాలని ఉంది. కానీ ఇది పాడిగాదు. భావ్యమసలే కాదు.కనక ఓ పనిచెయ్యండి. ఆక్స్‌ఫర్డ్‌ షాపుకెల్లి కొనండి.

రెండొందల యాభై రూపాయలు కష్టం గురూ అంటారా. కొన్న వాడెవడో కనిపెట్టి బెగ్‌, బారో, ఆర్‌ స్టీల్‌ … లేదా నా స్టూడియోకొచ్చి ఏం బొమ్మలు సార్ ఏమి లైనూ, కలర్సూ అని పొగుడుతూంటే
నేను అర్థనిమీలిత నేత్ర ముద్రలోకి
జారుతున్నపుడు ఈ బుక్కుని నొక్కేయండి.
– మోహన్
* * *
అతని ప్రేమను సంపాదించగలిగాను

“స్నేహకాలం కన్నా స్నేహంలోని తీవ్రతయే కదా ప్రధానం!” ఇది అతడు అడవిని జయించాడులో
ఒక ఉవాచ. మోహన్‌తో నా స్నేహం ఏడు సిట్టింగులకే పరిమితం. ఈ స్వల్ప వ్యవధి లోనే
ఏడు సముద్రాలు ఉండేటంతగా అతని ప్రేమను సంపాదించగలిగాను.
ఎంత ప్రేమగాకుంటే నలభై ఏళ్ళకింద ఎవరో
పారేసిన నా ఫొటేను, నా దగ్గర కూడా లేని ఫొటోను, నాకు తెలియకుండా ఇన్నాళ్ళు దాచుకుని,
అదను చూసి బహిర్గతం చేసే నీచ నికృష్టమైన
పనికి అతడు పాల్పడతాడు !
అయినా నా వెర్రిగాని మోహన్ సకల మానవాళినీ అలాగే ప్రేమిస్తాడని లోకమంతా తెలుసు. ఆ విషయం కాస్త ఆలస్యంగా గ్రహించింది నేనే.

-డా.కేశవరెడ్డి, నవలా రచయిత
* * *
కేశవరెడ్డి గారి style అలాంటిది . Short , Sharp and Beautiful …….. Taadi Prakash      9704541559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions